జపాన్ విశేషాలు - 5 (భక్తి, దేవాలయాలు)  

Posted by ప్రపుల్ల చంద్ర in

జపాన్ లో భక్తి గురించి చెప్పాలంటే కొద్దిగా కష్టమే. మొదట నాకు జరిగిన అనుభవాలు గురించి చెప్పి తరువాత నేను తెలుసుకున్న విషయాలు చెబుతాను.

నేను జపాన్ కి వచ్చిన కొత్తలో మా జపనీస్ బాస్ మా అందరిని 'నిక్కో' (ఆ విశేషాలు మరెప్పుడైనా ) అనే ప్రదేశానికి తీసుకువెళ్తా అన్నారు. నిక్కో చాలా బాగుంది. రెండు, మూడు గుడులకు వెళ్ళాము, అన్నీ తోటలతో చాలా అందంగా ఉన్నాయి. నేను గుడిలోపలికి వెళ్లిన ప్రతిసారి ఏదైనా విగ్రహం కనపడుతుందేమో అని చూసేవాన్ని, కాని ఎక్కడా కనపడలేదు, అక్కడక్కడ డ్రాగన్ బొమ్మలు, గుడి బయట కొన్ని విచిత్ర ఆకారాలలో ఉన్న ( చూడటానికి రాక్షసులలా ఉన్న ) విగ్రహాలు కనపడ్డాయి. నేను ఎంత ఆలోచించినా నా బుర్రకు తట్టలేదు. ఇక సరే అని మా బాస్ ని అడిగా 'మనం ఇంతకి ఎవరి గుడికి వచ్చాము' అని, దానికి మా బాస్ కొద్దిగా నవ్వి 'మ్మ్ మ్మ్... నాకు తెలియదు' అన్నారు. అదేంటి తీసుకువెళ్తా అని చెప్పి తీసుకువచ్చి తెలియదంటాడే అనుకొని, సరేలే ఇలా కాదు అనుకొని ఇంకో ప్రశ్న వేసాను. 'మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు' అని, దానికి ఆయన సమాధానం, 'నేను ఎవరిని నమ్మను, నాకు నేనే దేవుణ్ణి' అన్నాడు. ఈ విషయాలను అస్సలే పట్టించుకోము అని చెప్పాడు.



ఇలా అయితే లాభం లేదు, నేనే తెలుసుకోవాలని అంతర్జాలంలో వెతకడం మొదలు పెట్టాను. ఒక పేజి చదువుతుంటే మా జపనీస్ కోలీగ్ ఇదేంటి అని అడిగాడు. జపాన్ లో ఉన్న మతం షింటో గురించి చదువుతున్నాను అని చెప్పాను. ఆ పేజీలో ఉన్న ఒక బొమ్మను (పైన ఉన్న బొమ్మ) చూపెడుతూ నేను ఆ గుళ్ళకు వెళ్తాను కాని దాని పేరు షింటో అని తెలియదు అన్నాడు. నాకు ఆశ్చరం వేసింది. మా బాస్ ని అడిగిన ప్రశ్నే ఈయనను అడిగాను, 'మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు' అని, దానికి ఆయన సమాధానం, 'అందరూ మంచి వాళ్లే'.

నాకు తెలిసిందేంటంటే ఇక్కడ దేవుణ్ణి పెద్దగా నమ్మరు, అలాగని అసలే వదిలెయ్యలేదు. ఇక్కడ ముఖ్యంగా రెండు మతాలు ఒకటి షింటో ఇంకోటి బౌద్ధమతం. కన్ఫ్యూషియస్, క్రిస్టియానిటిలు కూడా ఉన్నాయి, కాని చాలా తక్కువ. ఇక్కడ ఒక 30% మంది దేవుడిని నమ్ముతామని చెబుతారు. మిగతా వాళ్ళు ఏమి చెప్పరు. నమ్మే వారు కూడా రోజు పూజలు చెయ్యరు, ఏదైనా ప్రత్యేక సందర్భాలలోనే గుడికి వెళ్తారు. ఇక వీరు సాధారణంగా పుట్టినప్పుడు జరిగే కార్యక్రమాలు షింటో పద్దతిలో, పెళ్లి క్రిస్టియన్ పద్దతిలో (షింటో పద్దతిలో చేసుకునే వారు కూడా ఉన్నారనుకోండి), చనిపోయినప్పుడు కార్యక్రమాలు బౌద్ధ పద్దతిలో (ఎందుకంటే షింటో లో దీని గురించి ఏమి లేదు) చేస్తారు. అంటే వారికి ఏ మతం లో ఏమి నచ్చితే అదే చేసేస్తారన్న మాట. కాకాపోతే ఎవరూ వీటి గురించి మాట్లాడుకోరు.



ఇక 'షింటో' విషయానికి వస్తే, ఇది జపాన్ లో మొదలైన మొట్టమొదటి మతం. ఇందులో ప్రకృతి దేవతలను పూజిస్తారు. సూర్యుడు, వాయువు అలా. పైన నేను రాక్షసాకారంలో ఉన్న విగ్రహాలు అని చెప్పా కదా, అవి అగ్ని, వాయువు, వరుణుడు ఇలా వీరివన్న మాట. ప్రకృతి దేవతల విగ్రహాలు కాబట్టి అలా గంభీరంగా ఉన్నాయేమో. ఇక గుళ్ళో ఉండే తోటలు చాలా అందంగా ఉంటాయి, ఎంతైనా ప్రకృతి ఆరాధకులు కదా. చాలా రకాల చెట్లు, దీపస్తంభాలు, మంచిగా పేర్చినా రాళ్ళు, చిన్ని చిన్ని సరస్సులు, వీటి వల్ల చల్లగా ఉండే వాతావరణం, అన్నీ చాలా బాగుంటాయి. వాటి అందం గురించి నేను చెప్పడం కన్నా మీరే చూడండి.









బౌద్ధమతం ఇక్కడికి 6 వ శతాబ్దంలో వచ్చింది. చైనా నుండి కొరియా, కొరియా నుండి జపాన్ వచ్చింది. అప్పటి రాజులకు చాలా నచ్చి స్వీకరించారు, చాలా గుళ్ళు కట్టించారు. తరువాత తరువాత బౌద్ధ మతంలోనే చాలా రకాలు వచ్చాయి, మహాయాన బౌద్ధం, వజ్రయాన బౌద్ధం, జెన్ బౌద్ధం అలా చాలానే ఉన్నాయి. ఇంకా ఏంటంటే బౌద్ధాన్ని ఇక్కడ లొకలైజ్ చేసారు. మనదగ్గరి చాలా పేర్లు ఇక్కడి పేర్లకు తగ్గట్టు గా మార్చారు. ఉదాహారణకి వినాయకుణ్ణి 'కాంగీ-తెన్' అంటారు, శివుడిని 'దైజిజాయ్-తెన్' అని అంటారు(బౌద్ధమతం తో పాటు ఇవి వచ్చుంటాయి, ఎలా వచ్చాయో నాకు తెలియదు). నేను కమకుర, క్యోటో వెళ్ళినప్పుడు అక్కడి గుళ్ళలో భారతీయ దేవుళ్ల విగ్రహాలను చాలానే చూసాను. విష్ణు, బ్రహ్మ, నారదుడు, తుంబురుడు ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి. వాటి క్రింద మొదలు జపనీస్ పేరు, తరువాత సంస్కృతంలో ఈ పేరు అని రాసి ఉన్నాయి (ఈ గుళ్ళలో ఫోటోగ్రఫి నిషిద్ధం అందుకే ఫోటోలు తియ్యలేకపోయాను). అంతేకాక బౌద్ధమతం షింటో తో బాగా కలిసిపోయింది. అందులో ఉండే ప్రకృతి దేవతలను వరణుడు, ఇంద్రుడు ఇలా వీరి తో పోల్చి అంతా ఒకటే అనే భావన తీసుకొచ్చి ఉంటారు. అప్పటి గుళ్ళు షింటో, బౌద్ధం రెండు కలిపి కట్టించారు.



గుడిలోపలికి వెళ్ళే ముందు చెప్పులు విప్పడం, చేతులు కడుక్కోవడం, ఊది బత్తీలు వెలిగించడం, క్యాండిల్ వెలిగించడం, దీపలు వెలిగించడం, గంట కొట్టడం, ఏదైన కోరిక ఉంటే చీటీ రాసి గుడి దగ్గర కట్టడం, హుండీ లో డబ్బులు వేయడం ఇలా చాలా ఉన్నాయి మనదగ్గరిలా. నేను వెళ్లిన ఒక గుడిలో డబ్బులను అక్కడ ఉన్న నీటితో తడిపితే డబ్బులు రెట్టింపు అవుతాయని (అంటే భవిష్యత్తులో) నమ్మకం అట. చాలా మంది అలా చేస్తూ కనపడ్డారు. కొందరైతే కాగితం నోట్లు కూడా తడుపుతున్నారు. తరువాత అక్కడ ఉన్న ఊది బత్తీల వేడిలో ఆరబెట్టారు. అది చూడగానే మన ఆసియా వాళ్లకి ఇలాంటి నమ్మకాలు చాలా ఉంటాయి అని అనిపించింది.





నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, కొన్ని గుళ్ళల్లో డ్రాగన్ బొమ్మలు ఉండటం. డ్రాగన్ అనగానే నా దృష్టిలో మంటలు చిమ్ముతూ అందరిని భయపెట్టే ఒక విలన్. అలాంటి విలన్ ను వీళ్లు పూజించటం ఏంటి అనే ప్రశ్న నా మెదడును తొలిచేది. నేను క్యోటో లో ఒక గుళ్ళో 'వాసుకి, ది డ్రాగన్ కింగ్' అని చూసిన తరువాత నా సందేహం తీరింది. అంటే మనదగ్గరి పాములు ఇక్కడి డ్రాగన్ లు అన్నమాట. మనదగ్గర పాములను పూజించినట్టు ( నాగుల చవితి, నాగుల పంచమి ) ఇక్కడ డ్రాగన్ లను పూజిస్తారు. కాని ఇంకో అనుమానం ఏంటంటే పాములు అయితే ఉన్నాయి, కాని డ్రాగన్ లు లేవు కదా అని. మళ్లీ ఆలోచిస్తే, మనదగ్గర ఆదిశేషువు, వాసుకి లా పది తలల పాములు లేవు కదా ( ప్రస్తుతం ) అలాగే డ్రాగన్ లు కూడా అని అనుకున్నాను. అలాగే మంచి డ్రాగన్ లు ఉంటాయి చేడువి ఉంటాయి. ఎప్పటిలా చెడు వాటిపైన మంచివి విజయం సాధిస్తాయి.



రెండో ప్రపంచ యుద్దం తరువాత ప్రజలు దేవుడు, మతం గురించి పట్టించుకోవడం మానేసారు. మొదట చెప్పినట్టు ఏ మతం లో ఏది నచ్చితే అది చేస్తారు. దైనందిన జీవితంలో షింటో, బౌద్ధ మత పద్దతులు అవలంభిస్తారట, కాని ఆ విషయం వారికే తెలియదు.

This entry was posted on Thursday, September 4, 2008 at 7:27 AM and is filed under . You can follow any responses to this entry through the comments feed .

4 comments

ప్రపుల్ల గారు,అది >>కన్ ఫ్యూజన్<<,కాదండి కన్ఫ్యూషియస్ స్థాపించినది.అలాగే "అప్పటి రాజులు చాలా నచ్చి స్వీకరించారు,కాకుండా అప్పటి రాజులకు అనుంటే బాగుండేది.
ఇక అసలు సంగతి జపనీయుల మతాచారాల గురించి పుట్టిబుద్ధెరిగినాక(ఫిలాసఫీలో యమ్మే చేసి కూడా)ఇప్పుడే మొదటిసారి తెలుసుకున్నాను అంటే మీరు నమ్మగలరా?చాలా చక్కగా రాస్తున్నారు,కొనసాగించండి.

September 4, 2008 at 11:21 AM

జపనీయులని నేను అజంతా, ఎల్లోరా, అమరావతి, నాగార్జున కొండ,బైలుకుప్పె వంటి బౌద్ధ సంబంధమైన ప్రాంతాల్లో చాలా సార్లు చూశాను. అందువల్ల కంఫ్యూషియస్ వంటి ఇతర మతాల గురించి లవ లేశం తెలిసినా వాళ్ళల్లో ఎక్కువమంది బుద్ధుడినే పూజిస్తారని అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు మీరు పది మందిని కనుక్కుని మరీ వివరంగా వారి భక్తి సంప్రదాయాలను గురించి రాస్తే చదివి ఆశ్చర్యం కలిగింది.

ఫొటోలు కూడా చాల బాగున్నాయి. ఇప్పుడప్పుడే జపాన్ నించి తిరిగొస్తే ఊరుకునేది లేదు తెలుసా?

September 4, 2008 at 6:30 PM
Anonymous  

ప్రపుల్లా చలా బగా రాసావు. ఇలాగే బ్లాగింగ్ కొనసాగించాలని కోరుకొంటూ ....

September 4, 2008 at 10:17 PM

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి ,
నెనర్లు, మార్చానండి !!!
మీరన్నది నాకు అర్ధం అవ్వలేదు, మీరు జపాన్ కి సంబంధించి ఏమైనా చదివారా??
దూరంగా ఉన్న ఒక దేశం గురించి తెలియడం అంటే కొద్దిగా కష్టమే కదండీ !!!

@సుజాత ,
నెనర్లు,
నాకు తెలిసి మీరు టిబెట్ వాళ్లను చూసి ఉంటారు. మీరు చెప్పిన ప్రదేశాలకి వాళ్లే ఎక్కువ వస్తూ ఉంటారు. జపాన్ వాళ్లకి భక్తి అంతగా లేదండీ !!!
తిరిగొచ్చే విషయం అంటారా... కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు....

@Murali.Marimekala ,
నెనర్లు,

September 5, 2008 at 6:42 AM

Post a Comment