లిపి గురించి వ్రాసిన ముందు టపా చదివిన తరువాత ఇది చదవండి.
ఆ టపాలో చెప్పినట్టు, సాధారణంగా ఒక వాక్యంలో మూడు లిపులు వాడే అవకాశం ఉంది.
ఉదాహారణకి ఈ వాక్యం తీసుకుంటే " 私 は インド え 行きます。 "
నేను----- ఇండియా--- కి------ వెళ్తాను.
వతాషి---వా-----ఇండో----- ఎ-----ఇ-- కిమసు.
-----私 --- は----インド----え---- 行--きます。
--కాం---హిరా---కతా----హిరా---కాం---హిరా
వాక్య నిర్మాణం అచ్చు తెలుగులాగే ఉంది కదా !!, కర్త, కర్మ, క్రియ ( ఆంగ్లం లో అయితే కర్త, క్రియ, కర్మ కదా ). అందుకే జపనీస్ నేర్చుకునేప్పుడు అర్ధాలని తెలుగులోకి మార్చుకుంటూ నేర్చుకుంటే సుళువు అవుతుంది.
జపాన్ భాషలో అక్షరాలు తక్కువ కాబట్టి అన్నీ విదేశీ పదాలు వ్రాయలేరు. ఉదాహారణకి నా పేరు, వీరి దగ్గర ఉన్న అక్షరాలతో నా పేరుని పరపుర్ర అని వ్రాయవచ్చు :( . నేను పని చేసే కంపెనీలో ఐడి కార్డ్ ఇచ్చే దుర్మార్గుడు నా కార్డ్ మీద వ్రాసిన పేరు బరబుర్ర ( ప్రపుల్ల అన్నమాట ), ఈ విషయం నేనా లిపి నేర్చుకున్న తరువాత గాని తెలియలేదు. నాకు ఇలాంటి అనుభవం నా పేరు తమిళం లో వ్రాసినప్పుడు ఎదురయ్యింది. తమిళంలో ’ప్ ర పుల్ ల’ లేదా ’ప ర్ పు ల్ ల’ అని వ్రాస్తారు ( నాకు తెలిసి తమిళ్ లో కూడా ప్రత్యేకంగా ఒత్తులు లేవు ), చదవడం ప్రపుల్ల అనే అనుకోండి అది వేరే విషయం. బ్రబుల్ల అని కూడా చదవవచ్చు ఎందుకంటే ప,ఫ,బ,భ లకి ఒకే అక్షరం కాబట్టి (తమిళ్ లో కూడా అక్షరాలు తక్కువ, కాకపోతే ఒక్కొక్క అక్షరానికి 3,4 పిలుపులు ఉంటాయి ). జపనీస్ కి తమిళ్ కి ఎదో సంబంధం ఉన్నట్టుంది అని నేను కనిపెట్టాననుకుంటే నా కన్నా ముందే 'కాల్డ్వెల్' అనే అతను 19వ శతాబ్దంలోనే కనిపెట్టాడట (ద్రవిడ భాషలతో సంబంధం ఉందని), తరువాత కొందరు దీని పైన పరిశోధన కూడా చేశారట, మాట్లాడే విధానం, పదాలు ఒకేలా ఉన్నాయి అని కొన్ని కనిపెట్టారు కాకాపోతే చాలా మంది దీన్ని కొట్టిపడేసారు, పరిశోధనలు జరిపిన వారు సరైన రుజువులు చూపెట్టలేకపోవడం వల్ల ఆ వాదం మరుగున పడింది.
ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆంగ్లం నుండి తీసుకున్న కొన్ని పదాలని వీరు పలకలేక వీరికి తగ్గట్టుగా పిలుచుకుంటూ జపనీస్ లో ఇలా పిలవాలి అని నేర్పిస్తారు అవేవో వారి పదాలలా. ఉదాహారణకి సూపర్ మార్కెట్ ని 'సూపా' అంటారు, టెలివిజన్ ని 'తెరెబీ' అంటారు, పర్సనల్ కంప్యూటర్ ని 'పాస్కాన్' అంటారు. ఇవి జపాన్ పదాలే అన్నట్టుగా వాళ్ళు నేర్చుకుంటారు, మనకి నేర్పిస్తారు. అలా మాట్లాడితేనే వాళ్ళకి అర్ధం అవుతుంది.
జపాన్ భాషలో లింగ భేదం లేదు (క్రియ కు ) ఆంగ్ల భాషలా, అంటే అతడు, ఆమె లాంటి పదాలు ఉన్నాయి, కాని 'చేసాడు', 'చేసింది', 'చదివాడు', 'చదివింది' ఇలా లింగ భేధాలు లేవు. ఆంగ్లం లో కనీసం 'ఆమె', 'అతడు' అని మాటలు మొదలు పెడతారు, కాని జపనీస్ మాటల్లో సాధారణం గా 'కర్త' గురించి ప్రస్తావన ఉండదు (because it is implicit). ఎదుటి వారితో మాట్లేప్పుడు 'మీరు' అని ఉపయోగించకుండా వారి పేరు తోనే పిలుస్తారు. నా ముందు టపాల్లో చెప్పినట్టు ఇంటిపేరుకి గారు తగిలించి పిలుస్తారు, ఇంటిపేరు కాబట్టి ఆడ, మగ తెలియదు. అందువల్ల దాదాపు అన్ని వాక్యాలలో లింగభేదం కనపడదు. గమ్మత్తేటంటే కొన్నిసార్లు వాక్యాల ద్వారా చెప్పింది ఆడవారో, మగవారో తెలుసుకోవచ్చు, ఎందుకంటే కొన్ని పదాలు కేవలం ఆడవారే ఉపయోగించాలి, కొన్ని కేవలం మగవారే ఉపయోగించాలి.
జపాన్ భాషలో బహువచనం (వస్తువులకి) లేదు. మనుషులకి బహువచనం ఉంది 'మేము', 'వారు' ఇలా, కాని 'అరటిపండ్లు', 'కార్లు' ఇలాంటి పదాలు లేవు. పిలిచేప్పుడు ఒక అరటిపండు, రెండు అరటిపండు, మూడు అరటిపండు ఇలా పిలవాలి. ఈ బహువచనాల్లో కూడా ఒక తిరకాసు ఉంది. ఒకటి, రెండు ఇలా అనేప్పుడు వస్తువును బట్టి ఆ లెక్కించడానికి ఉపయోగించే పదం (ఎన్ని అని సూచించే పదం) మారుతుంది. ఉదాహారణకి కర్రలు, పెన్నులలాంటివి లెక్కపెట్టేప్పుడు ఇచిపన్, నిహన్ అని పిలుస్తారు(ఒకటి, రెండు లా అన్నమాట), టేబుల్ల లాంటివి లెక్కపెట్టేటప్పుడు హితోట్సు, ఫుతట్సు అని పిలుస్తారు (ఇది కూడా ఒకటి, రెండు లా అన్నమాట). ఇలా రకరకాల వస్తువులను వాటి ఆకారాలని బట్టి ఒకలా లెక్కపెట్టాలి. దీని వల్ల జపాన్ భాష చాలా కష్టంగా అనిపించింది.
జపాన్ భాషలో కామాలు, పదాల మధ్య ఖాళీలు ఉండవు. వాక్యాన్ని సరిగ్గా విడదీసి చదువుకోవాలి. చివరలో ఫుల్ స్టాప్ ఉంటుంది ఇలా '。'. జపనీయులు మాటలతో పాటు ముఖభావాలు ఎక్కువగానే పెడతారు.
జపాన్ భాషలో సంధులు లేవు. కాని నేను కనిపెట్టాను. కాకాపోతే ఒకే సంధి, గజడదవాదేశ సంధి ( 'చ' అక్షరం లేదు కాబట్టి 'స' ఆ స్థానంలో ఉందనుకుంటే !!). ఉదాహారణకి: యమ + సాకి = యమజాకి, కన + కవా = కనగవా, తొమొ + తాచి = తొమొదాచి. కాకపోతే ఇది అన్ని సార్లు సరికాదు కొన్నింటికి మాత్రమే వర్తిస్తుంది. ఉదాహారణకి కవా + సాకి = కవాసాకి, కవాజాకి కాదు !!!.
మొత్తం మీద చెప్పాలంటే జపాన్ భాష నేర్చుకోవడం కొద్దిగా కష్టమే ( ఈ పాటికి మీకే తెలిసుంటుంది !!!). చాలా వాటికి ప్రత్యేక నిబంధనలు లేవు. అనుభవంతో తెలుసుకోవడమే. నేను నేర్చుకుందామని మొదలుపెట్టాను, కాని తరువాత మానేసాను. మనకసలే ఆరంభశూరత్వం ఎక్కువ కదా !! చూడాలి మళ్ళీ ఎప్పుడు మొదలుపెడుతానో.