జపాన్ విశేషాలు - 10 (చివరి భాగం)  

Posted by ప్రపుల్ల చంద్ర in



జపాన్ లో రైల్వే వ్యవస్థ చాలా పద్దతిగా ఉంటుంది, టోక్యోలో ఎక్కడి నుండైనా ఐదు నిమిషాలు నడిస్తే ఏదో ఒక స్టేషన్ ఉంటుంది. రైళ్ళ, బస్సుల అనుసంధానం కూడా చాలా బాగుంటుంది. దాదాపుగా అందరూ రైళ్లల్లో ప్రయాణిస్తారు. ఇక్కడ రైళ్ళో ఏ వస్తువు కూడా పోదు అని పేరు ఉంది, అంటే పోగొట్టుకున్నా తప్పకుండా దొరుకుతుంది !!!. రైళ్ల సమయపాలన కూడా చాలా బాగుంటుంది. ఉదాహారణకి 10.36 గంటలకి రైలు ఉందనుకోండి, ఖచ్చితంగా అదే సమయానికి వస్తుంది, లేకపోతే మన గడియారాలు సరి చేసుకోవాలి అంటే అతిశయోక్తి కాదేమో. ప్లాట్ ఫాం పై ఎక్కడ తలుపులు ఉంటాయో, ఎక్కడ నిలబడాలో గీసి ఉంటుంది, సరిగ్గా రైలు కూడా అక్కడే ఆగుతుంది. అయస్కాంత శక్తితో వెళ్ళే రైలు, బుల్లెట్ ట్రైన్ ( జపాన్ లో షిన్ కన్ సెన్ అని పిలుస్తారు) 581 kmph వేగంతో వెళ్తుంది. అది ప్రపంచంలోనే అత్యంత వేగమైనది. కాకాపోతే ఇది పరీక్షా సమయంలో మాత్రమే, అది ఇంకా అందుబాటులోకి రాలేదు, ఇంకో 15 సంవత్సరాలు పడుతుందట. ఇప్పుడు ఉన్న బుల్లెట్ ట్రైన్ లు సాధారణంగా 300 kmph వేగం తో వెళ్తాయి. ఒకసారి నేను అందులో ప్రయాణించాను, అదొక ప్రత్యేకమైన అనుభవం.




ఫోటో : టికెట్లు తీసుకునే కౌంటర్, టికెట్లను గుర్తించి లోపలికి అనుమతించే యంత్రాలు. దాదాపుగా అన్నీ స్వయం చాలితాలే (automatic), టికెట్ కండక్టర్, టికెట్ ఇచ్చేవారు ఉండరు.

ఇక్కడ బయటికి ఎప్పుడు వెళ్లినా ఏదో ఒక వింత చూస్తూనే ఉంటాము. వీరి సాంకేతికత చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి ఒకతను ఒక ట్రాలీ లో వస్తువులు పట్టుకొని మెట్ల వైపు వచ్చాడు. ఇదేంటి ఇంత సామానుతో ఇలా వస్తుంన్నాడు, మెట్లు ఎక్కడం కష్టం కదా అనుకున్నాను. ఆ ట్రాలీ మెట్లు ఎక్కేస్తుంది దానికి ఉన్న చక్రాలతో !!!!. ఇలా చాలానే ఉన్నాయి.

జపాన్ లో ఎక్కువగా ఆడే ఆట బేస్ బాల్. ఈత రాని వారు కూడా దాదాపు ఎవరూ ఉండరు.

ఇక్కడ పోలీస్ స్టేషన్లు నాకు ఎప్పుడూ కనపడలేదు. కాకాపోతే పోలీస్ బాక్స్ లు ఉంటాయి. చిన్న గదిలా ఉండి ఒకరు కూర్చోడానికి వీలుగా ఉంటుంది, కొంత ఆఫీస్ సామగ్రి కూడా ఉంటుంది. దాదాపు వారికి పెద్దగా పని కూడా ఉండదు. వారు ఉపయోగించే స్కూటర్ పిజ్జాహట్ వారు ఉపయోగించే స్కూటర్ లా ఉంటుంది, కేవలం వెనక రాసి ఉండే 'POLICE' ని చూసి మాత్రం తేడాని గుర్తించగలం. ఎప్పుడూ ఏ గొడవాలేకుండా ఉంటుంది కాబట్టి దాదాపు వీరి అవసరం ఉండదు అప్పుడప్పుడు తప్ప. చాలా ప్రశాంతంగా ఉండే ఇక్కడ కూడా 'యకుజ' అనే మాఫియా ఉంది. ప్రపంచంలో ఉన్న చాలా పెద్ద మాఫియాలలో ఇదీ ఒకటి.

ఎక్కువగా బ్లాగుల్లో వ్రాయబడే భాష జపాన్ భాషే (ఆంగ్లం, చైనా భాషల కన్నా కూడా !!!! ) . పోయిన సంవత్సరం చేసిన లెక్కల్లో జపాన్ బ్లాగుల్లో మొదటి స్థానంలో ఉంది.



దేవాలయాల గురించి వ్రాసిన టపాలో చెప్పినట్టు వీరి తోటల పెంపకం చాలా బాగుంటుంది. 'బొన్ సయి' (జపాన్ భాషలో, తొట్లలో చెట్లు పెంచడం ) తరహా చెట్ల పెంపకం ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాచూర్యం పొందింది. చైనా నుండి ఈ పద్దతిని తీసుకున్నారు. ఈ పద్దతిలో చెట్లను కొన్ని సంవత్సరాలపాటు తొట్ల లోనే పెంచుతారు. చిన్న మహా వృక్షాలలా కనపడే ఈ చెట్లు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. కొన్ని చెట్లు 800 సంవత్సరాల వయసు ఉన్నవి కూడా ఉన్నాయి.



'ఇకెబన' అనే పుష్పాలంకరణ పద్దతి కూడా జపాన్ వారి సాంప్రదాయంగా వస్తున్న కళ. ప్రకృతి, మనుషుల సంబంధాన్ని తెలిపేట్టుగా ఈ అలంకరణ ఉంటుంది.

ఇంకా జపాన్ ప్రసిద్ది చెందిన విషయాలు చాలా ఉన్నాయి, హైకు, సమురయి, నింజా, గీషా ఇలా చాలా ఉన్నాయి, కాకపోతే వాటి గురించి నాకు అంతగా తెలియదు. వికి లింకులు ఇచ్చాను ఆసక్తి ఉన్నవారు చదవగలరు.

ఈ టపా జపాన్ విశేషాల పరంపరలో చివరిది (ఇంకా వ్రాద్దామనుకున్నా, కాని నాకు తెలిసిన విశేషాలు అయిపోయాయి :( ). ఇక్కడ చూసిన చాలా ప్రదేశాల గురించి ట్రావెలాగ్ వ్రాయడం మొదలు పెట్టాలి.

ఈ విశేషాలు వ్రాయడం లో సహకరించిన నా కొలీగ్ చంద్రశేఖర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే ఈ టపాలు చదివి ఇంకా వ్రాయడానికి ప్రోత్సహించినవారికి కూడా నెనర్లు.

జపాన్ విశేషాలు - 9 ( ముఖ్యమైన మాటలు )  

Posted by ప్రపుల్ల చంద్ర in

 నా ముందు టపాలో cbrao గారు కొన్ని ముఖ్యమైన జపనీస్ మాటలు, వాటి అర్ధాలు వ్రాయమన్నారు. భాష గురించి రాసిన తరువాత వ్రాద్దామనుకొని ఇప్పుడు వ్రాస్తున్నాను. ఈ అర్ధాలు కేవలం ఆ context లోనే ఉపయోగిస్తారని గమనించగలరు, అసలు అర్ధాలు కొద్దిగా వేరుగా ఉంటాయి.

హజిమెమషితె - Nice to meet you

ఒనమ ఎ వ? - (Your) name ?

ఒగెంకి దేసు కా ? - How are you ? (బాగున్నారా ?)

హయ్, గెంకి దెసు - Yes, I am fine

దైజోబు - OK

ఒహాయో గొజాయిమసు - Good morning

కొన్నిచివా - Hello
(ప్రొద్దున 10 గంటల నుండి సాయంత్రం వరకు సాధారణంగా ఉపయోగించే పలకరింపు)

కొంబావా - Good evening

నిహొంగొ వకరిమసెన్ - I dont know Japanese.

ఎ ఇ గొ గ హనసెమసు కా ? - Can you speak English?

___ డొకొ దెసు కా ? - Where is ___ ?

ఎకి వ డొకొ దెసు కా ? - Where is railway station ?

మో ఇచిదొ ఒనెగ ఇషిమసు - Can you repeat one more time.

వకరిమషిత - (I) Understood

అరిగతో గొజాయిమసు - Thank you very much

దో ఇతాషి మషితె - You are welcome (Not to mention)

సుమిమసెన్ - Excuse me

గొమెన్ నసయి - Sorry

ఒయిషి దెసు - Very Tasty

హయ్ - Yes

ఈఎ - No

ఒమెదెతో గొజయిమసు - Congratulations

ఒతాంజోబి ఒమెదెతో గొజయిమసు - Happy birthday

అకెమషితె ఒమెదెతో - Happy new year

గంబత్తె కుడసయి - Keep your chin up. (To encourage someone)

ఒట్సుకరె సమదెషిత - You have done a lot of work. ( To say 'please take rest' )
(ఈ మాట సాధారణం గా సాయంత్రం ఆఫీస్ నుండి వెళ్ళిపోతుంటే చెబుతారు)

ఒయాసుమి నసయి - Good night ( Before going to bed)

జ మత నె - Well then, see you

సయోనర - Good bye

జపాన్ విశేషాలు - 8 ( భాష - My Observations )  

Posted by ప్రపుల్ల చంద్ర in

లిపి గురించి వ్రాసిన ముందు టపా చదివిన తరువాత ఇది చదవండి.

ఆ టపాలో చెప్పినట్టు, సాధారణంగా ఒక వాక్యంలో మూడు లిపులు వాడే అవకాశం ఉంది.
ఉదాహారణకి ఈ వాక్యం తీసుకుంటే " 私 は インド え 行きます。 "

--I------- India------to----- will go
నేను----- ఇండియా--- కి------ వెళ్తాను.
వతాషి---వా-----ఇండో----- ఎ-----ఇ-- కిమసు.
-----私 --- は----インド----え---- 行--きます。
--కాం---హిరా---కతా----హిరా---కాం---హిరా
కాం : కాంజి, హిరా : హిరాగానా, కతా : కతాకానా

వాక్య నిర్మాణం అచ్చు తెలుగులాగే ఉంది కదా !!, కర్త, కర్మ, క్రియ ( ఆంగ్లం లో అయితే కర్త, క్రియ, కర్మ కదా ). అందుకే జపనీస్ నేర్చుకునేప్పుడు అర్ధాలని తెలుగులోకి మార్చుకుంటూ నేర్చుకుంటే సుళువు అవుతుంది.

జపాన్ భాషలో అక్షరాలు తక్కువ కాబట్టి అన్నీ విదేశీ పదాలు వ్రాయలేరు. ఉదాహారణకి నా పేరు, వీరి దగ్గర ఉన్న అక్షరాలతో నా పేరుని పరపుర్ర అని వ్రాయవచ్చు :( . నేను పని చేసే కంపెనీలో ఐడి కార్డ్ ఇచ్చే దుర్మార్గుడు నా కార్డ్ మీద వ్రాసిన పేరు బరబుర్ర ( ప్రపుల్ల అన్నమాట ), ఈ విషయం నేనా లిపి నేర్చుకున్న తరువాత గాని తెలియలేదు. నాకు ఇలాంటి అనుభవం నా పేరు తమిళం లో వ్రాసినప్పుడు ఎదురయ్యింది. తమిళంలో ’ప్ ర పుల్ ల’ లేదా ’ప ర్ పు ల్ ల’ అని వ్రాస్తారు ( నాకు తెలిసి తమిళ్ లో కూడా ప్రత్యేకంగా ఒత్తులు లేవు ), చదవడం ప్రపుల్ల అనే అనుకోండి అది వేరే విషయం. బ్రబుల్ల అని కూడా చదవవచ్చు ఎందుకంటే ప,ఫ,బ,భ లకి ఒకే అక్షరం కాబట్టి (తమిళ్ లో కూడా అక్షరాలు తక్కువ, కాకపోతే ఒక్కొక్క అక్షరానికి 3,4 పిలుపులు ఉంటాయి ). జపనీస్ కి తమిళ్ కి ఎదో సంబంధం ఉన్నట్టుంది అని నేను కనిపెట్టాననుకుంటే నా కన్నా ముందే 'కాల్డ్వెల్' అనే అతను 19వ శతాబ్దంలోనే కనిపెట్టాడట (ద్రవిడ భాషలతో సంబంధం ఉందని), తరువాత కొందరు దీని పైన పరిశోధన కూడా చేశారట, మాట్లాడే విధానం, పదాలు ఒకేలా ఉన్నాయి అని కొన్ని కనిపెట్టారు కాకాపోతే చాలా మంది దీన్ని కొట్టిపడేసారు, పరిశోధనలు జరిపిన వారు సరైన రుజువులు చూపెట్టలేకపోవడం వల్ల ఆ వాదం మరుగున పడింది.

ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆంగ్లం నుండి తీసుకున్న కొన్ని పదాలని వీరు పలకలేక వీరికి తగ్గట్టుగా పిలుచుకుంటూ జపనీస్ లో ఇలా పిలవాలి అని నేర్పిస్తారు అవేవో వారి పదాలలా. ఉదాహారణకి సూపర్ మార్కెట్ ని 'సూపా' అంటారు, టెలివిజన్ ని 'తెరెబీ' అంటారు, పర్సనల్ కంప్యూటర్ ని 'పాస్కాన్' అంటారు. ఇవి జపాన్ పదాలే అన్నట్టుగా వాళ్ళు నేర్చుకుంటారు, మనకి నేర్పిస్తారు. అలా మాట్లాడితేనే వాళ్ళకి అర్ధం అవుతుంది.

జపాన్ భాషలో లింగ భేదం లేదు (క్రియ కు ) ఆంగ్ల భాషలా, అంటే అతడు, ఆమె లాంటి పదాలు ఉన్నాయి, కాని 'చేసాడు', 'చేసింది', 'చదివాడు', 'చదివింది' ఇలా లింగ భేధాలు లేవు. ఆంగ్లం లో కనీసం 'ఆమె', 'అతడు' అని మాటలు మొదలు పెడతారు, కాని జపనీస్ మాటల్లో సాధారణం గా 'కర్త' గురించి ప్రస్తావన ఉండదు (because it is implicit). ఎదుటి వారితో మాట్లేప్పుడు 'మీరు' అని ఉపయోగించకుండా వారి పేరు తోనే పిలుస్తారు. నా ముందు టపాల్లో చెప్పినట్టు ఇంటిపేరుకి గారు తగిలించి పిలుస్తారు, ఇంటిపేరు కాబట్టి ఆడ, మగ తెలియదు. అందువల్ల దాదాపు అన్ని వాక్యాలలో లింగభేదం కనపడదు. గమ్మత్తేటంటే కొన్నిసార్లు వాక్యాల ద్వారా చెప్పింది ఆడవారో, మగవారో తెలుసుకోవచ్చు, ఎందుకంటే కొన్ని పదాలు కేవలం ఆడవారే ఉపయోగించాలి, కొన్ని కేవలం మగవారే ఉపయోగించాలి.

జపాన్ భాషలో బహువచనం (వస్తువులకి) లేదు. మనుషులకి బహువచనం ఉంది 'మేము', 'వారు' ఇలా, కాని 'అరటిపండ్లు', 'కార్లు' ఇలాంటి పదాలు లేవు. పిలిచేప్పుడు ఒక అరటిపండు, రెండు అరటిపండు, మూడు అరటిపండు ఇలా పిలవాలి. ఈ బహువచనాల్లో కూడా ఒక తిరకాసు ఉంది. ఒకటి, రెండు ఇలా అనేప్పుడు వస్తువును బట్టి ఆ లెక్కించడానికి ఉపయోగించే పదం (ఎన్ని అని సూచించే పదం) మారుతుంది. ఉదాహారణకి కర్రలు, పెన్నులలాంటివి లెక్కపెట్టేప్పుడు ఇచిపన్, నిహన్ అని పిలుస్తారు(ఒకటి, రెండు లా అన్నమాట), టేబుల్ల లాంటివి లెక్కపెట్టేటప్పుడు హితోట్సు, ఫుతట్సు అని పిలుస్తారు (ఇది కూడా ఒకటి, రెండు లా అన్నమాట). ఇలా రకరకాల వస్తువులను వాటి ఆకారాలని బట్టి ఒకలా లెక్కపెట్టాలి. దీని వల్ల జపాన్ భాష చాలా కష్టంగా అనిపించింది.

జపాన్ భాషలో కామాలు, పదాల మధ్య ఖాళీలు ఉండవు. వాక్యాన్ని సరిగ్గా విడదీసి చదువుకోవాలి. చివరలో ఫుల్ స్టాప్ ఉంటుంది ఇలా '。'. జపనీయులు మాటలతో పాటు ముఖభావాలు ఎక్కువగానే పెడతారు.

జపాన్ భాషలో సంధులు లేవు. కాని నేను కనిపెట్టాను. కాకాపోతే ఒకే సంధి, గజడదవాదేశ సంధి ( 'చ' అక్షరం లేదు కాబట్టి 'స' ఆ స్థానంలో ఉందనుకుంటే !!). ఉదాహారణకి: యమ + సాకి = యమజాకి, కన + కవా = కనగవా, తొమొ + తాచి = తొమొదాచి. కాకపోతే ఇది అన్ని సార్లు సరికాదు కొన్నింటికి మాత్రమే వర్తిస్తుంది. ఉదాహారణకి కవా + సాకి = కవాసాకి, కవాజాకి కాదు !!!.

మొత్తం మీద చెప్పాలంటే జపాన్ భాష నేర్చుకోవడం కొద్దిగా కష్టమే ( ఈ పాటికి మీకే తెలిసుంటుంది !!!). చాలా వాటికి ప్రత్యేక నిబంధనలు లేవు. అనుభవంతో తెలుసుకోవడమే. నేను నేర్చుకుందామని మొదలుపెట్టాను, కాని తరువాత మానేసాను. మనకసలే ఆరంభశూరత్వం ఎక్కువ కదా !! చూడాలి మళ్ళీ ఎప్పుడు మొదలుపెడుతానో.

జపాన్ విశేషాలు - 7 ( భాష )  

Posted by ప్రపుల్ల చంద్ర in



జపనీస్ భాష గురించి చెప్పడం అంటే పెద్ద సాహసమే. నాకు తెలిసినంతలో నేను చేసే చిరు పరిచయం మాత్రమే ఈ టపా. చెప్పాలంటే జపనీస్ నేర్చుకోవడం కొద్దిగా కష్టతరమే ( అంటే నేర్చుకోలేమని కాదండోయ్ ). ఇక్కడి కామిక్స్, ఆనిమేషన్స్, వీడియోగేమ్స్ చాలా ప్రాచూర్యం పొందటం వలన అవి చదవడానికి/చూడటానికి చాలా మంది విదేశీయులు జపనీస్ నేర్చుకుంటున్నారట. మన దగ్గర కూడా చాలా యూనివర్సిటీల్లో విదేశీ భాషగా జపనీస్ నేర్చుకుంటున్నారు.

జపాన్ భాషని జపనీయులు 'నిహాంగో' అంటారు. 7వ శతాబ్దం వరకు వీరికి లిపి లేదు, ఆ తరువాత వీరు చైనీయుల దగ్గరి నుండి వారి లిపిని ( కాంజి, చిత్రాలతో ఉండే లిపి ) తీసుకున్నారు. లిపి చైనా వారిది, పలకడం వీరి భాషలో అన్నమాట. లిపితో పాటే వీరి దగ్గర లేని కొన్ని పదాలు కూడా చైనా నుండి వచ్చాయి. ఆ తరువాత బౌద్ధ సన్యాసులు కొన్ని అక్షరాలతో జపాన్ భాష రాసే విధంగా ఒక లిపి ని కనిపెట్టారు. ఆ లిపిని కతాకానా అంటారు. ఇప్పుడది విదేశీ పదాలు వ్రాయడానికి ఉపయోగిస్తున్నారు. జపాన్ భాషని సులువు చేయడానికి ఆ అక్షరాలకు వేరే లిపి కనిపెట్టారు ఆ లిపిని హిరాగానా అంటారు. కాంజీ కి బదులుగా ఈ పదాలతో వ్రాయవచ్చు. కాకపోతే మొత్తం కాంజి తో వాక్యాలు వ్రాయడం కుదరదు. హిరాగానా ఉపయోగించి కొన్ని పదాలను కలపవలసి ఉంటుంది. ఆ మూడు లిపుల ఉపయోగాలు ఇలా ఉంటాయి,

1. కాంజి. ఈ లిపిలో దాదాపు ఒక 5000 కాంజీలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క పదానికి ఒక కాంజి (రేఖా చిత్రం) ఉంటుందన్నమాట. ఒక 1500 నేర్చుకుంటే సరిపోతుందట. ఈ కాంజి ఉపయోగం ఎలా ఉంటుందంటే ఉదాహారణకి 'వెళ్ళడం' అనే పదానికి ఒక కాంజి ఉంటుంది. కాకపోతే 'వెళ్తాను', 'వెళ్ళాను', 'వెళ్దాము', 'వెళ్ళబోతున్నాను' ఇలా తేడా చూపెట్టలేదు, ఆ కాంజీకి హిరాగానా లోని అక్షరాలను కలిపితే ఆ పదం పూర్తవుతుంది, అంటే కాంజితో మూలపదాన్ని వ్రాయవచ్చు.

అంతేకాక ఒకే కాంజిని సందర్భం బట్టి వేరేగా పలకాల్సి ఉంటుంది.
ఉదాహారణకి '日' అనే ఈ కాంజికి ఉన్న అర్ధాలు : రోజు, సూర్యుడు, జపాన్, రోజుల లెక్కలలో ఉపయోగిస్తారు, ఒక్కో సందర్భంలో ఒకలా పిలుస్తారు. కొన్ని కాంజీలకి 20 దాకా అర్ధాలు/పిలుపులు ఉన్నాయి.

అలాగే ఒకే పిలుపు ఉన్నా, సందర్భాన్ని బట్టి వేరే కాంజీలతో వ్రాస్తారు.
ఉదాహారణకి వేడి ని 'అట్సుయి' అంటారు, కాకాపోతే వాతావరణం లో వేడి, తినే పదార్ధం వేడి, వెచ్చదనం, warm heart ఇలా వేరే వేరే సందర్భాలలో ఒకేలా పలికినా(అట్సుయి అని) వేరే కాంజిలతో వ్రాస్తారు (厚い、篤い、熱い... ఇలా ).

ఇంకో సందర్భం ఉంది, అందులో ఒక కాంజికి ఒకే అర్ధం ఉంటుంది, కాని సందర్భాన్ని బట్టి వేరేలా పలకాలి.
ఉదాహారణకి '行' అనే కాంజి 'వెళ్ళడం' ను సూచిస్తుంది. మామూలు గా మాట్లాడేటప్పుడు ’ఇకిమస్’ అంటారు. గౌరవంగా మాట్లాడేటప్పుడు ’యుకిమస్’ అంటారు.

వేరు వేరు కాంజీల కలయికతో కొత్తపదాలు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అన్నింటికీ ఇలాగే రావాలి, ఇలాగే ఉండాలి అని నిబంధనలు లేవు, మన అనుభవంతో నేర్చుకోవడమే.

కాంజి ని బొమ్మల ఆధారంగా ఎలా వ్రాయడం మొదలుపెట్టారో ఈ క్రింది బొమ్మని చూడండి. కాంజి కి బొమ్మకి సారూప్యత చూడవచ్చు. (అందులో పైన ఉన్న కాంజి చేపను సూచిస్తుంది, తరువాత గడులలో ఎలా వ్రాయలో ఉంది)



2. హిరాగానా, ఇది ఒక 71 అక్షరాలతో ఉన్న లిపి ( గుణింతాలతో సహా ), ఒత్తులు లేవు 'య' ఒత్తు, ఒత్తి పలికే ఒత్తులు ( న్న, ర్ర లాంటివి ) తప్ప, అంటే 'ప్ర', 'బ్ద' లాంటివి లేవు, వ్రాయలేము !!!. 'చ' ,'ల' , 'ట' , 'డ' అక్షరాలు లేవు. పొల్లు అక్షరాలు లేవు ఒక్క 'న్' తప్ప. చెప్పాలంటే అక్షరాలు తక్కువగా ఉన్నాయి, వీరి భాష వ్రాయడానికి ఇవి చాలు ( అంటే భాష తరువాతే లిపి వస్తుంది కాబట్టి అవే అక్షరాలు ఉంటాయనుకోండి అది వేరే విషయం).

చిన్న పిల్లలకి నేర్పేప్పుడు కాంజి కష్టం కాబట్టి హిరాగానా లో నేర్పిస్తారు. ఉదాహారణకి నదిని 'కవా' అంటారు, '川' అనే కాంజితో సూచిస్తారు. దాన్ని హిరాగానాలో 'かわ' (క వా) అని వ్రాయవచ్చు. కేవలం 71 అక్షరాలే (5000 లతో పోలిస్తే) కాబట్టి ఈ లిపి చాలా సులువు.

కాంజి లేని వాటికి, పదాలని కలపడానికి, కాంజి కి పూర్తి అర్ధం తీసుకురావడానికి హిరాగానాని ఉపయోగిస్తారు.

3. కతాకానా, ఇందులో కూడా హిరాగానా లో ఏవైతే అక్షరాలు ఉన్నాయో అవే ఉన్నాయి, కాకపోతే లిపి వేరు అంతే. ఇది ముఖ్యంగా విదేశీ పదాలను వ్రాయడానికి ఉపయోగిస్తారు. వీరి భాషలోకి కూడా వేరే భాష పదాలు వచ్చి పడ్డాయి ( ముఖ్యంగా ఆంగ్ల పదాలు ). ఎంత వేరే పదాలను చేర్చుకున్నా ఇలా వేరే లిపిలో రాసి వేరుగానే ఉంచారు. అంతేకాక కతాకానా తో కంపెనీ పేర్లు, రైల్వేస్టాప్ ల పేర్లు కూడా వ్రాస్తారు.

ఇంకో రాసే విధానం ఉంది, దీని పేరు రోమాజి, జపాన్ భాషని రోమన్ అక్షరాలతో ( ఆంగ్లం లో ) వ్రాస్తారు. ఇది కేవలం విదేశీయులు నేర్చుకునేప్పుడు వాడుతారు.

నేను ఇంకో లిపి కనిపెట్టా ’తెలుజి’, ఇదేంటి అనుకుంటున్నారా, జపాన్ భాషని తెలుగు లిపిలో వ్రాయడం. పేటెంట్ ఏమి తీసుకోలేదు ఎవరైనా వాడుకోవచ్చు :) .

వీరు మాములుగా వాక్యాలు, అడ్వడైజ్ మెంట్లు ఎడమ నుండి కుడికి వ్రాస్తారు మనలా. కాకాపోతే పుస్తకాలు, పేపర్లలో మాత్రం కుడి నుండి ఎడమకి వ్రాస్తారు, అది కూడా నిలువు లైన్లలో !!!. అంటే పేజికి పూర్తి కుడివైపున పై నుండి క్రిందికి వ్రాసి తరువాత లైన్ మళ్ళీ పై నుండి మొదలు పెడతారు. వీరు కాంజి వ్రాస్తారు కాబట్టి అలా వ్రాయడం కుదురుతుంది (ఒక్కొక్కపదం ఒక బొమ్మ కాబట్టి). మనకు మాత్రం ఇది ఒక కొత్త పద్దతే !!!. ఒక మాదిరిగా ఉర్దూలాగానే, కాకపోతే నిలువు లైన్లలో.

దాదాపు జపాన్ వాక్యాలలో ఈ మూడు లిపులు ( కాంజి, హిరాగానా, కతాకానా ) కలిపి వ్రాస్తారు, కాబట్టి మూడూ నేర్చుకోవలసిందే( కాంజి కి బదులుగా హిరాగానా ఉపయోగించవచ్చు, కాని జపనీయులు చాలాచోట్ల కాంజి వ్రాస్తారు, కాబట్టి తక్కువలో తక్కువ 500 కాంజీలు నేర్చుకోవాలి !! ). ఈ వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, జపాన్ భాషలో నేను గమనించిన విషయాలు వచ్చే టపాలో. ( కొద్దిగా వ్రాద్దామని మొదలుపెడితే పెద్దగా అయ్యింది, అందుకే రెండు గా విడగొట్టాల్సి వచ్చింది)

జపాన్ విశేషాలు - 6 (రోజువారి జీవితం)  

Posted by ప్రపుల్ల చంద్ర in



జపనీయుల రోజువారి జీవితం, ఇంకా ఇక్కడి work environment గురించి ఈ టపా ( నేను చూసే నా సహోద్యోగులది చెబుతాను, మిగతావారిది కూడా దాదాపు ఇలాగే ఉండవచ్చు ) .

సాధారణంగా ఉద్యోగులు ఉదయం 7 గంటలకే ఇంటి నుండి బయలుదేరుతారు. నగరంలో ఉండడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి చాలా మంది దూరప్రాంతాలలోనే ఉంటారు. కాబట్టి అలా ప్రొద్దున్నే బయలు దేరి ఒక 2 గంటల ప్రయాణం తరువాత కార్యాలయం చేరుతారు. దాదాపు 90% మంది ప్రయాణానికి రైళ్ళని ఉపయోగిస్తారు. వ్యక్తిగతంగా కార్లు ఉన్నా, ట్రాఫిక్ ఇబ్బంది వల్ల పెద్దగా వాడరు, వారాంతాలలో తప్ప. అంతేకాక ఇక్కడ అన్ని సిగ్నల్ల వద్ద పాదాచారులకు, వాహనాలకు ఒక్కసారే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, పాదాచారులు రోడ్డు దాటేంతవరకు వాహనాలు ఆగాల్సిందే, దాని వల్ల ఇంకా ఆలస్యం అవుతుంది. ప్రొద్దున రైళ్ళు కూడా చాలా కిక్కిరిసి ఉంటాయి. రైళ్ళో వచ్చేప్పుడు చాలా మంది కామిక్స్ పుస్తకాలు చదువుతూ ( జపనీయులకి కామిక్స్ అన్నా ఆనిమేషన్స్ అన్నా పిచ్చి ) పాటలు వింటూ లేకపోతే వీడియో గేములు ఆడుతూ కనపడతారు. విచిత్రమైన విషయం ఏంటంటే కొందరు నిలబడి ఉన్నా నిద్రపోతారు, అది ఎలా సాధ్యమో నాకు అర్ధం అవ్వలేదు. చాలా రద్దీగా ఉండే రైలు ఎక్కాలంటే ఎన్ని కష్టాలో తెలియడానికి వీడియో చూడండి.



ఆఫీస్ కి కొద్దిగా దగ్గరలో ఉన్న వాళ్ళు సైకిల్ ఉపయోగిస్తారు. ఇక్కడ సైకిళ్ల మీద ఆఫీస్ రావడాన్ని ఎవరూ నామోషీగా భావించరు. కొందరు సూట్ వేసుకొని కూడా సైకిల్ పై ఆఫీస్ కి వస్తారు. నేను చేసే కంపనీలో దాదాపు ఒక 400 మంది సైకిల్ పై వస్తారు. వీరు రైళ్లు, సైకిళ్లు ఉపయోగించడం వల్ల చాలా ఇంధనం ఆదా చేస్తున్నారు.

నలుపు రంగు సూట్లు పెళ్లిలకి వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా చనిపోయినప్పుడు తప్ప సాధారణంగా వేసుకోరు. ఆఫీస్ కి వచ్చేప్పుడు నలుపు కాక ఇంకా వేరే ఏదైనా (నలుపు రంగుకి దగ్గర్లో ఉండే) సూట్ వేసుకుంటారు. అలా అని అందరూ సూట్లు వేసుకోరు. మాములు బట్టల్లో కూడా వస్తారు. కెనాన్ లాంటి కంపనీల్లో యునీఫాం వేసుకొని వెళ్తారు. మా ఆఫీస్ లో ప్రత్యేకంగా ఇలాగే రావాలి అని ఏమి లేదు, ఒకతను గత సంవత్సరంగా రోజూ మోకాళ్ల దగ్గర చినిగి ఉన్న ఒకే జీన్స్ వేసుకొని వస్తున్నాడు !!!

మా ఆఫీస్ లోపలికి అడుగుపెడుతూ ఉంటే ఒక అయిదుగురు అక్కడ నిలబడి ( బయట గేట్ వద్ద కాదు, లోపల ) వచ్చిన అందరికి ’ఒహాయో గొజాయిమసు’ ( good morning ) అని చెబుతారు. చాలా మంది ఉండే సరికి కొద్దిగా సందడిగా ఉంటుంది. ఇది కేవలం ప్రొద్దున 9 గంటల లోపే ఉంటుంది. మేము ఆలస్యంగా వెళ్తాము కాబట్టి కొన్ని సార్లే చూసాము. 9 గంటలకి గంటలు మ్రోగుతాయి, అప్పటి నుండి పని గంటలు మొదలవుతాయి. కాకపోతే మా ఆఫీస్ పనిగంటల విషయంలో ఎవరి ఇష్టం వారిది.

ఆఫీస్ లో అడుగుపెట్టినప్పటి నుండి పని చేస్తూనే ఉంటారు. మొదట కొద్దిసేపు ఆ రోజు చేయవలసిన వాటి గురించి చర్చించుకొని పని మొదలు పెడతారు. వ్యక్తిగత పనులు ( అంటే అంతర్జాలంలో ) అసలే చేసుకోరు. మేము చేసుకుంటాం అది వేరే విషయం. ప్రతీ చిన్న విషయం గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. సుళువుగా ఒక నిర్ణయానికి అస్సలురారు.

12 గంటలకి మళ్ళీ గంటలు మ్రోగుతాయి. అప్పుడు అందరూ భోజనం చేయడానికి వెళ్తారు. ఆ సమయం లో లైట్లు ఆర్పేస్తారు ఒక గంట వరకు, అలా చాలానే విద్యుత్తు ఆదా చేస్తున్నారు, అలాగే భూతాపాన్ని తగ్గిస్తున్నారు. వీరు ఆహారం చాలా తొందరగా తినేస్తారు. మా ఆఫీస్ లో 6 అంతస్తులు ఉండటం తో ఒక్కో అంతస్తు వారికి ఒక్కో సమయాన్ని కేటాయించారు (ఒక్కో అంతస్తులో ప్రతీ 15 నిముషాలకి గంటలు మ్రోగుతాయి). కాబట్టి అందరూ ఒక 15 నిముషాలలో తినడం ముగించేస్తారు. తిన్న తరువాత నిద్రపోయేవారు నిద్రపోతారు, కొందరు వ్యాయామం చేస్తారు, కొందరు ఆటలు ఆడుతారు. ఇలా ఎవరి ఇష్టాలని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. తినగానే చాలా మంది దంతధావనం చేసుకుంటూ కనపడతారు.
మళ్ళీ 1 గంటకి గంటలు మ్రోగుతాయి, మళ్ళీ లైట్లు వేస్తారు, పని మొదలుపెడతారు.



జపాన్ లో మంచి నీరు పెద్దగా త్రాగరు, అందరూ ఎనర్జీ డ్రింక్స్ త్రాగుతారు. మాములుగా ప్రతీ వీధిలో వెండింగ్ మెషీన్స్ ఉంటాయి 24/7. ఫ్రూట్ డ్రింక్స్, విటమిన్ డ్రింక్స్, కోలా, టీ, కాఫీ ఇలా చాలానే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్యా ఉండదు. మా ఆఫీస్ లో కూడా మా అంతస్తులో ఒక 5,6 మేషీన్లు ఉన్నాయి. అంతేకాక ఇక్కడ ఒక 7,8 రకాల చెత్తడబ్బాలు ఉంటాయి. గాజుసీసాలు ఒకదాంట్లో, ప్లాస్టిక్ సీసాలు ఒకదాంట్లో, టిన్లు ఒక దాంట్లో, పేపర్లు ఒకదాంట్లో, ప్లాస్టిక్ కవర్లు ఒకదాంట్లో, అట్టా డబ్బాలు ఒకదాంట్లో వెయ్యాలి. రిసైక్లింగ్ కి సుళువుగా ఉంటుందని అలా విడివిడిగా పెడతారు ( అభివృద్ది చెందిన అన్ని దేశాలలో ఇలాగే ఉండవచ్చు !! ). గొడుగులు పెట్టుకోడానికి స్టాండులు చాలా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ సంవత్సరం పొడవునా వర్షాలు పడుతూనే ఉంటాయి.

మళ్ళీ 6 గంటలకి గంటలు మ్రోగుతాయి, అప్పుడు భోజనం చేస్తారు (ఇక్కడ రాత్రి భోజనం చాలా త్వరగా చేస్తారు). భోజనం తరువాత మళ్ళీ పనిలో పడతారు. ఆ తరువాత ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ కనపడతారు. కొందరు రాత్రి 12 గంటల వరకు పనిచేస్తూనే ఉంటారు, ఆఖరి ట్రైన్లో ఇంటికి వెళ్తారు. మా ఆఫీస్ లో ప్రతీ బుధవారం సాయంత్రం 6 గంటలకే వెళ్ళిపోవాలి ( రోజు ఎక్కువ పని చేయడం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని ఆ నియమం పెట్టారు), కాని కొందరు ఆ రోజు కూడా రాత్రి వరకు పని చేస్తూనే ఉంటారు.

పని ఒత్తిడి నుండి ఉపశమనం కోసం అప్పుడప్పుడు మందు పార్టీలకు వెళ్తూంటారు, వీరికి ’బీర్’ అంటే చాలా ఇష్టం, పీపాలు పీపాలు త్రాగుతారు. అప్పుడప్పుడు ’కరోకే’ కి ( కొన్ని ప్రత్యేకమైన హోటళ్లలో చిన్న స్టేజ్ ఉంటుంది, అది ఎక్కి మనం పాటలు పాడొచ్చు ) వెళ్తూ ఉంటారు.

జపాన్ భాష గురించి వచ్చే టపాలో...

జపాన్ విశేషాలు - 5 (భక్తి, దేవాలయాలు)  

Posted by ప్రపుల్ల చంద్ర in

జపాన్ లో భక్తి గురించి చెప్పాలంటే కొద్దిగా కష్టమే. మొదట నాకు జరిగిన అనుభవాలు గురించి చెప్పి తరువాత నేను తెలుసుకున్న విషయాలు చెబుతాను.

నేను జపాన్ కి వచ్చిన కొత్తలో మా జపనీస్ బాస్ మా అందరిని 'నిక్కో' (ఆ విశేషాలు మరెప్పుడైనా ) అనే ప్రదేశానికి తీసుకువెళ్తా అన్నారు. నిక్కో చాలా బాగుంది. రెండు, మూడు గుడులకు వెళ్ళాము, అన్నీ తోటలతో చాలా అందంగా ఉన్నాయి. నేను గుడిలోపలికి వెళ్లిన ప్రతిసారి ఏదైనా విగ్రహం కనపడుతుందేమో అని చూసేవాన్ని, కాని ఎక్కడా కనపడలేదు, అక్కడక్కడ డ్రాగన్ బొమ్మలు, గుడి బయట కొన్ని విచిత్ర ఆకారాలలో ఉన్న ( చూడటానికి రాక్షసులలా ఉన్న ) విగ్రహాలు కనపడ్డాయి. నేను ఎంత ఆలోచించినా నా బుర్రకు తట్టలేదు. ఇక సరే అని మా బాస్ ని అడిగా 'మనం ఇంతకి ఎవరి గుడికి వచ్చాము' అని, దానికి మా బాస్ కొద్దిగా నవ్వి 'మ్మ్ మ్మ్... నాకు తెలియదు' అన్నారు. అదేంటి తీసుకువెళ్తా అని చెప్పి తీసుకువచ్చి తెలియదంటాడే అనుకొని, సరేలే ఇలా కాదు అనుకొని ఇంకో ప్రశ్న వేసాను. 'మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు' అని, దానికి ఆయన సమాధానం, 'నేను ఎవరిని నమ్మను, నాకు నేనే దేవుణ్ణి' అన్నాడు. ఈ విషయాలను అస్సలే పట్టించుకోము అని చెప్పాడు.



ఇలా అయితే లాభం లేదు, నేనే తెలుసుకోవాలని అంతర్జాలంలో వెతకడం మొదలు పెట్టాను. ఒక పేజి చదువుతుంటే మా జపనీస్ కోలీగ్ ఇదేంటి అని అడిగాడు. జపాన్ లో ఉన్న మతం షింటో గురించి చదువుతున్నాను అని చెప్పాను. ఆ పేజీలో ఉన్న ఒక బొమ్మను (పైన ఉన్న బొమ్మ) చూపెడుతూ నేను ఆ గుళ్ళకు వెళ్తాను కాని దాని పేరు షింటో అని తెలియదు అన్నాడు. నాకు ఆశ్చరం వేసింది. మా బాస్ ని అడిగిన ప్రశ్నే ఈయనను అడిగాను, 'మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు' అని, దానికి ఆయన సమాధానం, 'అందరూ మంచి వాళ్లే'.

నాకు తెలిసిందేంటంటే ఇక్కడ దేవుణ్ణి పెద్దగా నమ్మరు, అలాగని అసలే వదిలెయ్యలేదు. ఇక్కడ ముఖ్యంగా రెండు మతాలు ఒకటి షింటో ఇంకోటి బౌద్ధమతం. కన్ఫ్యూషియస్, క్రిస్టియానిటిలు కూడా ఉన్నాయి, కాని చాలా తక్కువ. ఇక్కడ ఒక 30% మంది దేవుడిని నమ్ముతామని చెబుతారు. మిగతా వాళ్ళు ఏమి చెప్పరు. నమ్మే వారు కూడా రోజు పూజలు చెయ్యరు, ఏదైనా ప్రత్యేక సందర్భాలలోనే గుడికి వెళ్తారు. ఇక వీరు సాధారణంగా పుట్టినప్పుడు జరిగే కార్యక్రమాలు షింటో పద్దతిలో, పెళ్లి క్రిస్టియన్ పద్దతిలో (షింటో పద్దతిలో చేసుకునే వారు కూడా ఉన్నారనుకోండి), చనిపోయినప్పుడు కార్యక్రమాలు బౌద్ధ పద్దతిలో (ఎందుకంటే షింటో లో దీని గురించి ఏమి లేదు) చేస్తారు. అంటే వారికి ఏ మతం లో ఏమి నచ్చితే అదే చేసేస్తారన్న మాట. కాకాపోతే ఎవరూ వీటి గురించి మాట్లాడుకోరు.



ఇక 'షింటో' విషయానికి వస్తే, ఇది జపాన్ లో మొదలైన మొట్టమొదటి మతం. ఇందులో ప్రకృతి దేవతలను పూజిస్తారు. సూర్యుడు, వాయువు అలా. పైన నేను రాక్షసాకారంలో ఉన్న విగ్రహాలు అని చెప్పా కదా, అవి అగ్ని, వాయువు, వరుణుడు ఇలా వీరివన్న మాట. ప్రకృతి దేవతల విగ్రహాలు కాబట్టి అలా గంభీరంగా ఉన్నాయేమో. ఇక గుళ్ళో ఉండే తోటలు చాలా అందంగా ఉంటాయి, ఎంతైనా ప్రకృతి ఆరాధకులు కదా. చాలా రకాల చెట్లు, దీపస్తంభాలు, మంచిగా పేర్చినా రాళ్ళు, చిన్ని చిన్ని సరస్సులు, వీటి వల్ల చల్లగా ఉండే వాతావరణం, అన్నీ చాలా బాగుంటాయి. వాటి అందం గురించి నేను చెప్పడం కన్నా మీరే చూడండి.









బౌద్ధమతం ఇక్కడికి 6 వ శతాబ్దంలో వచ్చింది. చైనా నుండి కొరియా, కొరియా నుండి జపాన్ వచ్చింది. అప్పటి రాజులకు చాలా నచ్చి స్వీకరించారు, చాలా గుళ్ళు కట్టించారు. తరువాత తరువాత బౌద్ధ మతంలోనే చాలా రకాలు వచ్చాయి, మహాయాన బౌద్ధం, వజ్రయాన బౌద్ధం, జెన్ బౌద్ధం అలా చాలానే ఉన్నాయి. ఇంకా ఏంటంటే బౌద్ధాన్ని ఇక్కడ లొకలైజ్ చేసారు. మనదగ్గరి చాలా పేర్లు ఇక్కడి పేర్లకు తగ్గట్టు గా మార్చారు. ఉదాహారణకి వినాయకుణ్ణి 'కాంగీ-తెన్' అంటారు, శివుడిని 'దైజిజాయ్-తెన్' అని అంటారు(బౌద్ధమతం తో పాటు ఇవి వచ్చుంటాయి, ఎలా వచ్చాయో నాకు తెలియదు). నేను కమకుర, క్యోటో వెళ్ళినప్పుడు అక్కడి గుళ్ళలో భారతీయ దేవుళ్ల విగ్రహాలను చాలానే చూసాను. విష్ణు, బ్రహ్మ, నారదుడు, తుంబురుడు ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి. వాటి క్రింద మొదలు జపనీస్ పేరు, తరువాత సంస్కృతంలో ఈ పేరు అని రాసి ఉన్నాయి (ఈ గుళ్ళలో ఫోటోగ్రఫి నిషిద్ధం అందుకే ఫోటోలు తియ్యలేకపోయాను). అంతేకాక బౌద్ధమతం షింటో తో బాగా కలిసిపోయింది. అందులో ఉండే ప్రకృతి దేవతలను వరణుడు, ఇంద్రుడు ఇలా వీరి తో పోల్చి అంతా ఒకటే అనే భావన తీసుకొచ్చి ఉంటారు. అప్పటి గుళ్ళు షింటో, బౌద్ధం రెండు కలిపి కట్టించారు.



గుడిలోపలికి వెళ్ళే ముందు చెప్పులు విప్పడం, చేతులు కడుక్కోవడం, ఊది బత్తీలు వెలిగించడం, క్యాండిల్ వెలిగించడం, దీపలు వెలిగించడం, గంట కొట్టడం, ఏదైన కోరిక ఉంటే చీటీ రాసి గుడి దగ్గర కట్టడం, హుండీ లో డబ్బులు వేయడం ఇలా చాలా ఉన్నాయి మనదగ్గరిలా. నేను వెళ్లిన ఒక గుడిలో డబ్బులను అక్కడ ఉన్న నీటితో తడిపితే డబ్బులు రెట్టింపు అవుతాయని (అంటే భవిష్యత్తులో) నమ్మకం అట. చాలా మంది అలా చేస్తూ కనపడ్డారు. కొందరైతే కాగితం నోట్లు కూడా తడుపుతున్నారు. తరువాత అక్కడ ఉన్న ఊది బత్తీల వేడిలో ఆరబెట్టారు. అది చూడగానే మన ఆసియా వాళ్లకి ఇలాంటి నమ్మకాలు చాలా ఉంటాయి అని అనిపించింది.





నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, కొన్ని గుళ్ళల్లో డ్రాగన్ బొమ్మలు ఉండటం. డ్రాగన్ అనగానే నా దృష్టిలో మంటలు చిమ్ముతూ అందరిని భయపెట్టే ఒక విలన్. అలాంటి విలన్ ను వీళ్లు పూజించటం ఏంటి అనే ప్రశ్న నా మెదడును తొలిచేది. నేను క్యోటో లో ఒక గుళ్ళో 'వాసుకి, ది డ్రాగన్ కింగ్' అని చూసిన తరువాత నా సందేహం తీరింది. అంటే మనదగ్గరి పాములు ఇక్కడి డ్రాగన్ లు అన్నమాట. మనదగ్గర పాములను పూజించినట్టు ( నాగుల చవితి, నాగుల పంచమి ) ఇక్కడ డ్రాగన్ లను పూజిస్తారు. కాని ఇంకో అనుమానం ఏంటంటే పాములు అయితే ఉన్నాయి, కాని డ్రాగన్ లు లేవు కదా అని. మళ్లీ ఆలోచిస్తే, మనదగ్గర ఆదిశేషువు, వాసుకి లా పది తలల పాములు లేవు కదా ( ప్రస్తుతం ) అలాగే డ్రాగన్ లు కూడా అని అనుకున్నాను. అలాగే మంచి డ్రాగన్ లు ఉంటాయి చేడువి ఉంటాయి. ఎప్పటిలా చెడు వాటిపైన మంచివి విజయం సాధిస్తాయి.



రెండో ప్రపంచ యుద్దం తరువాత ప్రజలు దేవుడు, మతం గురించి పట్టించుకోవడం మానేసారు. మొదట చెప్పినట్టు ఏ మతం లో ఏది నచ్చితే అది చేస్తారు. దైనందిన జీవితంలో షింటో, బౌద్ధ మత పద్దతులు అవలంభిస్తారట, కాని ఆ విషయం వారికే తెలియదు.

జపాన్ విశేషాలు - 4 (ఆహారపు అలవాట్లు)  

Posted by ప్రపుల్ల చంద్ర in


జపాన్ అనగానే వీళ్లు అన్నీ తింటారు అని అనుకోకండి, సముద్రంలో దొరికే అన్నింటిని మాత్రం తింటారు. కప్పలు, తేళ్ళు, పాములు మొదలైనవి తినరు చైనా వాళ్లలా !!. వీరి ఆహారంలో ఎక్కువ నూనె వేయరు, ఉప్పు కారాలు ఎక్కువగా వాడరు. చీజ్ ఎక్కువగా తినరు. ప్రపంచంలో ఆరోగ్యకరమైనా ఆహారం వీరిదేనేమో. ఇక్కడి తీపి వంటకాలు అంత తీపిగా ఉండవు. ఒకసారి మా కొలీగ్ కి ’జిలేబి’ ఇస్తే, అతను తిన్న తరువాత ’నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో గొడ్డు కారం తిని ప్రకాష్ రాజ్ ఎలా అరుస్తాడో అలా అరిచాడు. ఆవకాయ తినిపిస్తే చచ్చిపోతాడేమో!!. వీరు ఏ రుచి ఎక్కువ మోతాదులో ఉన్నా తినలేరు. కాని వీరి వంటకాలు చాలా రుచిగా(ప్రత్యేకమైన) ఉంటాయట. శాఖాహారం నేను తిన్నాను, కొన్నింటి రుచి బాగున్నాయి. మాంసాహారం కూడా చాలా బాగుంటుందట, నా స్నేహితులు ఇష్టంగా తింటారు. నేను చెప్పబోయే చాలా విషయాలు నా స్నేహితుల అభిప్రాయలే, ఎందుకంటే ఇక్కడ మాంసాహారం ఎక్కువ గనుక.

వీరి ఆహారం లో అన్నం ఒక ముఖ్యభాగం. వీళ్లు ఆహరం పొడుగు పుల్లలతో ( అదేనండి చాప్ స్టిక్స్ తో !!!) తింటారు కాబట్టి మెత్తగా ఉండేట్టు చూసుకుంటారు, ముద్దగా ఒక్కచోటే ఉంటే పుల్లలతో పట్టుకోవడం సుళువు కదా. ఇక్కడ వీరు మనలా కూరలు చేసుకుంటారు, కాకాపోతే అన్నం, కూర కలుపుకొని తినరు. మొదలు కొద్దిగా కూర తిని, తరువాత కొద్దిగా అన్నం, అలా తింటారు.


జపాన్ ఆహారం అని అనగానే మొదట అందరికీ గుర్తుకు వచ్చేది సుషి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచూర్యం పొందింది, జపనీయులకు చాలా ఇష్టమైన వంటకం. సుషి అంటే కేవలం పచ్చి చేప మాంసం (raw fish) అని అందరూ అనుకుంటారు, కాని దానితో పాటు వెనిగర్ వేసి చేసే అన్నం (చాలా రుచిగా ఉంటుందట), ప్రత్యేకమైన అల్లం ముక్కలు, ఇంకా వేరే సాస్ ( mayonnise sauce లాంటి ) లతో కలిపి సుషి చేస్తారు. చాలా రకరకాల సుషి లు ఉన్నాయి. దాదాపు సముద్రం లో దొరికే అన్నిటితో ( చేపలు, రొయ్యలు, ఆక్టోపస్, నక్షత్ర చేప, స్క్విడ్ వగైరా వగైరా లతో) సుషి చేస్తారు. రుచిగా ఉండటమే కాక చాలా శక్తిని కూడా ఇస్తుందట. నా స్నేహితుడు సుషి తినడం కోసమని టోక్యో లో పెద్ద చేపల మార్కెట్ ట్సుకిజి (tsujiki) కి ప్రొద్దున్నే 6 గంటలకు వెళ్లాడు, తాజా సుషి దొరుకుతుందని. అప్పటికే చాలా రద్దీగా ఉందట. ప్రొద్దున తింటే మళ్ళీ మరుసటి రోజు వరకు ఏమీ తినలేదు. అంత శక్తి ఇస్తుంది ( పచ్చిది కాబట్టి అరగడానికి చాలా సమయం పడుతుంది, అది వేరే విషయం).


సోబా నూడిల్స్ జపాన్ వారి నూడిల్స్, ఇవి బక్ వీట్ (buckwheat) మరియు గోధుమలతో చేస్తారు. ఇవి మాములు నూడిల్స్ (చైనా నూడిల్స్) లాగే ఉంటాయి కాని గోధుమ రంగులో ఉంటాయి. ఇవి వేరు వేరు సూపులతో తింటారు.



ఉదాన్ అనే ఇంకో రకం నూడిల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇవి మాములు నూడిల్స్ కన్నా లావుగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఇవి గోధుమలతో చేస్తారు. ఇవి కూడా వేరు వేరు సూపులు, పదార్ధాలతో కలిపి తింటారు.



రామెన్, ఇది చైనీస్ నూడిల్స్, సూప్, గ్రుడ్డు, చికెన్ ఇలా చాలా వాటితో కలిపి చేస్తారు.



తోఫు, జపాన్ లో చాలా ప్రాచూర్యం పొందిన శాఖాహారం. ఇది బీన్స్ తో చేస్తారు. ఇది చూడడానికి అచ్చు మన దగ్గరి పనీర్ లా ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. వీటితో రకరకాల వంటకాలు చేస్తారు.



ఒనిగిరి, అన్నం ను 'sea weed' ( ఆకుపచ్చ రంగులో ఉండే పాచి లాంటి పదార్ధం, ఇది సముద్రం లో దొరుకుతుంది) లో చుట్టి, మధ్యలో రకరకాల పదార్ధాలను కలిపి తయారుచేస్తారు. ఇది జపాన్ లో చాలా మంది తినే అల్పాహారం. జపాన్ వాళ్లు చాలా ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి కారణం, ఈ seaweed, సుషి, జపనీస్ టీ ( గ్రీన్ టీ ) తీసుకోవడం వల్లే.



తెంపురా, ఇవి దాదాపు మనదగ్గరి బజ్జీలలాంటివి. ఇవి చాలా కూరగాయలతో చేస్తారు, రొయ్యలతో కూడా చేస్తారు. ఇది కూడా నాకు చాలా నచ్చింది.



యాకితోరి, ఇది చికెన్ తో చేస్తారు (grilled chicken) . ఇది చాలా చోట్ల దొరికే రుచికరమైన వంటకం.

అన్నం తో చేసే లిక్కర్ 'సకే' ఇక్కడ ప్రాంతీయంగా దొరికే మద్యం. అలాగే ఆలుగడ్డ తో చేసే 'సోచో' కూడా.



చాలా స్వీట్స్ ఇక్కడ బియ్యం (పొడి), బీన్స్ లతో చేస్తారు. అన్నింటికన్నా బాగుండేది(ప్రాచూర్యమైనది కూడా) యాట్సుహషి. నాకు చాలా నచ్చింది.



మీరు మైల్ ఫార్వర్డ్స్ లో జపనీస్ కేక్స్ అని చాలా మంచిగా (అందంగా) ఉన్నవి చూసుంటారు. మేము ఒకసారి బయటికి వెళ్లినప్పుడు అచ్చు అలాంటివే చూసాము. నోరూరి ఒక నాలుగు రకాలు తీసుకొని నలుగురము కొద్ది కొద్దిగా తిన్నాము. చాలా చెండాలంగా ఉన్నాయి, నోట్లో పెట్టుకోడానికి కూడా వీల్లేవు. అస్సలు రుచే లేవు. చెప్పాను కదా వీరు తీపి ఎక్కువగా తినరు. మళ్లీ జన్మలో తినొద్దని నిర్ణయించుకున్నాము. మేము తిన్నవే బాగోలేవేమో మాకు తెలియదు. అయినా తియ్యగా లేకపోతే క్రీం రుచి ఏముంటుంది.

సాధారణం గా దాదాపు అన్నీ వంటకాలలో మటన్, పోర్క్, చికెన్, బీఫ్ ఏదో ఒకటి ఉంటుంది. వద్దనుకుంటే 'నిక్కు నాషి' ( మాంసం వద్దు ) అని చెప్తే వెయ్యరు. కాని వీళ్ల దౄష్టిలో చేపలు ( సముద్రం లో దొరికే రొయ్యలలాంటివి కూడా ) మాంసం కాదు. ప్రత్యేకంగా 'సకానా దమే' ( చేపలు వద్దు ) అని చెప్పాలి. ఈ విషయాలలో శాఖాహారులు జాగ్రత్తగా ఉండాలి. మీరే వండుకోవాలనుకుంటే కూరగాయాలు మన దగ్గరిలాగే దొరుకుతాయి, కొన్ని ఇండియన్ గ్రాసరీ షాప్స్ కూడా ఉన్నాయి, కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. మేమైతే రోజు వండుకుంటాము.

మొత్తంమీద చెప్పాలంటే భోజనప్రియులు ( ముఖ్యంగా మాంసాహారులు ) కొత్త రుచికరమైన ఆహారం అది కూడా ఆరోగ్యమైనది తినవచ్చు.

గమనిక : ఫోటోస్ అన్నీ గూగుల్లో వెతికినవి.