జపనీస్ భాష గురించి చెప్పడం అంటే పెద్ద సాహసమే. నాకు తెలిసినంతలో నేను చేసే చిరు పరిచయం మాత్రమే ఈ టపా. చెప్పాలంటే జపనీస్ నేర్చుకోవడం కొద్దిగా కష్టతరమే ( అంటే నేర్చుకోలేమని కాదండోయ్ ). ఇక్కడి కామిక్స్, ఆనిమేషన్స్, వీడియోగేమ్స్ చాలా ప్రాచూర్యం పొందటం వలన అవి చదవడానికి/చూడటానికి చాలా మంది విదేశీయులు జపనీస్ నేర్చుకుంటున్నారట. మన దగ్గర కూడా చాలా యూనివర్సిటీల్లో విదేశీ భాషగా జపనీస్ నేర్చుకుంటున్నారు.
జపాన్ భాషని జపనీయులు 'నిహాంగో' అంటారు. 7వ శతాబ్దం వరకు వీరికి లిపి లేదు, ఆ తరువాత వీరు చైనీయుల దగ్గరి నుండి వారి లిపిని ( కాంజి, చిత్రాలతో ఉండే లిపి ) తీసుకున్నారు. లిపి చైనా వారిది, పలకడం వీరి భాషలో అన్నమాట. లిపితో పాటే వీరి దగ్గర లేని కొన్ని పదాలు కూడా చైనా నుండి వచ్చాయి. ఆ తరువాత బౌద్ధ సన్యాసులు కొన్ని అక్షరాలతో జపాన్ భాష రాసే విధంగా ఒక లిపి ని కనిపెట్టారు. ఆ లిపిని కతాకానా అంటారు. ఇప్పుడది విదేశీ పదాలు వ్రాయడానికి ఉపయోగిస్తున్నారు. జపాన్ భాషని సులువు చేయడానికి ఆ అక్షరాలకు వేరే లిపి కనిపెట్టారు ఆ లిపిని హిరాగానా అంటారు. కాంజీ కి బదులుగా ఈ పదాలతో వ్రాయవచ్చు. కాకపోతే మొత్తం కాంజి తో వాక్యాలు వ్రాయడం కుదరదు. హిరాగానా ఉపయోగించి కొన్ని పదాలను కలపవలసి ఉంటుంది. ఆ మూడు లిపుల ఉపయోగాలు ఇలా ఉంటాయి,
1. కాంజి. ఈ లిపిలో దాదాపు ఒక 5000 కాంజీలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క పదానికి ఒక కాంజి (రేఖా చిత్రం) ఉంటుందన్నమాట. ఒక 1500 నేర్చుకుంటే సరిపోతుందట. ఈ కాంజి ఉపయోగం ఎలా ఉంటుందంటే ఉదాహారణకి 'వెళ్ళడం' అనే పదానికి ఒక కాంజి ఉంటుంది. కాకపోతే 'వెళ్తాను', 'వెళ్ళాను', 'వెళ్దాము', 'వెళ్ళబోతున్నాను' ఇలా తేడా చూపెట్టలేదు, ఆ కాంజీకి హిరాగానా లోని అక్షరాలను కలిపితే ఆ పదం పూర్తవుతుంది, అంటే కాంజితో మూలపదాన్ని వ్రాయవచ్చు.
అంతేకాక ఒకే కాంజిని సందర్భం బట్టి వేరేగా పలకాల్సి ఉంటుంది.
ఉదాహారణకి '日' అనే ఈ కాంజికి ఉన్న అర్ధాలు : రోజు, సూర్యుడు, జపాన్, రోజుల లెక్కలలో ఉపయోగిస్తారు, ఒక్కో సందర్భంలో ఒకలా పిలుస్తారు. కొన్ని కాంజీలకి 20 దాకా అర్ధాలు/పిలుపులు ఉన్నాయి.
అలాగే ఒకే పిలుపు ఉన్నా, సందర్భాన్ని బట్టి వేరే కాంజీలతో వ్రాస్తారు.
ఉదాహారణకి వేడి ని 'అట్సుయి' అంటారు, కాకాపోతే వాతావరణం లో వేడి, తినే పదార్ధం వేడి, వెచ్చదనం, warm heart ఇలా వేరే వేరే సందర్భాలలో ఒకేలా పలికినా(అట్సుయి అని) వేరే కాంజిలతో వ్రాస్తారు (厚い、篤い、熱い... ఇలా ).
ఇంకో సందర్భం ఉంది, అందులో ఒక కాంజికి ఒకే అర్ధం ఉంటుంది, కాని సందర్భాన్ని బట్టి వేరేలా పలకాలి.
ఉదాహారణకి '行' అనే కాంజి 'వెళ్ళడం' ను సూచిస్తుంది. మామూలు గా మాట్లాడేటప్పుడు ’ఇకిమస్’ అంటారు. గౌరవంగా మాట్లాడేటప్పుడు ’యుకిమస్’ అంటారు.
వేరు వేరు కాంజీల కలయికతో కొత్తపదాలు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అన్నింటికీ ఇలాగే రావాలి, ఇలాగే ఉండాలి అని నిబంధనలు లేవు, మన అనుభవంతో నేర్చుకోవడమే.
కాంజి ని బొమ్మల ఆధారంగా ఎలా వ్రాయడం మొదలుపెట్టారో ఈ క్రింది బొమ్మని చూడండి. కాంజి కి బొమ్మకి సారూప్యత చూడవచ్చు. (అందులో పైన ఉన్న కాంజి చేపను సూచిస్తుంది, తరువాత గడులలో ఎలా వ్రాయలో ఉంది)
2. హిరాగానా, ఇది ఒక 71 అక్షరాలతో ఉన్న లిపి ( గుణింతాలతో సహా ), ఒత్తులు లేవు 'య' ఒత్తు, ఒత్తి పలికే ఒత్తులు ( న్న, ర్ర లాంటివి ) తప్ప, అంటే 'ప్ర', 'బ్ద' లాంటివి లేవు, వ్రాయలేము !!!. 'చ' ,'ల' , 'ట' , 'డ' అక్షరాలు లేవు. పొల్లు అక్షరాలు లేవు ఒక్క 'న్' తప్ప. చెప్పాలంటే అక్షరాలు తక్కువగా ఉన్నాయి, వీరి భాష వ్రాయడానికి ఇవి చాలు ( అంటే భాష తరువాతే లిపి వస్తుంది కాబట్టి అవే అక్షరాలు ఉంటాయనుకోండి అది వేరే విషయం).
చిన్న పిల్లలకి నేర్పేప్పుడు కాంజి కష్టం కాబట్టి హిరాగానా లో నేర్పిస్తారు. ఉదాహారణకి నదిని 'కవా' అంటారు, '川' అనే కాంజితో సూచిస్తారు. దాన్ని హిరాగానాలో 'かわ' (క వా) అని వ్రాయవచ్చు. కేవలం 71 అక్షరాలే (5000 లతో పోలిస్తే) కాబట్టి ఈ లిపి చాలా సులువు.
కాంజి లేని వాటికి, పదాలని కలపడానికి, కాంజి కి పూర్తి అర్ధం తీసుకురావడానికి హిరాగానాని ఉపయోగిస్తారు.
3. కతాకానా, ఇందులో కూడా హిరాగానా లో ఏవైతే అక్షరాలు ఉన్నాయో అవే ఉన్నాయి, కాకపోతే లిపి వేరు అంతే. ఇది ముఖ్యంగా విదేశీ పదాలను వ్రాయడానికి ఉపయోగిస్తారు. వీరి భాషలోకి కూడా వేరే భాష పదాలు వచ్చి పడ్డాయి ( ముఖ్యంగా ఆంగ్ల పదాలు ). ఎంత వేరే పదాలను చేర్చుకున్నా ఇలా వేరే లిపిలో రాసి వేరుగానే ఉంచారు. అంతేకాక కతాకానా తో కంపెనీ పేర్లు, రైల్వేస్టాప్ ల పేర్లు కూడా వ్రాస్తారు.
ఇంకో రాసే విధానం ఉంది, దీని పేరు రోమాజి, జపాన్ భాషని రోమన్ అక్షరాలతో ( ఆంగ్లం లో ) వ్రాస్తారు. ఇది కేవలం విదేశీయులు నేర్చుకునేప్పుడు వాడుతారు.
నేను ఇంకో లిపి కనిపెట్టా ’తెలుజి’, ఇదేంటి అనుకుంటున్నారా, జపాన్ భాషని తెలుగు లిపిలో వ్రాయడం. పేటెంట్ ఏమి తీసుకోలేదు ఎవరైనా వాడుకోవచ్చు :) .
వీరు మాములుగా వాక్యాలు, అడ్వడైజ్ మెంట్లు ఎడమ నుండి కుడికి వ్రాస్తారు మనలా. కాకాపోతే పుస్తకాలు, పేపర్లలో మాత్రం కుడి నుండి ఎడమకి వ్రాస్తారు, అది కూడా నిలువు లైన్లలో !!!. అంటే పేజికి పూర్తి కుడివైపున పై నుండి క్రిందికి వ్రాసి తరువాత లైన్ మళ్ళీ పై నుండి మొదలు పెడతారు. వీరు కాంజి వ్రాస్తారు కాబట్టి అలా వ్రాయడం కుదురుతుంది (ఒక్కొక్కపదం ఒక బొమ్మ కాబట్టి). మనకు మాత్రం ఇది ఒక కొత్త పద్దతే !!!. ఒక మాదిరిగా ఉర్దూలాగానే, కాకపోతే నిలువు లైన్లలో.
దాదాపు జపాన్ వాక్యాలలో ఈ మూడు లిపులు ( కాంజి, హిరాగానా, కతాకానా ) కలిపి వ్రాస్తారు, కాబట్టి మూడూ నేర్చుకోవలసిందే( కాంజి కి బదులుగా హిరాగానా ఉపయోగించవచ్చు, కాని జపనీయులు చాలాచోట్ల కాంజి వ్రాస్తారు, కాబట్టి తక్కువలో తక్కువ 500 కాంజీలు నేర్చుకోవాలి !! ). ఈ వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, జపాన్ భాషలో నేను గమనించిన విషయాలు వచ్చే టపాలో. ( కొద్దిగా వ్రాద్దామని మొదలుపెడితే పెద్దగా అయ్యింది, అందుకే రెండు గా విడగొట్టాల్సి వచ్చింది)
9 comments
బాగున్నాయి మీ జపాన్ విశేషాలు. హైకూల గురించి కూడా ఏమైనా వ్రాయండి.
బాసు ఇంత సమాచారం ఎంత ఒపికగా సంపాదించావు :) ... నీ ఒపిక మెచ్చుకో తగినది. చలా మంచి టపా రసావు...
enni rojula nundu untunnaru akkada meeru, chala vishayalu cheptunnaru..
japan nu kallakukattinatlu aavishkaristhunnaru...abhinandanalu..
దాదాపు రెండు దశాబ్దాల క్రితం కత, కలకత్తా లో వుద్యొగం వెలగబెట్టేటప్పుడు, కతాకాన నేర్చుకొన్నాను. అప్పట్లొ ఎదో సర్టిఫికేట్ లాంటిది, తీసుకొన్నాను. నేను పనిచేసిన కంపినీ లోనే, గార్గి అని ఒకావిడ, ఉండెది. తను, కతకానా లో, ఏ పదాలు చేర్చాలో, అని నిర్ణయించే కమిటీ లో వుండే వారు. జపాన్ వాళ్ల టి.వి. వాళ్లు అప్పుడప్పుడు కలకత్తా వచ్చి తనతో, ఇంటెర్వ్యు, చేస్తూవుంటే, అనర్గళంగా, జపనీస్ లో, మాట్లాడుతూ, ఇంటెర్వ్యూ ఇస్తూ వుంటే, ఎంత ముచ్చట వేసేదో. మన ప్రాచీన సంస్క్రుతి కి చాలా దగ్గరగా ఉండే, సంస్క్రుతి అని చెప్పవచు, ముఖ్యంగా, పెద్ద వాళ్లను గౌరవించటం వగైరా. మంచి టపా వ్రాసారు
@రవి,
నాకు అంతగా రాదులేండి, నేను కనీసం మీలా వాక్యాలు కూడా సరిగ్గా వ్రాయలేను :(
మంచి సమాచరం అందించారు, ధన్యవాదాలు...
@Chandra Mohan,
నెనర్లు, హైకుల గురించి నాకు తెలియదండి, అవకాశం ఉంటే ప్రయత్నిస్తాను.
@Murali.Marimekala, @aswin budaraju, @bhagavan
నెనర్లు.
@bujji,
నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం పైనే అయ్యిందండి.
@Krishna,
నెనర్లు, అవునండి ఇక్కడి కొన్ని పద్దతులు మన పద్దతులలా ఉంటాయి.
preview inquiring neut heatmap year scaled shielding cultivation sublanguages cpace volcanoes
lolikneri havaqatsu
Post a Comment
నేను
- ప్రపుల్ల చంద్ర
- చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమి లేదు, శతకోటి బ్రహ్మీ లలో ఒక బ్రహ్మి. నా సరదా ఙ్ఞాపకాలను, ఆలోచనలను, చూసిన ప్రదేశాల విశేషాలను మీతో పంచుకోవాలనే ప్రయత్నమే ఈ బ్లాగ్.