జపాన్ విశేషాలు - 3 (జీవన విధానం)  

Posted by ప్రపుల్ల చంద్ర in



జపాన్ లో ’bow' చేయడం నమస్కరించే పద్దతని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. (పై ఫోటో గూగుల్లో దొరికింది)
ఇక్కడ సాంప్రదాయ దుస్తువులను ’కిమోనో’ అని అంటారు. కాని అవి సాధారణంగా ఎవరూ వేసుకోరు, ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప. ’కిమోనో’ లాగే ఉండి కొద్దిగా పలుచగా ఉండే బట్టలని ’యుకాతా’ అంటారు. ఒక చిన్న పాప ’కిమోనో’ వేసుకుంటే ఫోటో క్లిక్కాము చూడండి. (ఫోటోపై క్లిక్ చేస్తే పెద్దదిగా చూడవచ్చు)



జపాన్ వాళ్ల పద్దతులు కొన్ని విషయాలలో మన పద్దతులతో సారూప్యత కనపడుతుంది. వీళ్లు మనలా రోజూ అన్నం ( మన దగ్గరి కన్నా చాలా ముద్దగా ఉంటుంది ) తింటారు. వీళ్ల పేర్లు మన తెలుగు పేర్లలలా మొదలు ఇంటి పేరు, తరువాత వారి పేరు. కాకాపోతే వీళ్లు ఇంటి పేర్లతో పిలుచుకుంటారు. ’సాన్’ అని ( తెలుగులో ’గారు’ ) పేరుకి తప్పని సరిగా తగిలించి పిలుస్తారు.

ఇక్కడ ఇల్లులు చిన్నగా ఉంటాయి. ఇంట్లోకి రాగానే చెప్పులు ముందు గదిలోనే విప్పి లోపలికి వెళ్ళాలి. ఇంట్లో తిరగడానికి ప్రత్యేకమైన చెప్పులు ఇస్తారు. నేను చూసిన చాలా ఇళ్లలో ముందు గదిలోనే వంటగది ఉంటుంది. జపాన్ వారి సాంప్రదాయం ప్రకారం అన్ని గదులకు ఫ్లోరింగ్ మన దగ్గరి చాప లా ఉండే ఒక మెటీరియల్ తో వేస్తారు, దాన్ని ’టటామి మ్యాట్’ అంటారు. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది, చాలా తేలికగా ఉండటం వల్ల భూకంపం వచ్చినప్పుడు కూలిపోయి క్రిందపడ్డా ఎవరికి ఏమి కాదు, ఇలా చాలానే ఉన్నాయి. ఈ మధ్య అంతా పాశ్చాత్యం అయిపోతుండేసరికి ఎదో ఒక గదిలోనే ఈ ఫ్లోరింగ్ వేస్తున్నారు(ముఖ్యంగా పడుకునే గదిలో). చెప్పులు వేసుకొని ఈ ఫ్లోర్ పై అస్సలు అడుగుపెట్టకూడదు. గదుల వైశాల్యం గురించి చెప్పేప్పుడు ఇన్ని ’టటామి మ్యాట్’ లు అని చెబుతారు.


పై ఫోటోలో ’టటామి మ్యాట్’లు డైనింగ్ టేబుల్ చూడవచ్చు.

వీరు భోజనం క్రింద కూర్చొని తింటారు ( ఏవో చాలా తక్కువ హోటల్లలో తప్ప ). వీరి సాంప్రదాయం ప్రకారం మోకాళ్ల మీద కూర్చొని తినాలి, కాని అందరూ మాములుగానే కూర్చుంటారు. తినే ముందు మన ’వెంకటేష్’ లా పెద్ద ప్రార్ధనలు చేయరు ’ఇతదాకిమస్’ (I gratefully receive) అంటూ మొదలు పెడతారు. త్రాగే ముందు ’చీర్స్’ లా ఇక్కడ ’కాంపై’ అని అంటారు. అందరి కన్నా చిన్న వారే ఎక్కువగా వడ్డిస్తారు. ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఇక్కడ కూడా చాలా పద్దతులు వున్నాయి. కాకాపోతే ఏ పద్దతైనా విదేశీయులు పాటించకపోతే ఏమి అనుకోరూ. ’గొచిసోసమా దేశితా’(Thank you for the meal) అంటూ తినడం ముగిస్తారు.

’Tea ceremony' జపనీస్ సాంప్రదాయం లో ఒక భాగం. ఎవరినైనా అతిధులను పిలిచి ఒక ప్రత్యేక పద్దతిలో జపనీస్ టీ ( గ్రీన్ టీ, ఆకుపచ్చ రంగులో ఉండి చేదుగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచింది, ఇక్కడ అందరికి చాలా ఇష్టమైన టీ ) తయారుచేసి అందరూ కలిసి త్రాగుతారు. మమ్మల్ని మాత్రం ఇంతవరకు ఎవరూ దానికి పిలువలేదు :(.

ఇక్కడ ప్రత్యేకంగా పండుగలు ఉండవు. కాకాపోతే ఒక్కొక్క కాలంలో ఏవో చిన్న పండుగలు చేసుకుంటారు. వేసవి కాలంలో హనాబీ అని చేసుకుంటారు, వసంతకాలంలో అందరు కలిసి తోటలకు వెళ్లి భోజనం చేస్తారు (మన వన భోజనాల్లా !!) దాన్ని ’సకురా’ అంటారు. ఇక్కడ గమ్మత్తుగా అనిపించిన విషయం ఏంటంటే ఎప్పుడు వసంతకాలం వస్తుందో ఎప్పుడు అయిపోతుందో తేదీలతో సహా ముందే చెప్పేస్తారు. చలికాలం, వసంతకాలం, వేసవి కాలాలలో వారం రోజుల సెలవులు ఇస్తారు, సరదాగా గడపడానికి. సంవత్సరానికి దాదాపు 30 సెలవులు ఉంటాయి ( ఆ 3 వారాల సెలవులతో పాటు బ్యాంక్ సెలవని, ముసలి వాళ్ల రోజని ఏవో సెలవులు ఉంటాయి). డిసెంబర్ 31 రాత్రి మాత్రం కుటుంబ సభ్యులంతా కలిసి గడపడానికి ప్రాముఖ్యతనిస్తారు, లేకపోతే గుడికి వెళ్తారు, రాత్రి 12 గంటలకు గుళ్ళో 108 సార్లు గంటలు కొడతారు. రాత్రి వీలు కాకపోతే మరునాడు గుడికి వెళ్తారు.

ఇక్కడ సాధారణంగా తమ జీవితభాగస్వాములను తామే వెతుక్కుంటారు. లేకపోతే ఈ మధ్య మన దగ్గర ఉంటున్నట్టుగా ’స్వయంవరం’ వంటి వాటిలో ఎంచుకుంటారు. ’డేటింగ్’ సైట్లు కూడా చాలానే ఉన్నాయి. చివరికి తల్లిదండ్రులు వెతుకుతారు మన దగ్గరిలా !!!. ఏదీ కుదరకపోతే పెళ్లే చేసుకోరు, ఒంటరిగా ఉండిపోతారు. మా కంపెనీలో కూడా అలా ఉండిపోయినవారు ఉన్నారు. పెళ్లి ఖర్చులు పెళ్లికొడుకు, పెళ్లికూతురు (తల్లిదండ్రులు కాదండోయ్) సగం సగం భరిస్తారు. పెళ్ళి ఖర్చులు కూడా చాలా ఉంటాయి. వచ్చిన వాళ్లందరికి వాళ్లే బహుమతులు ఇవ్వాలట, అందుకే ఎక్కువ మందిని పిలవరట.

వీరు తినే ఆహారం (Diet), చేసే వ్యాయామాల వల్ల చాలా రోజులు బ్రతుకుతారు !!! అందరూ ఏదో ఆటలో ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. మా టీమ్ లో ఒకరికి సైక్లింగ్ ఇష్టం, అతను వారంతంలో దాదాపు 200 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాడు, ఒకరు సర్ఫింగ్, ఒకరు యాచింగ్, ఒకరు టెన్నిస్, ఒకరు ఫుట్ బాల్, ఒకరు స్విమ్మింగ్ ఇలా ఎదో ఒకటి ఉంటుంది. వారాంతాలు వాటితో కాలక్షేపం చేస్తారు. వయసు తో సంబంధం లేకుండా చాలా మంది వీడియో గేమ్స్ ఆడుతారు (ముసలి వాళ్ళ తో సహా). ’సూమో’ ఇక్కడ సాంప్రదాయక ఆట.

ఇక్కడి ఆహారం గురించి వచ్చే టపాలో......

జపాన్ విశేషాలు - 2 ( మనుషులు )  

Posted by ప్రపుల్ల చంద్ర in



"దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్". జపాన్ వాళ్ళను చూస్తే ఈ మాటలు చాలా నిజమనిపిస్తాయి, మనుషులు మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుందని !!! ఇక్కడ అందరికీ క్రమశిక్షణ ఎక్కువ, అన్నీ పద్దతిగా చేస్తారు. నేను ఇప్పటి వరకు ఎవరి మొహములో కూడా చిరాకు కాని కోపం కాని చూడలేదు. (మరీ 100% అని కాదు, అలాంటి వారు కూడా అక్కడక్కడ ఉంటారట, కాని నేను చూడటం తటస్ఠించలేదు). ఇక ’గొడవ’ అనే మాట కూడా వినలేదు. చాలా నెమ్మదస్తులు, ఎప్పుడు సహాయం అడిగినా చాలా ఓపికగా, నవ్వుతూ చేస్తారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కకి జరిగి దారి ఇస్తే ’sorry, thank you'(జపనీస్ లో, సుమిమసేన్, అరిగతోఉ గొజయిమస్) అని చెప్తారు, ఇంత చిన్న విషయానికి కూడా చెప్తారా అని ఆశ్చర్యపడటం మా వంతవుతుంది. ఇక దుకాణాలలో వీరు ఇచ్చే గౌరవం ఎంత చెప్పినా తక్కువే. జపనీయులు చాలా కష్టపడి పనిచేస్తారు. కొందరు ప్రొద్దున్నే 9 గంటలకు ఆఫీస్ కి వచ్చి రాత్రి 12 గంటలకు ఇంటికి వెళ్తారు. పని కూడా చాలా నెమ్మదిగా చేస్తారు (మనతో పోలిస్తే !!! ). కాని ఎన్ని రోజులు చేసినా చివరికి perfect గా చేస్తారు. వీళ్ళు perfection కోసం ఎంత ప్రయత్నిస్తారో ఈ క్రింది ఫోటో చూడండి ( తమాషాగా :) ).



వీళ్లు చాలా మొహమాటస్తులు. అంత త్వరగా ఎవరితో మాట్లాడరు. కాని ఎప్పుడైనా తినడానికి పార్టీలకు వెళ్లినప్పుడు మాత్రం వాళ్లలోని ’చంద్రముఖి’ బయటికి వస్తుందనుకుంటాను, చాలా మాట్లాడుతారు, పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటారు. ముందురోజు వరకు వీరినా నిశ్శబ్దంగా ఉండటం చూసాము అని ఆశ్చర్యమవుతుంది. అది ’మందు’ ప్రభావం అయి కూడా ఉండొచ్చు!!. తరువాత రోజు మళ్ళీ మాములుగా ఉంటారు, అస్సలు మాట్లాడరు. కొందరయితే అస్సలు పరిచయమేలేనట్టుగా (పార్టీలో కొత్తగా పరిచయమైనా వాళ్లు) ప్రవర్తిస్తారు. వేరే కంపనీలలో పనిచేసే నా మిత్రులకు కూడా ఇదే అనుభవం. జపనీయులు ఏదైనా నచ్చినా నచ్చక పోయినా నచ్చిందనే చెబుతారు, చెప్పాకదా వీళ్లకి మొహామాటం ఎక్కువ. వాళ్ల మనసులో మాట అస్సలు చెప్పరు, ముందు వాళ్లు ఏమైనా అనుకుంటారని. కాని అప్పుడప్పుడైనా ముక్కుసూటిగా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంటుంది నాకు. వీళ్లు అంత సుళువుగా మనని నమ్మరు, నమ్మకం కుదరడానికి చాలా సమయం తీసుకుంటారు.

ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాముఖ్యం ఇస్తారు, ఒకరి విషయాలలో మరొకరు అస్సలు తలదూర్చరు. అలా అని విచ్చలవిడితనం కూడా ఉండదు. పిల్లలు ఎంత అల్లరి చేసినా ఏమీ అనరు, చాలా ఓపికగా ఉంటారు. పిల్లలు పెద్దగా అరుస్తూంటే వద్దనడం మాత్రమే చూసాను ( ప్రక్క వాళ్లకి ఇబ్బందని ). పిల్లలకి చిన్నప్పటి నుండే అన్ని పద్దతులు నేర్పుతారు. ఉదాహారణకి ట్రైన్స్ లో వెళ్ళేప్పుడు సీట్స్ మీద నిలబడి ఆడుకోవాలంటే పిల్లలు వాళ్ళ షూ విప్పుకోవాల్సిందే, లేకపోతే తల్లిదండ్రులు సీట్ ఎక్కనివ్వరు !!! రోజూ చాలా కష్టపడే వీరు వారాంతంలో మాత్రం సరదాగా వాళ్ల పిల్లలతో పార్కుల్లో ఆడుతూ కనపడతారు. ఇక్కడ పిల్లలను ముద్దు చేయడం నేను చూడలేదు. మన దగ్గర పిల్లల బుగ్గలు గిల్లడం, ముద్దు పెట్టుకోవడం మామూలు కదా, ఇక్కడ మాత్రం నాకు కనపడలేదు, అది ఎందుకో మాత్రం నాకు తెలియదు. ఒక వయసు వచ్చేవరకే తల్లిదండ్రుల మీద పిల్లలు ఆధారపడతారు పాశ్చాత్య దేశాలలా. తరువాత వాళ్లే పనులు చేస్తూ చదువుకుంటారు. చాలా తక్కువ మంది తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటారు.


ఫోటో: తన కూతురితో ఆడుకుంటున్న మా బాస్

జపాన్ లో భద్రత చాలా ఎక్కువ, రాత్రి 1,2 గంటల వరకు ఆడవాళ్లు ఒంటరిగా తిరుగుతూ కనపడతారు. ఎప్పుడైనా మేము తలుపులు సరిగ్గా వేయకుండా భయటికి వెళ్లినా పెద్దగా భయపడం, ఎందుకంటే ఇక్కడ ఏమి జరగదని నమ్మకం. కాని మా జాగ్రత్తలో మేము ఉంటాము అది వేరే విషయం అనుకోండి.

ఇక్కడ కొందరు ఒంటరిగా ఉండటం వలన మానసికంగా కౄంగి పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు జీవితం మరీ రొటీన్ గా ఉందని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు, వేరే వాళ్ళని చంపిన సంఘటనలు, కొందరు వీడియో గేములు బాగా ఆడి ఆ ప్రభావం తో వేరే వాళ్ళని చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ తప్పు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి, ఉరిశిక్షలు చాలానే వేస్తారు, అందుకే ఇక్కడ చిన్న చిన్న తప్పులు చేయడానికి కూడా భయపడతారు. ఆక్సిడెంట్స్ చేస్తే చాలా డబ్బులు ఫైన్ కట్టాలట అందుకే ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర చాలా నెమ్మదిగా నడుపుతారు. మనుషులు రోడ్డు దాటేంత వరకు ఆగి మరీ వెళ్తారు.

నాకు ఆశ్చర్య మైన విషయం ఏంటంటే ఇక్కడ కూడా విడాకులు తీసుకోవడం ఎక్కువే!. బయటికి మంచిగా కనపడే వీళ్లు కూడా గొడవలు పెట్టుకొని విడిపోతారు. రోజులో ఎక్కువ శాతం పని చేస్తూ ఉండటం వల్ల ఒకరితో ఒకరు గడపలేకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. ప్రపంచ యుద్ద సమయంలో చాలా కౄరంగా ఉండేవారట. ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. అపరిచితుడు సినిమాలో చివరలో చూపెట్టినట్టు మొత్తం చికిత్స అయిపోయిన తరువాత కూడా అప్పుడప్పుడు లోపల ఉన్న అపరిచితుడు బయటికి వచ్చినట్టు, వీళ్లకు అప్పటి కౄరత్వం అప్పుడప్పుడు బయటికి వస్తుందేమో !!!!.

జపాన్ విశేషాలు - 1  

Posted by ప్రపుల్ల చంద్ర in



జపాన్ ను జపనీయులు ’నిహాన్’ లేదా ’నిప్పాన్’ అని పిలుస్తారు. మనము ఇండియాని ’భారతదేశం’ అని పిలిచినట్టుగా !!. నిప్పాన్ అని అధికారికంగా ఉపయోగిస్తారు, నిహాన్ అని వాడుక భాషలో ఉపయోగిస్తారు. నిహాన్/నిప్పాన్ అంటే ’సూర్యుడికి మూలమైనది’ అంటే ’సూర్యుడు ఉదయించే దేశం’ అని అర్ధం. జపాన్ జాతీయపతాకం కూడా ఎరుపు రంగులో ఉండే ఉదయించే సూర్యుడే.

జపాన్ దాదాపు 3,000 ద్వీపాల సమూహం. అందులో నాలుగు ద్వీపాలు చాలా పెద్దవి. దాదాపు 70% పర్వతాలతో నిండి ఉంది. జపాన్ 4 భూమి పలకల ( earth plates ) కూడలిలో ఉండే సరికి ఇక్కడ భూకంపాలు చాలా ఎక్కువ. వీటి కారణంగా అగ్నిపర్వతాలు కూడా ఎక్కువగానే వున్నాయి. జపాన్ లో పెద్దదైన ఫుజి మహాపర్వతం కూడా ఒక అగ్నిపర్వతమే. చెప్పాలంటే రోజూ ఎదో ఒక ప్రాంతంలో వస్తూనే ఉంటుంది, సంవత్సరానికి దాదాపు 1500 భూకంపాలు నమోదు అవుతాయి. ఇక్కడ ఇళ్లు కూడా చెక్కలతోనే కడతారు (పెద్ద పెద్ద భవనాలు తప్ప). భూకంపం రెక్టర్ స్కేల్ పై 6-7 వరకు వచ్చినా తట్టుకునే విధంగా ఈ ఇళ్లు ఉంటాయి. చిన్న చిన్న భూకంపాలు రావడం ఒకవిధంగా మంచిదే, ఒక్కసారే పెద్దది వస్తే కష్టం కదా మరి !!!

జపాన్, 13 కోట్ల జనాభాతో ప్రపంచంలో పదవస్థానంలో ఉంది. కాకాపోతే ఇప్పుడు ఇక్కడ చాలా మంది పెళ్ళిళ్లు, పిల్లల మీద ఇష్టత చూపెట్టడం లేదు. అందువల్ల జనాభా తగ్గిపోతోంది. ఇక్కడి ప్రజల సరాసరి జీవితకాలం 82 సంవత్సరాలు. అయ్యేసరికి యువకుల సంఖ్యకన్న ముసలివాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఒకసారి మాటల్లో నాకు తెలిసిందేంటంటే, ఇక్కడ ముసలి వాళ్ళకోసం బడ్జెట్ లో చాలా భాగం కేటాయిస్తారట. వారి సంఖ్యపెరిగే సరికి యువకులపై పన్ను భారం చాలా పడుతోంది. ఈ విషయం గురించి మా బాస్ ఇలా చెప్పారు "నేను పన్ను ఎక్కువ కడుతున్నా అని ఎప్పుడూ భాదపడను, ఎందుకంటే వాళ్ళే జపాన్ ని నిర్మించారు, రెండో ప్రపంచ యుద్దంలో దాదాపు నాశనమైన జపాన్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉందంటే వాళ్ళే కారణం, వాళ్ళని చూసుకోవడం మా భాద్యత." నిజమే వాళ్ళని ఎంత పొగిడినా తక్కువే !!!. రెండో ప్రపంచ యుద్దంలో దాదాపు 70 నగరాలు నాశనమైయ్యాయి. ఆ యుద్దంలో ఓడిపోయిన తరువాత వీరికంటూ ప్రత్యేకంగా సైన్యం లేదు, జపాన్ రక్షణ అమెరికానే చూసుకుంటోంది. జపాన్ చుట్టూ అమెరికా వాళ్ళ యుద్దనౌకలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వీళ్లకంటూ ఒక సైన్యం ఉండాలని ఆలోచిస్తున్నారు.

ఒకప్పుడు సైన్యంలో బలంగా ఉన్నవారు ఇప్పుడు ఆర్ధికంగా చాలా బలంగా ఉన్నారు. అక్షరాస్యత కూడా 99 %. ఇన్ని పర్వతాలు ఉన్నా, యుద్దంలో అంత నష్టపోయినా, ఎప్పుడూ భూకంపాలు వస్తున్నా, అన్నింటిని అధిగమించి ఆర్ధిక రంగంలో మొదటి మూడు స్థానాలలో స్థానం సంపాదించారు. ఒక్క యెన్ ఇప్పుడు దాదాపు 40 పైసలు. ( మరీ 40 పైసలే అనుకోకండి, వీళ్ళ కరెన్సీ అలా ఉంది అంతే !!, మన దగ్గర లాగా రూపాయలు/పైసలు ( డాలర్/ సెంట్ , పౌండ్/పెన్ని) అని వేరు గా కాకుండా ఒక్క యెన్ మాత్రమే ఉంది, కాబట్టి అంత తక్కువ నుండి మొదలవుతుంది !! ).

జపాన్ అంటే ముందుగా ఎలక్ట్రానిక్స్, రోబోట్స్, ఆటో మొబైల్ కంపెనీలు గుర్తుకు వస్తాయి. క్రింద ఉన్న జపాన్ కంపనీల పేర్లు చూడండి, అవి చూస్తే ఈ దేశం ఇంత అభివృద్ది చెందిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా.

ప్రధాన ఎలక్ట్రానిక్ కంపెనీలు :
Sony, Canon, Casio, Hitachi, Toshiba, Panasonic/National, Fujitsu, Sharp, NEC, TDK, JVC, Roland, Fujifilm, Pioneer, Kyocera, Mitsubishi, Nikon, Yamaha, Citizen Watch, Pentax, Olympus, Nintendo, Sanyo, Epson, Sansui, Akai, Sega, Konica Minolta, Maxell, Kenwood, Seiko.

ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు :
Toyota, Honda, Nissan, Suzuki, Yamaha, Kawasaki, Mitsubishi, Isuzu, Mazda.

ఇంకా మరిన్ని జపాన్ విశేషాలు వచ్చే టపాలో.

సురాజ్య మవ్వలేని స్వరాజ్యం ఎందుకని ?  

Posted by ప్రపుల్ల చంద్ర in

21 జనవరి 2007, ఆదివారం, వారాంతం కాబట్టి ఆ రోజు తెల్లవారుజామున 11 గంటలకే లేచాము. ఏదో కొనాలని యం.జి.రోడ్ కి వెళ్దామనుకున్నాము. బద్దకం విదిల్చుకొని తొందరగా వంట చేసుకొని నేను నా ఫ్రెండ్ సందీప్ బయటపడ్డాము. మన అభిమాన బెం.మ.సా.సం (BMTC) ఎక్కి రెండు యం.జి.రోడ్ కి టికెట్ తీసుకున్నాము. రోడ్ మీద అన్ని కాషాయం జెండాలు ఉన్నాయి. ఆర్.ఎస్.ఎస్ వాళ్లవి ఏవో సమావేశాలు ఉన్నాయనుకున్నాము. ఎప్పుడూ సందడిగా ఉండే అలసూర్ లో అంతా నిర్మానుష్యంగా ఉంది, ఇదేంటి ఇలా ఎప్పుడు లేదే, ఆదివారం మధ్యాహ్నాం అయ్యేసరికి అలా ఉందేమో అనుకుంటుండగా రోడ్డు మీద కొందరు పోలీస్ లు నిలబడి వేరే రూట్ లో బస్సు ను పంపిస్తున్నారు, అక్కడే ఆ సమావేశం జరుగుతుందని మేమే ఒక నిర్ధారణకు వచ్చాము.

బస్సు అలసూరు చెఱువు చుట్టూ తిప్పుతూ ట్రినిటి సర్కిల్ వైపు వెళ్తోంది. ఒకచోట బస్సు ఆగిపోయింది, బెంగళూరు వాసిని గనక ట్రాఫిక్ జామ్ లు కొత్తకాదు, అసలే అన్ని బస్సు లు దారి మరలిస్తున్నారు కాబట్టి ఎప్పటికి యం.జి.రోడ్ కి వెళ్తామా అని కూర్చున్నాము. ఏదో గోల వినబడటం మొదలయ్యింది. మా బస్సు లో వాళ్లు కూడా దిగి ఏదో చూస్తున్నారు. సరే మనమూ చూద్దామని కిందికి దిగాము, కాని ఏమి కనపడటం లేదు, చాలామంది వెనక్కి వస్తున్నారు. పెద్ద ట్రాఫిక్ జామ్ ఏమో అలా వెళ్లడం కష్టం అని జనాలు వస్తున్నారేమో అనుకున్నాము. కాని ఏదో పగలగొడుతున్న శబ్దం, నెమ్మదిగా ఆ శబ్దాలు పెద్దగా వినపడుతున్నాయి. మేము కొద్దిగా ముందుకు వెళ్లి చూస్తే కాషాయం జెండాలు పట్టుకొని కొందరు రాళ్లతో ఒక్కొక్క బస్సు అద్దాలు పగులగొడుతూవస్తున్నారు. మా బస్సు అద్దాలు కూడా పగులగొట్టారు. ఏవో చిన్నచిన్న గొడవలు చూడటం తప్ప ప్రత్యక్షంగా ఇలా చూడటం అదే మొదటిసారి. ఇదేం మాయరోగం వీళ్లకి, వాళ్ల సమావేశం వాళ్లు చూసుకోక ఇదేంటి అనుకొని అక్కడే ఉంటే మా మీదికి రాళ్లు విసురుతారేమోనని మేము వెనక్కి వెళ్లాం.

అక్కడ నుండి శివాజినగర్ మీదుగా మెజిస్టిక్ వెళ్లే బస్సులు కనపడ్డాయి, సరేలే ఎలాగు బస్సులు వెళ్తున్నాయి కదా అని ఒక బస్సు ఎక్కాము. మాకు ఏమి తెలుసు పద్మవ్యూహం లోకి అడుగుపెడుతున్నాము అని. బస్సు ఎక్కగానే రెండు టికెట్లు మెజిస్టిక్ కి తీసుకున్నాము. కండక్టర్ డ్రైవర్ తో 'ఎక్కడ ఆపకుండా వెళ్లు' అని చెబుతున్నాడు. అక్కడ గొడవ అవుతుంటే ఈయన ఇక్కడ ఎందుకు కంగారు పడుతున్నాడో అర్ఠం అవ్వలేదు. కాని అక్కడ మాత్రం అంతా కోలాహలంగా ఉంది. అందరూ ఉరుకుల పరుగుల మీద ఉన్నారు.

అలా వెళ్తూంటే, ఒక సందు చివర చాలా మంది గుంపుగా కనపడ్డారు, కొందరు ముస్లింలు, అందరు ఏదో యుద్దానికి సన్నద్దమవుతున్నట్టుగా కనపడ్డారు. చేతుల్లోకి ఇనుపరాడ్లు, సోడా సీసా లు తీసుకొని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా బస్సు కండక్టర్ ’స్పీడ్ గా వెళ్లు, ఆపకు’ అని పురమాయిస్తున్నాడు. మాకు గుండెల్లో దడ మొదలయ్యింది. వాళ్లు మా వైపే వస్తున్నారు. అయ్యో ఎరక్క పోయి వచ్చి ఇరుక్కు పోయాము అని భాధ, భయం రెండు ఒక్కసారిగా కలిగాయి. ఎప్పుడు మా బస్సు మీద దాడి చేస్తారో అని బిక్కు బిక్కు మంటూ ఉన్నాము, వాళ్లు అందరూ పరుగెత్తుకుంటూ మా బస్సు వైపు వచ్చారు. ఇక అయిపోయాము అనుకున్నాము. కాని అదృష్టవశాత్తు మా బస్సుని దాటి వెళ్లారు. చూస్తే మా వెనక వస్తున్న వాహనం మీద దాడికి దిగారు, అందులో అంతా ఆర్.ఎస్.ఎస్ వాళ్లు ఉన్నారు. అప్పుడర్థమయింది అక్కడ హిందు ముస్లిం ల గొడవ జరుగుతుందని. ఆ వాహనం నుండి వాళ్లు కిందికి దిగి బిగ్గరగా అరుస్తూ కొట్టుకోవడం మొదలు పెట్టారు.

రోడ్డుమీద అంతా అంతకు ముందు జరిగిన గొడవ దాఖలాలు కనపడతున్నాయి. కుడివైపు వున్న రోడ్డు మీద కాలుతున్న బస్సు, తరువాత రోడ్లో అద్దాలు పగిలిన బస్సులు, కార్లు, కాలుతున్న టైర్లు, చిందరవందరగా చెప్పులు, కర్రలు, రాళ్ళు, చినిగిపోయిన చొక్కాలు, అక్కడ అక్కడ రక్తపు మరకలు కనపడ్డాయి. మాకు కొంత సేపు మణిరత్నం సినిమానో, రామ్ గోపాల్ వర్మ సినిమానో చూస్తున్నట్టుగా అనిపించింది. వాళ్ల సినిమాలు చూసి వీళ్లు ఇలా చేస్తారో, ఇవి చూసి వాళ్లు తీస్తారో తెలియదు కాని అచ్చు అలానే ఉంది. ఇంతలో ఒకడు పెట్రోల్ సీసా పట్టుకొని పరిగెడుతున్నాడు, మళ్లీ ఒక రెండు నిమిషాలు భయం, అతను ఎక్కడికో వెళ్లిపోయాడు. హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నాము. మొత్తానికి ఎలాగోలా అక్కడి నుండి బయటపడ్డాము.

తరువాత మా స్నేహితురాలికి ఫోన్ చేస్తే తను ’మీకు తెలుసా శివాజినగర్ లో గొడవలు జరుగుతున్నాయి, కర్ఫ్యూ అట’ అంది. మేము ’తెలుసు ! అందుకే లైవ్ కవర్ చేద్దామని వచ్చాము’ అని మా కష్టాలు చెప్పుకున్నాము. తిరిగివచ్చేప్పుడు బెంగుళూర్ అంతా తిప్పి ఆ BMTC బస్సు వాడు మొత్తానికి క్షేమంగా తీసుకువచ్చాడు.
రోజు కి 25 గంటలు వార్తలు చూసే మా సందీప్ ఆ రోజు వార్తలు చూడకపోవడం ఒక కారణం, వాడు చూసుంటే వెళ్ళేవాళ్ళం కాదేమో, అయినా ఇలాంటివి ఊహించలేము కదా. కొన్ని దేశాలలో ఉంటే, బయటికి వెళ్లేప్పుడు వర్షం ఉందా లేదా, వాతావరణం ఎలా ఉంది అని చూసుకొని వెళ్లాలి. మన దగ్గర మాత్రం గొడవలు ఉన్నాయో లేవో చూసుకొని వెళ్లాలనుకుంటా. ఈ forcasting కి కూడా గూగుల్ వాడు ఒక gadget తయారుచేస్తాడేమో.
మొత్తానికి సరదాగా వారాంతం బయటికి వెళ్దామని వెళితే అలా ఇరుక్కుపోయాము.

ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా సిరివెన్నెల గారి పాట గుర్తుకువస్తుంది, " సురాజ్య మవ్వలేని స్వరాజ్యం ఎందుకని... సుఖాన మనలేని వికాసమెందుకని ". ఈ క్రింది వీడియో చూడండి, నేను చెప్పిన వాటికి ఇంచుమించు దృశ్యరూపం.




ప్రతీ రెండు మూడు నెలలకొకసారి ఇలా ఏవో జరగడం, జరిగిన వారానికి అందరూ మర్చిపోవడం, అన్నీ మామూలు అయ్యాయి. ఏ సమస్యా లేదనుకుంటూ "జెండా పండుగ" ఘనం గా చేసుకుంటాము. అలాగే ఈ సారి కూడా.
బ్లాగ్మిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు (ముందస్తు).

గమనిక: నేను ఏ వర్గానిదో తప్పు అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం కాదిది, కేవలం ఒక యధార్ధ సంఘటనని చెప్పాలని ప్రయత్నం మాత్రమే. ఎవరిది తప్పు అని చర్చిస్తే ఆ చర్చకు ఆది, అంతం ఉండదనుకుంటాను. పై విషయాల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించగలరు, ఆ విషయాలు కేవలం నేను అప్పుడు చూసినవి, అనుభవించినవి మాత్రమే.

హనాబీ - జపాన్ లో వేసవి పండుగ  

Posted by ప్రపుల్ల చంద్ర in ,


జపాన్ లో ప్రతీ వేసవి కాలంలో టపాసుల పండుగ చేసుకుంటారు, దాన్నే ’హనాబీ’ అని పిలుస్తారు. ’హనాబీ’ అంటే జపనీస్ లో ’అగ్ని పూలు’. ఈ పండుగని 17వ శతాబ్దం నుండి చేసుకోవడం మొదలు పెట్టారు. మొదట ఆనందం కోసం మొదలు పెట్టి తరువాత వాళ్ళ ముందు తరాల వాళ్ళని గుర్తుచేసుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో రోజు చేసుకుంటారు. జూలై 26 నాడు టోక్యో (సుమిదాగవా) లో జరిగిన హనాబీ కి వెళ్ళాను. చాలా బాగుంది. ఇవి చూడటానికి చాలా మంది జపనీస్ సాంప్రదాయక బట్టలు (కిమోనో) వేసుకొని వచ్చారు.



ఆ మరుసటి వారం మా జపనీస్ బాస్ ’కాటో-సాన్’ ( సాన్ అంటే ఇక్కడ గౌరవార్ధం అందరి పేర్లకి తగిలిస్తారు, మన ’గారు’ లా ) మమ్మల్ని జపాన్ లో జరిగే అతి పెద్ద హనాబీ, ’నాగాఓకా’ కి ఆయన కార్లో తీసుకువెళ్తా అన్నారు. ఆయన అక్కడే చదువుకున్నారట. జపాన్ లో ఎప్పుడు బయటికి వెళ్ళినా తప్పకుండా ఏదో ఒక వింత చూస్తూ ఉంటాను. ఎప్పటిలా ఈసారి కూడా చూసాననుకోండి. మరి నాతో రండి ఆ విశేషాలు తెలుసుకోవడానికి. ఈ సోది ఎందుకూ అనుకుంటే క్రింద ఉన్న నేను తీసిన వీడియోలు చూడండి :)

పోయిన శుక్రవారం ( 1, ఆగష్ట్, 2008 ) రాత్రి 9 గంటలకు ఆయన కొడుకు ’తత్సు’ ( Tatsu, ఒక బుజ్జి భకాసురుడు ) తో కలిసి నన్ను, నా మిత్రుడు ప్రశాంత్ ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. మొదట ’నాగాఓకా’ దగ్గర్లో ’నయేబా’ అనే ఊర్లో ఆయన కొత్తగా కొన్న ఇంటికి వెళ్ళి, అక్కడే పడుకొని, శనివారం సాయంత్రం హనాబీకి వెళ్ళాలని ప్లాన్. ఆ ఊరు దాదాపు ఒక ౩౦౦ కిలో మీటర్లు, "Kanetsu Motor way" అనే హైవే మీదుగా వెళ్ళాము. మొదలే గమ్యాన్ని సెట్ చేయడంతో, GPS ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్లు ఉన్నాయో, ఎక్కడ కుడి వైపు వెళ్ళాలో, ఎక్కడ ఎడమ వైపు వెళ్ళాలో చెబుతూ, చూపిస్తూ ఉంది. చాలా దూరం వెళ్ళాక ఆ హైవే కి పక్కగా ఉన్న ఒక ఘాట్ రోడ్లో ఆయన ఊరికి వెళ్లాము. ఆ దారిలో 55 పాము మెలికలు (turnings) ఉన్నాయి. అలా దాదాపు 1000 మీటర్ల ఎత్తులో ఉన్న ’నయేబా’ కి చేరుకున్నాము.

మా బాస్ కి ’స్కీయింగ్’ ఎక్కువగా ఇష్టం ఉండటంతో ఒక ’snow resort' దగ్గర్లో ఇల్లు తీసుకున్నారు. వేసవి అవ్వడంతో అక్కడ ఇప్పుడు మంచు లేదు, చాలా వేడిగా ఉంది !!! ఊర్లో కూడా ఎవరూ లేరు. అంతా ఖాళీ గా ఉంది. అందరూ చలికాలంలోనే అక్కడికి వెళ్తారనుకుంటాను. దాదాపు 50, 60 ఫ్లాట్లు ఉన్న ఆయన apartment లో మేము తప్ప ఎవరూ లేరూ.

తరువాత రోజు ప్రొద్దున్నే ఊరు చుట్టొద్దాం అని బయటపడ్డాం. మంచు లేకపోయేసరికి ఆ ప్రదేశంలో ’గోల్ఫ్ కోర్స్’ చేసారు. చిన్న పిల్లల కోసం చిన్న పార్క్ లా తయారు చేసారు. అక్కడ పిల్లలు రకరకాల సైకిల్లు తొక్కుతూ కనపడ్డారు. కొండ మీదికి వెళ్దామనుకుంటే లిఫ్ట్ (గొండోలా) లు ఏమి పనిచేయడం లేవు.

తరువాత ’నాగాఓకా’కి బయలుదేరాము. మా బాస్ మిత్రుడు ’కసే-సాన్’ మా కోసం టికెట్ బుక్ చేసారు. ’కసే-సాన్’ అక్కడ 40 సంవత్సరాలుగా ఉంటున్నారు. ఆయన పెద్దనాన్న పెద్ద పెద్ద తారాజువ్వలు తయారుచేయడం లో దిట్ట అట. అక్కడ అన్నింటికన్నా పెద్దది ఆయనే తయారుచేసారు. మాకు మంచి గైడ్ దొరికాడన్నమాట!!!. ఆయన మొదట ఒక మంచి హోటల్ కి తీసుకువెళ్లారు. అక్కడ ’హెగీ సోబా’ అనే నూడిల్స్ ప్రత్యేకమట, అక్కడే దొరికే ఒక రకమైన గోధుమలతో చేస్తారు. సముద్రంలో పెరిగే ఒక ప్రత్యేకమైనా మొక్కతో సూప్ ఇచ్చారు. ఆ నూడిల్స్ ఈ సూప్స్ తో కలిపి తినాలి. చాలా రుచికరంగా ఉంది.

అక్కడ నుండి ’హనాబీ’ జరిగే ప్రదేశానికి నడుస్తూ బయలుదేరాము, దారి పొడవునా రోడ్డు పై మన రూపాయి బిళ్ల కన్నా పెద్ద పరిమాణంలో ఉన్నా బిళ్ళలు, వాటిపై చిన్న చిన్న రంధ్రాలు చేయబడి ఉన్నాయి, అవి అన్నీ ఒక పద్దతి ప్రకారం రోడ్డుపై (లో) అమర్చబడి ఉన్నాయి ( లోపల పైపులు వున్నట్టున్నాయి, పైకి ఇవి కనపడుతున్నాయి !!). దాదాపు ఊరి నిండా కనపడ్డాయి, ’కసే-సాన్’ని అడిగితే, చలి కాలంలో చాలా మంచు ఉంటే అందులో నుండి నీళ్ళు (వేడి నీళ్ళు అయి ఉండొచ్చు) పంపించి మంచుని కరిగిస్తారని చెప్పారు. అక్కడ చలి కాలంలో 1 మీటర్ నుండి 2 మీటర్ల వరకు మంచు కురుస్తుందట, కాని ఈ మధ్య భూతాపం వల్ల 1 మీటర్ కన్నా తక్కువ మంచు కురిసిందట. అప్పట్లో అక్కడ ప్రతీ ఇంటికి పై అంతస్తు నుండి కూడా ఒక తలుపు ఉండేదట, మంచు బాగా కురిస్తే పై తలుపు ఉపయోగించేవారట.

ఈ తారాజువ్వల పండుగ నదీ తీరాల్లో చేస్తారు. ’నాగాఓకా’ ’షినానో’ అనే నది ఒడ్డున ఉన్నది. ఇది జపాన్ లోనే పొడవైనా నది. ఒక 30, 40 నిమిషాల నడక తరువాత మేము ఆ నది ఒడ్డుకి చేరాము. అక్కడ క్రింద కూర్చోడానికి blue sheets వేసి ఉంచారు. నది ఒడ్డున అయ్యేసరికి చల్లగా ఉంది. అక్కడే ’Stardust Revue’ అనే జపాన్ లో ప్రఖ్యాత music band వాళ్ల ప్రదర్శన ఏర్పాటు చేసారు. ఆ ప్రదర్శనని అంతా నృత్యం చేస్తూ మరీ ఆనందించారు. ఆ ప్రదర్శన 7 గంటలకే అయిపోయింది.

టోక్యోలో అన్నీ భవనాల మధ్యలో చాలా లైట్లు ఉండటం వల్ల తారాజువ్వల వెలుగు అంతగా తెలియలేదు. ఇక్కడ మాత్రం చూడటానికి ప్రదేశం చాలా బాగుంది, కనుచూపుమేరలో భవనాలు లేవు, ఏ అడ్డు లేదు, లైట్లు లేవు !!!, తారాజువ్వలు కాల్చిన తరువాత మెల్లిగా గాలి వీస్తూ ఉంటే అక్కడి పొగ పోయి, క్రొత్తగా కాల్చేవి మంచి మంచి రంగుల్లో కనపడతాయి. 7 గంటల నుండి 7:30 నిమిషాల వరకు వ్యక్తిగత కోరిక మీద తారాజువ్వలు పేల్చారు. ( ఏమైనా కోరిక ఉన్నవారు, లేక ఎవరి జ్ఞాపకార్ద్దం అయినా, డబ్బులు ఇస్తే కాలుస్తారన్న మాట, మన దగ్గర మన పేరు మీద అర్చన చేస్తారు కదా ! అలా అన్నమాట.)

7:30 గంటలకి అసలు కార్యక్రమం మొదలైయింది. ఆ నదిపై ఉన్న ఒక బ్రిడ్జ్ మీది నుండి నయాగరా జలపాతంలా తారాజువ్వలు పేల్చారు. మేము ఆ బ్రిడ్జ్ కి దూరంగా ఉండేసరికి వీడియో తీయడం కుదరలేదు, కాని మీరు ఇక్కడ చూడవచ్చు. తరువాత రకరకలా ఆకారాల్లో తారాజువ్వలు పేల్చారు. 'smiley', 'sunflower', 'N', 'S', 'T', 'saturn' ఇలా రకరకాల ఆకారాలలో పేల్చారు.






మధ్యలో అతి పెద్ద తారాజువ్వ ’సన్ జాకుదమా’ ని కాల్చారు, (one of the biggest in the world) ఇది 90 సెంటీమీటర్ల వ్యాసం, ౩౦౦ కిలోల బరువు ఉండి, 600 మీటర్ల ఎత్తులో, 650 మీటర్ల వెడల్పుతో ఆకాశానంతా వెలుగుతో నింపేసింది.
అలా 90 నిమిషాలు వరుసగా జరుగుతూ చివరికి ’ఫినిక్స్’ కాల్చే ఘట్టానికి చేరుకుంది. ఇది ’నాగాఓకా’ కు ప్రత్యేకం, చెప్పాలంటే ఇది చూడటానికే మేము వెళ్ళాము. 2004 సంవత్సరంలో అక్కడ సంభవించిన భారీ భూకంపానికి 60 మందికి పైగా చనిపోయారు. వారి గుర్తుగా, అందరూ అప్పుడు చేసిన సహాయానికి గుర్తుగా ’ఫినిక్స్’ అనే తారాజువ్వలు కాల్చడం మొదలుపెట్టారు. దీని గురించి చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది, ఈ వీడియో చూడండి ( చివరి 50 సెకన్లు memory లేకపోవడం వల్ల తీయలేకపోయాను... ).



ఇది చూడటానికి నిజంగా రెండు కళ్ళు సరిప్పోవు. చివర్లో వెళ్ళేప్పుడు అందరిని వాళ్లు తెచ్చుకున్న ’టార్చిలైట్’ లను గాల్లో ఊపమన్నారు, అప్పుడు అక్కడ అంతా రంగులమయం అయ్యింది. అలా దాదాపు 2 గంటల సేపు కనులవిందు జరిగింది, జీవితంలో ఎప్పటికి మర్చిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. అక్కడి ’జన’ సముద్రాన్ని దాటి ’కసే-సాన్’ ఇంటి దాకా వెళ్ళి, ఆయనకి వీడ్కోలు చెప్పి తిరుగుముఖం పట్టాము. మా బాస్ ’GPS' ని ఇబ్బంది పెడుతూ మరీ ట్రాఫిక్ లేని దారి నుండి తీసుకువచ్చారు.
తిరుగుప్రయాణంలో ఒకచోట మేము "Kanetsu tunnel" అనే టన్నల్ గుండా వచ్చాము, ఇది దాదాపు 10.5 కిలోమీటర్ల పొడవైనది, దాదాపు 25 సంవత్స్రరాల క్రితమే ఒక పర్వతాన్ని తొలిచి ఇది కట్టారు. జపాన్ లో దాదాపు 70 శాతం కొండలు, పర్వతాలే అయ్యేసరికి ఇక్కడ స్థలం కొనాలంటే ధరలు ఆకాశానంటుతాయి. మొత్తానికి రాత్రి 3 గంటలకి ఇల్లు చేరుకోవడం తో మా యాత్ర ముగిసింది.