జపాన్ విశేషాలు - 3 (జీవన విధానం)  

Posted by ప్రపుల్ల చంద్ర in



జపాన్ లో ’bow' చేయడం నమస్కరించే పద్దతని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. (పై ఫోటో గూగుల్లో దొరికింది)
ఇక్కడ సాంప్రదాయ దుస్తువులను ’కిమోనో’ అని అంటారు. కాని అవి సాధారణంగా ఎవరూ వేసుకోరు, ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప. ’కిమోనో’ లాగే ఉండి కొద్దిగా పలుచగా ఉండే బట్టలని ’యుకాతా’ అంటారు. ఒక చిన్న పాప ’కిమోనో’ వేసుకుంటే ఫోటో క్లిక్కాము చూడండి. (ఫోటోపై క్లిక్ చేస్తే పెద్దదిగా చూడవచ్చు)



జపాన్ వాళ్ల పద్దతులు కొన్ని విషయాలలో మన పద్దతులతో సారూప్యత కనపడుతుంది. వీళ్లు మనలా రోజూ అన్నం ( మన దగ్గరి కన్నా చాలా ముద్దగా ఉంటుంది ) తింటారు. వీళ్ల పేర్లు మన తెలుగు పేర్లలలా మొదలు ఇంటి పేరు, తరువాత వారి పేరు. కాకాపోతే వీళ్లు ఇంటి పేర్లతో పిలుచుకుంటారు. ’సాన్’ అని ( తెలుగులో ’గారు’ ) పేరుకి తప్పని సరిగా తగిలించి పిలుస్తారు.

ఇక్కడ ఇల్లులు చిన్నగా ఉంటాయి. ఇంట్లోకి రాగానే చెప్పులు ముందు గదిలోనే విప్పి లోపలికి వెళ్ళాలి. ఇంట్లో తిరగడానికి ప్రత్యేకమైన చెప్పులు ఇస్తారు. నేను చూసిన చాలా ఇళ్లలో ముందు గదిలోనే వంటగది ఉంటుంది. జపాన్ వారి సాంప్రదాయం ప్రకారం అన్ని గదులకు ఫ్లోరింగ్ మన దగ్గరి చాప లా ఉండే ఒక మెటీరియల్ తో వేస్తారు, దాన్ని ’టటామి మ్యాట్’ అంటారు. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది, చాలా తేలికగా ఉండటం వల్ల భూకంపం వచ్చినప్పుడు కూలిపోయి క్రిందపడ్డా ఎవరికి ఏమి కాదు, ఇలా చాలానే ఉన్నాయి. ఈ మధ్య అంతా పాశ్చాత్యం అయిపోతుండేసరికి ఎదో ఒక గదిలోనే ఈ ఫ్లోరింగ్ వేస్తున్నారు(ముఖ్యంగా పడుకునే గదిలో). చెప్పులు వేసుకొని ఈ ఫ్లోర్ పై అస్సలు అడుగుపెట్టకూడదు. గదుల వైశాల్యం గురించి చెప్పేప్పుడు ఇన్ని ’టటామి మ్యాట్’ లు అని చెబుతారు.


పై ఫోటోలో ’టటామి మ్యాట్’లు డైనింగ్ టేబుల్ చూడవచ్చు.

వీరు భోజనం క్రింద కూర్చొని తింటారు ( ఏవో చాలా తక్కువ హోటల్లలో తప్ప ). వీరి సాంప్రదాయం ప్రకారం మోకాళ్ల మీద కూర్చొని తినాలి, కాని అందరూ మాములుగానే కూర్చుంటారు. తినే ముందు మన ’వెంకటేష్’ లా పెద్ద ప్రార్ధనలు చేయరు ’ఇతదాకిమస్’ (I gratefully receive) అంటూ మొదలు పెడతారు. త్రాగే ముందు ’చీర్స్’ లా ఇక్కడ ’కాంపై’ అని అంటారు. అందరి కన్నా చిన్న వారే ఎక్కువగా వడ్డిస్తారు. ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఇక్కడ కూడా చాలా పద్దతులు వున్నాయి. కాకాపోతే ఏ పద్దతైనా విదేశీయులు పాటించకపోతే ఏమి అనుకోరూ. ’గొచిసోసమా దేశితా’(Thank you for the meal) అంటూ తినడం ముగిస్తారు.

’Tea ceremony' జపనీస్ సాంప్రదాయం లో ఒక భాగం. ఎవరినైనా అతిధులను పిలిచి ఒక ప్రత్యేక పద్దతిలో జపనీస్ టీ ( గ్రీన్ టీ, ఆకుపచ్చ రంగులో ఉండి చేదుగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచింది, ఇక్కడ అందరికి చాలా ఇష్టమైన టీ ) తయారుచేసి అందరూ కలిసి త్రాగుతారు. మమ్మల్ని మాత్రం ఇంతవరకు ఎవరూ దానికి పిలువలేదు :(.

ఇక్కడ ప్రత్యేకంగా పండుగలు ఉండవు. కాకాపోతే ఒక్కొక్క కాలంలో ఏవో చిన్న పండుగలు చేసుకుంటారు. వేసవి కాలంలో హనాబీ అని చేసుకుంటారు, వసంతకాలంలో అందరు కలిసి తోటలకు వెళ్లి భోజనం చేస్తారు (మన వన భోజనాల్లా !!) దాన్ని ’సకురా’ అంటారు. ఇక్కడ గమ్మత్తుగా అనిపించిన విషయం ఏంటంటే ఎప్పుడు వసంతకాలం వస్తుందో ఎప్పుడు అయిపోతుందో తేదీలతో సహా ముందే చెప్పేస్తారు. చలికాలం, వసంతకాలం, వేసవి కాలాలలో వారం రోజుల సెలవులు ఇస్తారు, సరదాగా గడపడానికి. సంవత్సరానికి దాదాపు 30 సెలవులు ఉంటాయి ( ఆ 3 వారాల సెలవులతో పాటు బ్యాంక్ సెలవని, ముసలి వాళ్ల రోజని ఏవో సెలవులు ఉంటాయి). డిసెంబర్ 31 రాత్రి మాత్రం కుటుంబ సభ్యులంతా కలిసి గడపడానికి ప్రాముఖ్యతనిస్తారు, లేకపోతే గుడికి వెళ్తారు, రాత్రి 12 గంటలకు గుళ్ళో 108 సార్లు గంటలు కొడతారు. రాత్రి వీలు కాకపోతే మరునాడు గుడికి వెళ్తారు.

ఇక్కడ సాధారణంగా తమ జీవితభాగస్వాములను తామే వెతుక్కుంటారు. లేకపోతే ఈ మధ్య మన దగ్గర ఉంటున్నట్టుగా ’స్వయంవరం’ వంటి వాటిలో ఎంచుకుంటారు. ’డేటింగ్’ సైట్లు కూడా చాలానే ఉన్నాయి. చివరికి తల్లిదండ్రులు వెతుకుతారు మన దగ్గరిలా !!!. ఏదీ కుదరకపోతే పెళ్లే చేసుకోరు, ఒంటరిగా ఉండిపోతారు. మా కంపెనీలో కూడా అలా ఉండిపోయినవారు ఉన్నారు. పెళ్లి ఖర్చులు పెళ్లికొడుకు, పెళ్లికూతురు (తల్లిదండ్రులు కాదండోయ్) సగం సగం భరిస్తారు. పెళ్ళి ఖర్చులు కూడా చాలా ఉంటాయి. వచ్చిన వాళ్లందరికి వాళ్లే బహుమతులు ఇవ్వాలట, అందుకే ఎక్కువ మందిని పిలవరట.

వీరు తినే ఆహారం (Diet), చేసే వ్యాయామాల వల్ల చాలా రోజులు బ్రతుకుతారు !!! అందరూ ఏదో ఆటలో ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. మా టీమ్ లో ఒకరికి సైక్లింగ్ ఇష్టం, అతను వారంతంలో దాదాపు 200 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాడు, ఒకరు సర్ఫింగ్, ఒకరు యాచింగ్, ఒకరు టెన్నిస్, ఒకరు ఫుట్ బాల్, ఒకరు స్విమ్మింగ్ ఇలా ఎదో ఒకటి ఉంటుంది. వారాంతాలు వాటితో కాలక్షేపం చేస్తారు. వయసు తో సంబంధం లేకుండా చాలా మంది వీడియో గేమ్స్ ఆడుతారు (ముసలి వాళ్ళ తో సహా). ’సూమో’ ఇక్కడ సాంప్రదాయక ఆట.

ఇక్కడి ఆహారం గురించి వచ్చే టపాలో......

This entry was posted on Thursday, August 28, 2008 at 7:45 AM and is filed under . You can follow any responses to this entry through the comments feed .

9 comments

మీ జపాన్ విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వారి సమకాలీన సాహిత్యం గురించి కూడా చెప్పండి.

August 28, 2008 at 9:29 AM

ఇల్లులు అంటున్నారు,మీది ఇసాపట్నవా?

August 28, 2008 at 10:01 AM

చాలా బాగుంది మీరు రాసిన విధానం, ఇచ్చిన వివరాలు.
వారి విధానాల గురించి రాసినందుకు చాలా సంతోషం ! ఆసక్తికరంగా సాగుతోంది.

August 28, 2008 at 12:52 PM
Anonymous  

చాలా ఆసక్తికరంగా వివరిస్తున్నారు.

August 28, 2008 at 1:21 PM

Super

August 28, 2008 at 11:02 PM

manchi useful information echaru...danyavadamulu...enka enno tapala kosam eduru choostoo vuntamu...mee travel log kuda update cheyandi :)

August 28, 2008 at 11:27 PM

@Chandra Mohan,
నెనర్లు,
భాషే చాలా కష్టం, సాహిత్యం తెలుసుకోవడం చాలా కష్టమండి, ప్రయత్నిస్తాను.

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి,
మాది విశాఖపట్నం కాదండి.
ఇళ్లులు అని రాయబోయి, ఇల్లులు అని రాసాను !!!

@ప్రవీణ్ గార్లపాటి, @srajcanada, @Ghanta Siva Rajesh, @Murali.Marimekala
నెనర్లు

August 29, 2008 at 7:39 AM

ఇళ్ళు అంటేనే బహుచనమండి :)మళ్ళీ ’లు’అవసరం లేదు.

August 29, 2008 at 11:32 AM

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి ,
అవును కదా :)

August 30, 2008 at 3:36 AM

Post a Comment