జపనీయుల రోజువారి జీవితం, ఇంకా ఇక్కడి work environment గురించి ఈ టపా ( నేను చూసే నా సహోద్యోగులది చెబుతాను, మిగతావారిది కూడా దాదాపు ఇలాగే ఉండవచ్చు ) .
సాధారణంగా ఉద్యోగులు ఉదయం 7 గంటలకే ఇంటి నుండి బయలుదేరుతారు. నగరంలో ఉండడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి చాలా మంది దూరప్రాంతాలలోనే ఉంటారు. కాబట్టి అలా ప్రొద్దున్నే బయలు దేరి ఒక 2 గంటల ప్రయాణం తరువాత కార్యాలయం చేరుతారు. దాదాపు 90% మంది ప్రయాణానికి రైళ్ళని ఉపయోగిస్తారు. వ్యక్తిగతంగా కార్లు ఉన్నా, ట్రాఫిక్ ఇబ్బంది వల్ల పెద్దగా వాడరు, వారాంతాలలో తప్ప. అంతేకాక ఇక్కడ అన్ని సిగ్నల్ల వద్ద పాదాచారులకు, వాహనాలకు ఒక్కసారే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, పాదాచారులు రోడ్డు దాటేంతవరకు వాహనాలు ఆగాల్సిందే, దాని వల్ల ఇంకా ఆలస్యం అవుతుంది. ప్రొద్దున రైళ్ళు కూడా చాలా కిక్కిరిసి ఉంటాయి. రైళ్ళో వచ్చేప్పుడు చాలా మంది కామిక్స్ పుస్తకాలు చదువుతూ ( జపనీయులకి కామిక్స్ అన్నా ఆనిమేషన్స్ అన్నా పిచ్చి ) పాటలు వింటూ లేకపోతే వీడియో గేములు ఆడుతూ కనపడతారు. విచిత్రమైన విషయం ఏంటంటే కొందరు నిలబడి ఉన్నా నిద్రపోతారు, అది ఎలా సాధ్యమో నాకు అర్ధం అవ్వలేదు. చాలా రద్దీగా ఉండే రైలు ఎక్కాలంటే ఎన్ని కష్టాలో తెలియడానికి వీడియో చూడండి.
ఆఫీస్ కి కొద్దిగా దగ్గరలో ఉన్న వాళ్ళు సైకిల్ ఉపయోగిస్తారు. ఇక్కడ సైకిళ్ల మీద ఆఫీస్ రావడాన్ని ఎవరూ నామోషీగా భావించరు. కొందరు సూట్ వేసుకొని కూడా సైకిల్ పై ఆఫీస్ కి వస్తారు. నేను చేసే కంపనీలో దాదాపు ఒక 400 మంది సైకిల్ పై వస్తారు. వీరు రైళ్లు, సైకిళ్లు ఉపయోగించడం వల్ల చాలా ఇంధనం ఆదా చేస్తున్నారు.
నలుపు రంగు సూట్లు పెళ్లిలకి వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా చనిపోయినప్పుడు తప్ప సాధారణంగా వేసుకోరు. ఆఫీస్ కి వచ్చేప్పుడు నలుపు కాక ఇంకా వేరే ఏదైనా (నలుపు రంగుకి దగ్గర్లో ఉండే) సూట్ వేసుకుంటారు. అలా అని అందరూ సూట్లు వేసుకోరు. మాములు బట్టల్లో కూడా వస్తారు. కెనాన్ లాంటి కంపనీల్లో యునీఫాం వేసుకొని వెళ్తారు. మా ఆఫీస్ లో ప్రత్యేకంగా ఇలాగే రావాలి అని ఏమి లేదు, ఒకతను గత సంవత్సరంగా రోజూ మోకాళ్ల దగ్గర చినిగి ఉన్న ఒకే జీన్స్ వేసుకొని వస్తున్నాడు !!!
మా ఆఫీస్ లోపలికి అడుగుపెడుతూ ఉంటే ఒక అయిదుగురు అక్కడ నిలబడి ( బయట గేట్ వద్ద కాదు, లోపల ) వచ్చిన అందరికి ’ఒహాయో గొజాయిమసు’ ( good morning ) అని చెబుతారు. చాలా మంది ఉండే సరికి కొద్దిగా సందడిగా ఉంటుంది. ఇది కేవలం ప్రొద్దున 9 గంటల లోపే ఉంటుంది. మేము ఆలస్యంగా వెళ్తాము కాబట్టి కొన్ని సార్లే చూసాము. 9 గంటలకి గంటలు మ్రోగుతాయి, అప్పటి నుండి పని గంటలు మొదలవుతాయి. కాకపోతే మా ఆఫీస్ పనిగంటల విషయంలో ఎవరి ఇష్టం వారిది.
ఆఫీస్ లో అడుగుపెట్టినప్పటి నుండి పని చేస్తూనే ఉంటారు. మొదట కొద్దిసేపు ఆ రోజు చేయవలసిన వాటి గురించి చర్చించుకొని పని మొదలు పెడతారు. వ్యక్తిగత పనులు ( అంటే అంతర్జాలంలో ) అసలే చేసుకోరు. మేము చేసుకుంటాం అది వేరే విషయం. ప్రతీ చిన్న విషయం గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. సుళువుగా ఒక నిర్ణయానికి అస్సలురారు.
12 గంటలకి మళ్ళీ గంటలు మ్రోగుతాయి. అప్పుడు అందరూ భోజనం చేయడానికి వెళ్తారు. ఆ సమయం లో లైట్లు ఆర్పేస్తారు ఒక గంట వరకు, అలా చాలానే విద్యుత్తు ఆదా చేస్తున్నారు, అలాగే భూతాపాన్ని తగ్గిస్తున్నారు. వీరు ఆహారం చాలా తొందరగా తినేస్తారు. మా ఆఫీస్ లో 6 అంతస్తులు ఉండటం తో ఒక్కో అంతస్తు వారికి ఒక్కో సమయాన్ని కేటాయించారు (ఒక్కో అంతస్తులో ప్రతీ 15 నిముషాలకి గంటలు మ్రోగుతాయి). కాబట్టి అందరూ ఒక 15 నిముషాలలో తినడం ముగించేస్తారు. తిన్న తరువాత నిద్రపోయేవారు నిద్రపోతారు, కొందరు వ్యాయామం చేస్తారు, కొందరు ఆటలు ఆడుతారు. ఇలా ఎవరి ఇష్టాలని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. తినగానే చాలా మంది దంతధావనం చేసుకుంటూ కనపడతారు.
మళ్ళీ 1 గంటకి గంటలు మ్రోగుతాయి, మళ్ళీ లైట్లు వేస్తారు, పని మొదలుపెడతారు.
జపాన్ లో మంచి నీరు పెద్దగా త్రాగరు, అందరూ ఎనర్జీ డ్రింక్స్ త్రాగుతారు. మాములుగా ప్రతీ వీధిలో వెండింగ్ మెషీన్స్ ఉంటాయి 24/7. ఫ్రూట్ డ్రింక్స్, విటమిన్ డ్రింక్స్, కోలా, టీ, కాఫీ ఇలా చాలానే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్యా ఉండదు. మా ఆఫీస్ లో కూడా మా అంతస్తులో ఒక 5,6 మేషీన్లు ఉన్నాయి. అంతేకాక ఇక్కడ ఒక 7,8 రకాల చెత్తడబ్బాలు ఉంటాయి. గాజుసీసాలు ఒకదాంట్లో, ప్లాస్టిక్ సీసాలు ఒకదాంట్లో, టిన్లు ఒక దాంట్లో, పేపర్లు ఒకదాంట్లో, ప్లాస్టిక్ కవర్లు ఒకదాంట్లో, అట్టా డబ్బాలు ఒకదాంట్లో వెయ్యాలి. రిసైక్లింగ్ కి సుళువుగా ఉంటుందని అలా విడివిడిగా పెడతారు ( అభివృద్ది చెందిన అన్ని దేశాలలో ఇలాగే ఉండవచ్చు !! ). గొడుగులు పెట్టుకోడానికి స్టాండులు చాలా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ సంవత్సరం పొడవునా వర్షాలు పడుతూనే ఉంటాయి.
మళ్ళీ 6 గంటలకి గంటలు మ్రోగుతాయి, అప్పుడు భోజనం చేస్తారు (ఇక్కడ రాత్రి భోజనం చాలా త్వరగా చేస్తారు). భోజనం తరువాత మళ్ళీ పనిలో పడతారు. ఆ తరువాత ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ కనపడతారు. కొందరు రాత్రి 12 గంటల వరకు పనిచేస్తూనే ఉంటారు, ఆఖరి ట్రైన్లో ఇంటికి వెళ్తారు. మా ఆఫీస్ లో ప్రతీ బుధవారం సాయంత్రం 6 గంటలకే వెళ్ళిపోవాలి ( రోజు ఎక్కువ పని చేయడం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని ఆ నియమం పెట్టారు), కాని కొందరు ఆ రోజు కూడా రాత్రి వరకు పని చేస్తూనే ఉంటారు.
పని ఒత్తిడి నుండి ఉపశమనం కోసం అప్పుడప్పుడు మందు పార్టీలకు వెళ్తూంటారు, వీరికి ’బీర్’ అంటే చాలా ఇష్టం, పీపాలు పీపాలు త్రాగుతారు. అప్పుడప్పుడు ’కరోకే’ కి ( కొన్ని ప్రత్యేకమైన హోటళ్లలో చిన్న స్టేజ్ ఉంటుంది, అది ఎక్కి మనం పాటలు పాడొచ్చు ) వెళ్తూ ఉంటారు.
జపాన్ భాష గురించి వచ్చే టపాలో...
10 comments
the way you said is nice
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి , @Ghanta Siva Rajesh
నెనర్లు,
@ రవి ,
అవునండీ, కొరియా జీవన విధానానికి చాలా దగ్గరగా ఉంటుంది, ఎంతైనా పక్కపక్క దేశాలు కదా :), అంతేకాక రెండోప్రపంచ యుద్దం కన్నా ముందు జపాన్ కొరియాను చాలా సంవత్సరాలు పాలించింది, కాబట్టి ఆ ప్రభావం ఉండొచ్చు !!!.
ఈ టపా లో చలా ఇంఫర్మేషన్ ఉంది ప్రపుల్లా :) బాగా రాసావు..మనం జపనీస్ నుండి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నయ్
ఇంటి కంటే ఆఫీసే పదిలం అన్నమాట! అందుకే కాబోలు వారు జ'పనీ'యులయ్యారు!
@Murali.Marimekala,
నెనర్లు,
@chaduvari,
భలే చెప్పారండి... వాళ్ళపేరులోనే పని ఉంది కదా, అందుకే పని పిచ్చి !!!
Chaala baaga chepaaru. vallaki pani kanna mukhyamainadi veredi ledu.
Very informative..
రోజువారీ అద్దే చెల్లిస్తూ net office అనబడే closets లో నివశించే నిరుద్యోగుల గురించి విన్నారా?
@teresa ,
నెనర్లు,
నేను కూడా విన్నానండి, నిరుద్యోగులే కాదు కొందరు ఉద్యోగులు కూడా అలా ఉంటారట. ఇక్కడ ఇళ్ళ అద్దె చాలా ఎక్కువ, పన్నులు కూడా ఎక్కువే అందుకే కొందరు అలా closets లో రోజువారి అద్దె చెల్లిస్తూ ఉంటారు.
@K.V.S.R.Gopala ,
నెనర్లు, అవునండీ
Post a Comment
నేను
- ప్రపుల్ల చంద్ర
- చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమి లేదు, శతకోటి బ్రహ్మీ లలో ఒక బ్రహ్మి. నా సరదా ఙ్ఞాపకాలను, ఆలోచనలను, చూసిన ప్రదేశాల విశేషాలను మీతో పంచుకోవాలనే ప్రయత్నమే ఈ బ్లాగ్.