జపాన్ లో నా మొదటి రోజు  

Posted by ప్రపుల్ల చంద్ర in ,

అలా జపాన్ కి చేరుకున్న తరువాత, ఏయిర్ పోర్ట్ బయటికి వచ్చాను. బయటే వరుసగా బస్ టికెట్లు ఇచ్చే కౌంటర్లు ఉన్నాయి. జపాన్ కు మొదటిసారి వచ్చినప్పుడు చాలామంది ఈ బస్సులనే ఉపయోగిస్తారట. ’ల్యుమినిసెన్స్’ బస్సు లో ’యోకోహామా’ వరకు టికెట్ తీసుకున్నాను, అక్కడకి మా వాళ్ళు నాకోసం వస్తా అన్నారు.
వెళ్ళి అక్కడ ఉన్న లైన్లో నిలబడ్డాను. జపాన్ లో జూలై నుండి సెప్టెంబర్ వరకు వేసవి కాలం, నేను సెప్టెంబర్ మొదట్లో వచ్చాను, అయ్యేసరికి చాలా వేడిగా ఉంది. నాకు అదితెలియక చొక్కా మీద చొక్కా, మళ్ళీ దానిపై జర్కిన్ వేసుకున్నాను. చేతిలో బ్యాగులు ఉండే సరికి జర్కిన్ అలాగే వేసుకొని నిలబడ్డాను, బస్సు ఎక్కాక తీసేయొచ్చని.

బస్సు రావడం, క్రింద ఉండే లగేజ్ క్యాబిన్లో లగేజ్ పెట్టేసి ఎక్కి కూర్చోవడం జరిగిపోయాయి. ప్రక్కనే ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. అప్పుడు మొదలయ్యాయి అస్సలు కష్టాలు, వేసుకున్న జర్కిన్ విప్పేదామనుకుంటే, చేతులు పక్కకి అనడానికి కూడా స్థలం లేదు, అనుకోకుండా ఆ అమ్మాయికి చేయితగిలితే, అబ్బో ఎందుకులే లేని తలనొప్పి, అసలే భాష కాని భాష, మనకు కనీసం ’excuse me' అని కూడా జపనీస్ లో ఎలా అనాలో తెలియదు, ఇలాంటి చిన్న చిన్న పదాలకోసం తీసుకున్న printout క్రింద ఉన్న లగేజ్ లో ఉండిపోయింది, ఇక ఏం చేస్తాం అలాగే కూర్చున్నాను. లోపల మాత్రం ఉడికిపోతోంది !!! చెమట తో స్నానం అయిపోతోంది.

జపాన్ లో రోడ్లు చాలా శుభ్రం గా, విశాలంగా ఉన్నాయి ( అన్ని అభివృద్ది దేశాలలో ఇలాగే ఉంటుందేమో! ). వాహనాలు కూడా శుభ్రంగా ధృడంగా కనపడ్డాయి(ముఖ్యంగా ట్రక్కులు). రోడ్డు ప్రక్కన ఉండే కొండలు, గుట్టలు నున్నగా ఉన్నాయి. దూరపు కొండలు నునుపు అనుకుంటే దగ్గరి కొండలు కూడా నునుపు గా ఉన్నాయి!!!. రోడ్లు, వాహానాలు అయితే అలా ఉండటంలో ఆశ్చర్యం లేదు కాని కొండలు అలా ఎలా ఉన్నాయో అర్థం అవ్వలేదు. కొద్దిగా పరీక్షగా చూస్తే, సిమెంట్ తో అలా చేసినట్టుగా కనపడింది. అంటే ఆ నునుపు సహజ సిద్దం కాదన్నమాట!!, ఎందుకలా చేసారబ్బా అని ఆలోచిస్తూ ఉంటే, భారతదేశంలో అప్పుడప్పుడు వినబడే మాటలు గుర్తుకు వచ్చాయి, ’కొండ చెరియలు విరిగిపడి........’, ఓహ్ ఇందుకోసమా అనిపించింది. అభివృద్ది చెందిన దేశాలంటే ఇలా ఉంటాయా అని అనిపించింది, ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టరు. ఆ కొండలపై కొన్ని చోట్ల ఆకులు క్రింద పడకుండా వలలు కూడా వేసి ఉంచారు!!!.

అస్సలు ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్లు కూడా కనపడలేదు, ప్రత్యేకంగా వేసిన 'expressway' అనుకుంటాను, ఎక్కడా ఆగకుండా బస్సు వెళ్ళింది. కొన్ని కిలోమీటర్లు సముద్రం క్రింది నుండి వేసిన underground tunnel గుండా ప్రయాణించాము. ఇళ్ళు అన్నీ చిన్న చిన్న అగ్గిపెట్టల్లా కనపడ్డాయి, చాలా ఇరుకుగా, ఒక్కచోటే చాలా ఉన్నాయి. జపాన్ స్థలాభావం అని తెలిసింది, టోక్యోలో జనసాంద్రత చాలా ఎక్కువ. రోడ్లు కూడా ’రోడ్డు మీద రోడ్డు కట్టి పదహారు రోడ్లు కట్టి, ఏ రోడ్లో పోతవ్..... ’ ( బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి..... లా అన్నమాటా !!!) అన్నట్టుగా ఒకదానిపై ఒకటి ఉండి వేరు వేరు దారుల్లో వెళ్తున్నాయి.




ఒక 1 1/2 గంటల తరువాత ’యోకోహామా’ చేరుకున్నాను. నా కోసం నా సహోద్యోగి (మురళి), మా నాయకుడు (ప్రాజెక్ట్ లీడర్) వచ్చారు. రెండు నెలల ముందు వచ్చిన మా ప్రాజెక్ట్ లీడర్ పాపం బక్క చిక్కిపోయాడు. అసలే వచ్చే ముందు మా వాళ్ళు తిండి గురించి చాలా భయపెట్టారు, త్వరలో నేను కూడా అలా అవుతానేమో అనుకున్నాను. జపాన్ అంటే అందరు మనుషులు ఒకేలా ఉంటారు! గుర్తుపట్టడం కష్టమేమో అనుకున్నాను, కాని ఇక్కడికి వచ్చాక చూస్తే ఒక్కొక్కళ్లు ఒకలా ఉన్నారు, గుర్తుపట్టడం అంత కష్టమేమి కాదు!!!.

అక్కడి నుండి ఒక రైలు లో మేము ఉండే ప్రదేశానికి వెళ్ళాలి. మా ప్రాజెక్ట్ లీడర్ ’Mr.లవంగం’ అవతారం ఎత్తి జపాన్ లో ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో చెప్పడం (భయపెట్టడం) మొదలుపెట్టాడు. ఒకచోట ’ఎవరిని తగలకు, ఇక్కడ కొందరికి తిక్క ! కోపం వస్తే కేస్ వేస్తారు’ అని అన్నాడు, ఇంకా నయం ఉరితీయిస్తారనలేదు అని మనసులో అనుకున్నాను. తరువాత తరువాత ఇక్కడ వాళ్ళు చాలా మంచి వాళ్ళని తెలిసిందనుకోండి అది వేరే విషయం. రోజూ రైళ్లలో ప్రయాణిస్తే వింత వింత జనాలను చూడవచ్చట, కాని మా ఆఫీస్ మా రూమ్ దగ్గరే అయ్యేసరికి ఆ అవకాశం రాలేదు.

రైలు మాత్రం చాలా బాగుంది. ఎక్కగానే చల్లగా A/C గాలులు తగిలాయి. ఒక 15 నిమిషాల ప్రయాణం తరువాత మేము చేరవలసిన ప్రదేశం వచ్చింది. అక్కడ నుండి మా రూమ్ కి చాలా దూరం. రోడ్లన్నీ పద్దతిగా ఫుట్ పాత్ లతో, ట్రాఫిక్ సిగ్నల్లతో ఉన్నాయి. చిన్న చిన్న రోడ్లలో కూడా అలాగే ఉంది. ఒకచోట మేము రోడ్డు దాటాలి, దరిదాపుల్లో ఎవరూ కనపడలేదు, మన పద్దతిలో రోడ్డు దాటుదామనుకుంటే మా నాయకుడు ససేమిరా అన్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ వరకు నడిచి, అక్కడ గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఆగి అప్పుడు దాటాము. ఇప్పుడు అదే అలవాటైయింది. అలా మొత్తానికి రూమ్ కి చేరుకున్నాను.
జపాన్ విశేషాలు, చూసిన ప్రదేశాలు చాలా వున్నాయండోయ్... అవి వచ్చే టపాలలో....

ఎర్ర బస్సు నుండి ఎయిర్ బస్ కు  

Posted by ప్రపుల్ల చంద్ర in ,

నాకు విమానం ఎక్కడం అంటే చాలా భయం. బస్సు అనుకోండి, చెడిపోతే రోడ్డు ప్రక్కన ఆపుతారు. ట్రైన్ అనుకోండి, చెడిపోతే ఏ ప్లాట్ ఫామ్ దగ్గరో లేక ఎక్కడ ఆగిపోయిందో అక్కడే నిలిపివేస్తారు. కాని విమానం చెడిపోతే ఏంటి పరిస్థితి, గాల్లో ఆపలేరు కదా! అదే నా భయం. కాని నాకు జపాన్ కి వెళ్ళే అవకాశం రావడం తో ఎక్కడం తప్పలేదు.
ఒక శుభముహుర్తాన అందరి వీడ్కోలుల తో మొదటిసారి బేగంపేట ఏయిర్ పోర్ట్ లో అడుగుపెట్టా. ఎర్రబస్సులలో తిరిగే మనకు ఒక్కసారే ఏయిర్ పోర్ట్ అంటే అంతా వింతే మరి!!!

లోపలికి వెళ్లగానే అన్నీ రకరకాల విమానాల కౌంటర్లు కనపడ్డాయి. నేను సరాసరి నేను ఎక్కబోయే ’థాయ్ ఏయిర్ వేస్’ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నా టికెట్ చూపెట్టా. వాడు నా లగేజ్ కన్వేయర్ బెల్ట్ మీద పెట్టి ఒక ట్యాగ్ పెట్టి నాకొకటి ఇచ్చాడు. నా బ్యాగ్ బరువు గురించి ఏమైనా గొడవ చేస్తాడు అనుకుంటే అస్సలు ఏమి పట్టించుకోలేదు, అరే ఇంకో 2 కిలోలు తెచ్చుకుంటే అయిపోయేదే అనుకున్నాను. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అందరూ బయపెట్టినట్టుగా నా భుజానికి ఉన్న బ్యాగ్ బరువు చూడలేదు... అయ్యో అనవసరంగా కొన్ని ఇంట్లోనే పడేసానే అనుకున్నాను. ఇంతలో అతను నా బోర్డింగ్ పాస్ ఇచ్చాడు, నాకు వెంటనే నా స్నేహితుడు చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి, బోర్డింగ్ పాస్ తీసుకునేముందే కిటికీ సీట్ అడిగితే ఇస్తాడని. అరే అడగలేదే అని ’విండో సీట్ ఉందా?’ అని అడిగా, మొదటిసారిగా మరి, ఆ మాత్రం ఆతృత తప్పదు. అతను ఒక్కసారి నా వైపు అదోరకంగా చూసి ’ఈ ముక్క ఇచ్చేముందు సెప్పాలా!!’ అని మనసులో అనుకొని ( తిట్టుకొని ) తీసిన టికెట్ చింపేసి, కిటికి దగ్గరి సీట్ ఇచ్చాడు బ్యాంకాక్ వరకు. ’సారీ’ అన్నట్టుగా ఒక పిచ్చి నవ్వు పడేసా. అక్కడ మారే విమానానికి అక్కడే బోర్డింగ్ పాస్ ఇస్తారని చెప్పాడు. ఆ తరువాత ఆ ఫామ్ ఈ ఫామ్ అని రెండు, మూడు నింపి, ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగిన కొన్ని చెత్తప్రశ్నలకి సమాధానం చెప్పి లోపలికి వెళ్ళా.

లోపల ఫ్లైట్ టైం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను. మళ్ళీ ఎప్పటికి తింటానోనని ఒక షాప్ కి వెళ్ళి సమోసా అడిగా, 60 రూపాయలు అన్నాడు, 5 రూపాయల సమోసా 60 రూపాయలా, అంతా స్థలప్రభావం అనుకొని ఒకటి తీసుకున్నాను. ఒక ఫోన్ బూత్ కనపడితే ఇంటికి ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడాను. అక్కడ ఉన్న విమానాల పట్టికల నేను ఎక్కబోయే విమానం వివరాలు తప్ప మిగతా అన్ని ఉన్నాయి. మనకు అసలే కొత్త, అది కనపడక పోయే సరికి కంగారు, గభగభా ఆ ఫోన్ బూత్ వాడి దగ్గరికి వెళ్ళి అడిగా ఏంటి బ్యాంకాక్ వెళ్ళే విమానం పేరు లేదే అని, అతను కంగారు పడకండి సార్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు లేండి అని చెప్పాడు, ఇతనేంటి ఒకటి అడిగితే ఇంకో సమాధానం ఇచ్చాడు, RIN ఎంతా అంటే SURF 10 రూపాయలు అని చెప్పే చుంచు మొహం వీడూనూ అని మనసులో తిట్టుకొని మళ్ళీ ఎదురుచూడటం మొదలు పెట్టా. సమయం దగ్గరపడుతుంటే వెళ్ళి ముందు కూర్చున్నా.

అంతలో ఏయిర్ హోస్టెస్ లు ’థాయ్ ఏయిర్ వేస్’ అని బోర్డ్ పట్టుకొని నిల్చున్నారు. వెంటనే అక్కడ ’Q’ లో నిలబడ్డాను, తరువాత అందరు మన భారతీయ పద్దతిలో గుంపులుగా వచ్చి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కొత్త లైన్లు సృష్టించి మళ్ళీ అందులో వాళ్ళ వాళ్ళని ఇరికించి నానా రభస చేయడం మొదలు పెట్టారు. పాపం నా ముందే నిల్చొని వున్న ఒక పాశ్చాత్యుడు ( ఎక్కడ నుండో తెలియదు కాని ఎర్ర తోలు!!!!) తల పట్టుకొని ’ఏంటి ఇది?’ అనుకుంటూ విసుగ్గా ఎదో గొణిగాడు, నాకు మొదట నవ్వు వచ్చింది, ఇండియా నుండి వెళ్తున్నాడంటే ఈపాటికి మన వాళ్ళ గొప్పతనం గురించి తెలిసే ఉండాలే అనుకున్నాను, మనకైతే ఇది కొత్త కాదు కాని అతని ముందే కొద్దిగా నామోషిగా అనిపించింది. ఎర్రబస్సు అయినా ఏయిర్ బస్ అయినా మన పద్దతిలో పెద్ద తేడాలేదు అని నిరూపించారు.

అలా అందరిని చేధించుకొని విమానంలోకి అడుగుపెట్టా రాత్రి 12 గంటలకి, ఏయిర్ హోస్టెస్లు నవ్వుతూ స్వాగతం చెప్పారు. నాకు లోపలకి అడుగుపెట్టగానే ఒక పెద్ద బస్ లోకి వెళ్ళినట్టుగా అనిపించింది, విమానం లా అనిపించలేదు!!!, నా అంచనాలు ఎక్కువైయ్యాయేమో. ఒక రకమైన వాసన కూడా రావడం మొదలుపెట్టింది, అది అక్కడ వున్న ఆహార పదార్ధాల వల్ల అని తరువాత తెలిసిందనుకోండి. సీట్ ఎక్కడా అని చూస్తే చివరాకరిది నాది, కిటికీ ప్రక్కన కావలనుకుంటే అక్కడ దొరికిందన్నమాట.

పైన నా బ్యాగ్ పెట్టి కూర్చున్నాను. ఏయిర్ హోస్టెస్ లు వచ్చి అందరి బ్యాగ్ లు ఒక పద్దతిలో పెడుతున్నారు, ఒక బ్యాగ్ పెట్టడానికి స్థలం లేకపోయేసరికి అక్కడ ఉన్న పెద్ద బ్యాగ్ ను చూపిస్తూ ’ఇది ఎవరిది?’ అని అడిగారు, నాదే అని చెప్పా. కొద్దిగా మీ బ్యాగ్ మీ సీట్ వెనక పెట్టుకుంటారా అని అడిగితే, మనది విశాల హృదయం కదా సరే అని ఒప్పేసుకున్నాను. నెమ్మదిగా విమానం కదలడం మొదలయ్యింది. ’మనం బయలుదేరబోతున్నాము, మీ ఎలాక్ట్రానిక్ వస్తువులను ఆపేసేయండి’ అని ఎంత చెబుతున్నా నా ప్రక్కన కూర్చున్నతను మాత్రం ఏమి పట్టించుకోకుండా ఫోన్ లో తాపీ గా మాట్లాడుతున్నాడు. అంతలో ఏయిర్ హోస్టెస్లు విమానం విరిగిపోతే ఏం చెయ్యాలి, పెట్రోల్ అయిపోతే ఏం చెయ్యాలి, టైర్ పంక్చర్ అయితే ఏం చెయ్యాలి అని ఒక demonstration ఇచ్చారు, అసలే విమానం అంటే భయం ఉన్న నాకు చిన్నపాటి హాలివుడ్ సినిమా చూపెట్టారు. నేను మాత్రం పారాచ్యూట్ ఎక్కడా అని నా సీట్ కింద పైన మొత్తం వెతికా కాని కనపడలేదు, వాళ్లని అడిగితే బాగుండదని అడగలేదు!!.

తరువాత నడుముకు బంధనాలు వేసుకొని takeoff కి సిద్దమయ్యాను. విమానం ఒక్కసారిగా త్వరణాన్ని పెంచేసి వేగంగా కదులుతూ అలా గాలిలోకి ఎగిరింది. ఆ ఒక్క క్షణం ఒక గమ్మతైన భావన. ’feeling zero gravity for a moment' . అలా పైకి వెళ్లిపోతూ ఉంటే కిటికీలోంచి మన భాగ్యనగర రాత్రి అందాలను చూస్తూ, ధగధగా వెలిగిపోతున్న బుద్దభగవానుణ్ణి చూస్తూ కూర్చున్నాను, 1000 అడుగుల ఎత్తుకు వెళ్ళేసరికి మేఘాలు వచ్చేసాయి, అవి చూడగానే ఆనందానికి అవధులు లేవు. అలా అలా పైకి ఎగిరాక 25000 అడుగులు పైకి వెళ్ళాక, పైలెట్ ’ఇప్పుడు స్థిరంగా వెళ్తాం, పండగ చేసుకోండి’ అని సెలవిచ్చాడు. అందరం తమ తమ బంధనాలు తీసేసుకొని స్వేచ్చాజీవులం అయ్యాము.

మనకు ఏమి తెలియదు కాబట్టి నెమ్మదిగా నా ప్రక్కన కూర్చున్నతనిని గమనించడం మొదలు పెట్టా, ఆయన ఏం చేస్తే అది చూసి ఒక రెండు నిమిషాల తరువాత నేను చేయడం అన్నమాట!!!. ఆయన సీట్ ను వెనక్కు అనుకొని కూర్చున్నాడు, నేనూ ప్రయత్నించా, కాని అస్సలు కదలడం లేదు, ఏంటా అని వెనక్కి చూస్తే నా బ్యాగ్ !!, నేను చేసిన బల ప్రయోగానికి పాపం నన్ను బిక్కు బిక్కు మంటూ చూస్తోంది. మన విశాల హృదయం వల్ల ఇదొక బొక్క అని అప్పుడు తెలిసింది, ఏం చేస్తాం అలాగే నిటారుగా కూర్చున్నాను. పాటలు వినడానికి హెడ్ ఫోన్స్ ఇచ్చారు, ఆ పాటలు వినేసరికి లేని తలనొప్పి వచ్చింది, పక్కన పడేసా, తరువాత వాళ్ళు ఇచ్చిన తిండినంతా తినేసరికి, అన్నీ కలిసి ఒక రకంగా అనిపించడం మొదలైయింది. మధ్య మధ్య లో గతుకుల రోడ్డు మీద వెళ్తే బస్సు ఎగిరినట్టుగా విమానం కూడా తడబడుతోంది, ఇదేంటిరా బాబు ఇక్కడ కూడా ఇది తప్పదా అనుకోవడం, మళ్ళీ అలా జరగగానే భయపడటం ( మొదలే చెప్పాకదా!!! ), మొత్తానికి 3 1/2 గంటల తరువాత బ్యాంకాక్ వచ్చేసాము, అప్పుడప్పుడే తెల్లవారుతుంది, పైనుండి చూస్తే బ్యాంకాక్ చాలా అందంగా, అంతా ఒక పద్దతిలో అమర్చినట్టుగా చాలా బాగుంది. నెమ్మదిగా క్రిందికి దిగుతూ ’సువర్ణభూమి ఏయిర్ పోర్ట్’ (బ్యాంకాక్) కి చేరుకున్నాము.

ఏయిర్ పోర్ట్ కూడా చాలా బాగుంది, మన ఇమ్లిబన్ ని పెద్ద భూతద్దంలో చూసినట్టుగా ఉంది, ఇక్కడ కూడా అన్ని ప్లాట్ ఫామ్స్ ( గేట్స్ ) ఉన్నాయి, కాకాపోతే బస్సుల బదులు ఏయిర్ బస్సులు నిల్చొని వున్నాయి. వాటికి తగ్గట్టే స్థలం కూడా అంత పెద్దగా ఉంది. అక్కడ విమానం మారే కౌంటర్ కు దారి అని చూపెడుతుంటే అది చూసుకుంటూ వెళ్ళా, అలా ఒక 4,5 కిలోమీటర్లు నడిచాక అప్పుడు కౌంటర్ కనపడింది, హమ్మయ్య అనుకొని నరీటా ఏయిర్ పోర్ట్( టోక్యో ) కి బోర్డింగ్ పాస్ తీసుకున్నాను, ఈ సారి మాత్రం కిటికీ దగ్గర సీట్ దొరకలేదు. మళ్ళీ అక్కడ నుండి విమానం ఎక్కవలసిన గేట్ దగ్గరికి ఒక 4,5 కిలోమీటర్లు నడిచి, అక్కడ ఎదురుచూస్తూ కూర్చున్నాను.

ఈ సారి ఎక్కిన విమానం కొద్దిగా పెద్దదిగా ఉంది, బ్యాగ్ మాత్రం పైనే పెట్టాను. నా ప్రక్కన దాదాపు నా అంత వయసున్న దక్షిణ భారతీయుడు కూర్చుంన్నాడు. పేరు సెంథిల్ అని చెప్పాడు. ఓహ్ తమిళ్ తంభి అనుకున్నాను. మొదటిసారి వస్తున్నాడట, పాపం చాలా భయపడుతున్నాడు, నేను మాత్రం గంభీరంగా కూర్చున్నాను, ఏదో అన్ని తెలిసిన వాడిలా !!!. మాటల్లో అతను ఇండియా అని వాడాల్సిన చోట్లల్లా తమిళ్ నాడు అని, భారతీయ భాషలు అని వాడాల్సిన చోట్లల్లా తమిళ్ అని మాట్లాడటం, మళ్ళీ నాలుక కరుచుకోవడం. అలా ఏదో మాట్లాడితూ కూర్చున్నాము.

మరీ ప్రొద్దున్నే అయ్యేసరికి ప్రయాణం కొద్దిగా చిరాగ్గా అనిపించింది. శాఖాహారం అంటే మరీ పచ్చి కూరగాయలు, ఎండిపోయిన బ్రెడ్ ఇచ్చాడు. ఛీ! పాడు జీవితం అనుకొని ఏమి తినలేదు. ఈ సారి విమానం దాదాపు 40,000 అడుగుల ఎత్తులో ప్రయాణించింది. ఒక 5 1/2 గంటల తరువాత నరీటా ఏయిర్ పోర్ట్ లో దిగబోతున్నాము బంధనాలు వేసుకోండి అని అనగానే వేసేసుకున్నాము. విమానం వాలు గా వంగుతూ క్రిందికి దిగుతోంది, అంతలో నా బ్యాగ్ పెట్టిన క్యాబిన్ తలుపు తెరుచుకుంది, అయ్యో బ్యాగ్ క్రింద పడితే ఎలా అసలే చాలా బరువు గా ఉంది అని జేమ్స్ బాండ్ లెవిల్లో బంధనాలు తీసుకొని నిలబడ్డాను, అందరూ నన్నే చూస్తున్నారు!!, వాలు గా ఉండే సరికి నెమ్మదిగా బ్యాలెన్స్ చేస్తూ ఆ తలుపు పెట్టేసి మళ్ళీ బంధనాలు తగిలించుకున్నాను.

మొత్తానికి నరీటా ఏయిర్ పోర్ట్ లో దిగాము. అక్కడ కూడా 2,3 ఫామ్స్ నింపి, లగేజ్ తీసుకుని కస్టమ్స్ దగ్గరికి వెళ్ళా, సినిమాల్లో చూపెట్టినట్టుగా ( ముఖ్యంగా ’జీన్స్’ లో చూపెట్టినట్టుగా) మన బ్యాగ్ తీసి ఇదేంటి, ఇదేంటి అని అడిగితే భాషకాని భాషలో ఎలా రా బాబు అని ఊహించుకుంటూ ఉంటే, అక్కడ అలాంటిది ఏమి జరగలేదు, ఒక ఫామ్ తీసుకొని పంపించేసాడు. అలా ఏయిర్ పోర్ట్ బయట పడ్డాను. నాకు నేను జపాన్ కి స్వాగతం అని చెప్పుకున్నాను, ఎందుకంటే ఏయిర్ పోర్ట్ కి నాకోసం ఎవరూ రాలేదు కాబట్టి. తరువాత జరిగిన విశేషాలు వచ్చే టపాలో !!!.

ఇస్పెషల్  

Posted by ప్రపుల్ల చంద్ర in ,

ఈ మధ్య క్రాంతి గారు వ్రాసిన ’ఉప్మాపురాణం’ కి పూర్ణిమ గారు వ్యాఖ్య వ్రాస్తూ తను మొదటిసారి చేసిన ఉప్మా గురించి వ్రాస్తా అన్నారు, అది చూడగానే మనకు ఇలాంటి ఒక అనుభవమున్నట్టున్నదే అని ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచన గాలులకి నా జ్ఞాపకాల పుటలు అలజడి చేస్తూ ఒక పేజి దగ్గర ఆగిపోయాయి.

ఒక వేసవి మధ్యాహ్నం, చాలా ఎండలు ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళలేము, సాయంత్రం అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇంట్లో అందరు పడుకున్నారు, కాని నాకు మధ్యాహ్నాలు పడుకునే అలవాటు లేదు. అప్పట్లో కాస్త చిత్రలేఖనం (drawing) మీద ఆసక్తి ఉండేది, అంటే మిక్కీమౌస్, డొనాల్డ్ డక్ లాంటి కార్టూన్లు గీసేవాడిని.

ఆ రోజు ఏదో దొరికిన కార్టూన్ వేస్తూ కూర్చున్నాను. అంతలో ఎన్టోరు గొంతుతో ఒక కేక వినపడింది,
’బ్రధర్’ అని. చుట్టూ చూస్తే ఎవరు లేరు.
నేను ’ఎవరు?’ అని అడిగా.
’బ్రధర్... నన్ను గుర్తుపట్టలేదా?....... నీ ఆత్మారాముడిని’.
’ఓహ్ నువ్వా’ అన్నాను నేను.
’ఏం.... చేస్తున్నావు?’ అని అడిగాడు.
’ఏముంది బొమ్మ గీస్తున్నాను’,
’తమ్ముడూ... ఇంకా ఎన్ని రోజులు ఇలా ఎలుకల బొమ్మలు, బాతుల బొమ్మలు గీస్తావు’ అన్నాడు.
నేను ’మరి ఎవరి బొమ్మ గీయాలి’ అని అడిగా.
’నేను మొదటినుండి చెబుతున్నా కదా.. మనకు ఆత్మ గౌరవం ముఖ్యం అని’,
వెంటనే నేను ’అయితే నీ బొమ్మ గీయాలా అన్నాను’,
వెంటనే ఆత్మారాముడు చిరాకు పడి, గొంతు మార్చి ’చూపులు కలసిన శుభవేళ’ సినిమాలో కోట శ్రీనివాసరావు లా మాట్లాడటం మొదలుపెట్టాడు. ’కనపడని ఆత్మ బొమ్మ ఎలా గీస్తారట... తమరి ముఖము, మనకు అదియును తెలియదు..... మొదలు తమరి ముఖారవిందాన్ని బాగుగా గీయుడు’ అని చెప్పి వెళ్ళిపొయాడు.

నాకు అనిపించింది, నిజమే కదా ఎన్ని రోజులు ఆ బొమ్మలు వేస్తామని. సరే నా బొమ్మే గీద్దామనుకున్నాను. మరీ అద్దం ముందు కూర్చొని బొమ్మ గీస్తే పిచ్చి పట్టిందని మా వాళ్ళు డిసైడ్ అయిపోతారని, ఫోటో అయితే గీయడానికి కూడా సుళువు గా ఉంటుందని ఒక బ్లాక్ & వైట్ ఫోటో ముందు వేసుకొని కూర్చున్నాను.

ఒక అరగంట కుస్తీ పడ్డ తరువాత చూస్తే ఆ బొమ్మ సూపర్ సినిమాలో అలీ గీసిన బ్రహ్మానందం బొమ్మలా వచ్చింది. ఇది ఏంటి నా బొమ్మ గీస్తే ఎవడిదో వచ్చింది, ఛీ ! నా బొమ్మ కూడా గీయడం రాకపోతే ఈ కళ నాకెందుకు..... అని ఆ రోజే త్యజించా మళ్ళీ ఇప్పటి వరకు ప్రయత్నించలేదు!!!.

సమయం చూస్తే ఇంకా మూడు కావొస్తోంది. నాకు మాత్రం చాలా బోర్ గా ఉంది. మా ఇంట్లో అంతా మంచి నిద్రలో ఉన్నారు. సమయాన్నిచంపడానికి (time killing... అన్నమాట) ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది, మా వాళ్ళు నిద్రలేచే లోపు ఏదైనా ఇస్పెషల్ చేసి వాళ్ళని ఆశ్చర్యచకితులను (surprise) చేద్దామనుకున్నాను. కాని ఏం చెయ్యాలి, అని మళ్ళీ ఆలోచన...... సరే ఏమైనా వంటకం చేద్దామనుకున్నాను. కాని మనకు అసలు ఏమీ రాదే, బాగా చించీ చించీ ’ఉప్మా’ చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చా. మనకు ఉప్మా అంటే చాలా ఇష్టం, ఎప్పుడూ ’అమ్మా ఆకలి’ అంటూ అమ్మ చుట్టూ తిరుగుతూ చూడటమే తప్ప ఎలా చేయాలో తెలియదు.

ఎలా చెయ్యాలో నేనే ఒకసారి మనసులో ఊహించేసుకొని, నెమ్మదిగా చప్పుడు కాకుండా వంటింట్లోకి దూరాను. ఉల్లిపాయ తరిగి పక్కన పెట్టాను. కొద్దిగా శబ్దం అయినా మా వాళ్ళు లేస్తే నా ప్లాన్ తలక్రిందులౌతుందని అన్ని పనులు నెమ్మదిగా చేస్తున్నాను. బాణాలి స్టవ్ మీద పెట్టి ఆన్ చేసాను. కొద్ది సేపటి తరువాత నూనె పోసాను అందులో. బాగా వేడి అయిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు గింజలు వెయ్యాలని అన్నీ సిద్దం చేసుకున్నాను, తరువాత నీళ్ళు పోసి, ఉప్పు వేసి, బాగా వేడి అయిన తరువాత రవ్వ వేసి కొంత సేపు ఉంచితే ’ఉప్మా’ రెడీ, ఇక మావాళ్ళు ఆహా అంటూ తింటారు అని మనసులో ఒక అంతరిక్షయానం చేసి భూమి మీద ల్యాండ్ అవ్వగానే, చూస్తే బాణాలిలో అప్పటికే నూనె బాగా వేడి అయ్యింది. ఓహ్ అప్పుడే అయ్యిందా అని, మిర్చి, పోపు గింజలు వేసాను, వెయ్యగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి, దట్టంగా పొగలు వచ్చాయి, ఒక సెకనులో అన్నీ మాడిపోయాయి. ఆ గోలకి అందరు ఉలిక్కిపడిలేచి పరుగెత్తుకుంటూ వంటింట్లోకి వచ్చారు. అక్కడ నా చేతిలో గరిట, చుట్టూ పొగ, దొరికిపోయిన దొంగ లా నా పరిస్థితి, నా నోటి నుండి మాటరాలేదు. అమ్మ ’ఏమైంది రా’ అంది గాభరాగా. నేను ’అంటే..... మీరు లేచేలోపు.... ఉప్మా చేద్దామనుకున్నాను’, మంచి నిద్ర నుండి లేచేసరికి చిరాకులో ఉన్నా ఏమి అనలేక ’నన్నడిగితే చేసేదాన్ని కదా’ అంది. నేనేమి చెప్పలేదు. అలా నా ఉప్మా ప్రయత్నం పూర్తవ్వకుండానే ఆగిపోయింది.

నా ఉప్మా కథ తెలుగు సినిమాలా సుఖాంతం అవుతుందనుకున్నాను ( అంటే ఉప్మా అందరు తిని బాగుంటుందని చెబుతారని ) లేకపోతే కనీసం తమిళ్ సినిమాలా దుఃఖం తో ముగుస్తుందని అనుకున్నాను ( అంటే ఉప్మా సరిగ్గా కుదరక ఎవరికి నచ్చదని, అయ్యో కుదరలేదే అని భాదపడతానని), కాని రెండూ జరగకుండా ఇంగ్లిష్ సినిమాలా ఏ అంతమూ లేకుండా ముగిసింది. తరువాత అమ్మ చేసిపెడితే లొట్టలేసుకుంటూ లాగించాననుకోండి అది వేరే విషయం.

तूतो ’మరీ’ है  

Posted by ప్రపుల్ల చంద్ర in ,

ఏంటీ టపా పేరు వింతగా అనిపిస్తోందా !! చివర్లో మీకే తెలుస్తుంది లేండి. మన బ్లాగర్లు హిందీ తో వాళ్ళ అనుభవాలు చెబుతూంటే నాకు హిందీ వల్ల కలిగిన కితకితలు గుర్తుకువచ్చాయి, ఆ కితకితలే ఈ టపా. హిందీ మన మాతృభాష కాదు కాబట్టి అప్పుడప్పుడు తంటాలు తప్పవు.

నా చిన్నతనంలో ఒకసారి మేము షిరిడి వెళ్ళాము. అక్కడ చాలా మంది హిందీ లో మాట్లాడుతూ కనపడ్డారు. అప్పటికే టీవీలో మహాభారత్, సర్కస్ లాంటివి చూస్తున్నాను కాబట్టి కొద్ది కొద్ది గా పదాలు తెలుసు... వాటి అర్థం తెలియకపోయినా !!!!.
ఏదో బొమ్మ కొనాలని నేను మా నాన్నతో కలిసి వెళ్ళాను. ఒక షాప్ దగ్గర మా నాన్న గారు బేరం చేస్తూంటే విన్నాను.
నాన్న - ’यॆ कित्ना है’
షాపువాడు - ’पन्द्रहा रुपय्या’
నాన్న - ’दस कॊ दॆतॆहॊ क्या’
షాపువాడు - ’नही आता है सर’

బేరం కుదరక అది కొనలేదు. నాన్నని అడిగి తెలుసుకున్నాను వాళ్ళు మాట్లాడిన మాటలకి అర్థం. ఇంకా ఏముంది నేర్చుకున్న వాటిని ప్రయోగించాలి కదా మరి. సరే నేను కూడా మాట్లాడాలి అనుకున్నాను నోరు మరీ దురదగా ఉంటే. మా వాళ్ళు చుట్టుప్రక్కల లేనిది చూసి ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను.
ఒక వస్తువు చూపిస్తూ అడిగా...

నేను - ’यॆ कित्ना है’
షాపువాడు - ’पांच रुपय्या’
నేను - ’दस कॊ दॆतॆहॊ क्या’ (మనకు అది ఒక్కటే తెలుసుకదా మరి)
షాపువాడు - !!!!!!!!!!!! ( ఆవక్కయ్యాడు )

షాపువాడు నన్ను ఎగాదిగా చూసాడు, వీడు అస్సలు కొనే రకమేనా అని. కాని నేను అంతగా పట్టించుకోలేదు, నా మనసు వెంటనే ’భేష్ బాగా మాట్లాడావు’ అని భుజం తట్టింది. అమెరికా వాళ్ళు, వాళ్ళు తయారుచేసిన ఆయుధాలు పరిక్షించుకోవడానికి, కారణాలు లేకుండా వేరే దేశాల మీద యుద్దం చేసినట్టు నేను కూడా నన్ను నేను పరిక్షించుకోవడానికి వెళ్ళా కాని నిజంగా కొంటామా ఏంటి. అనుకున్న పని అయిపోయిందని అక్కడ నుండి కదిలా. తరువాత వెళ్ళి మా వాళ్ళని ’पांच रुपय्या’ అంటే ఎంతో తెలుసుకున్నాను, అప్పుడు తెలిసింది వాడు ఎందుకు అలా చూసాడో.

తరువాత దూరదర్శన్ పుణ్యమా అని ’స్టోన్ బాయ్’, ’జంగిల్ బుక్’, ’అలిఫ్ లైలా’, ’డక్ టేల్స్’, ’మంగళ, గురు వారాలు రాత్రులు, శని వారం సాయంత్రం వచ్చే హిందీ సినిమాలు’ చూసి ఏదో కొద్దో గొప్పో హిందీ నేర్చుకున్నాను. కాని నాకు హిందీలో సంఖ్యలు మాత్రం అస్సలు నచ్చలేదు, మొదట్లో నేర్చుకోడానికి ప్రయత్నించా కాని 20 వరకు మాత్రమే వచ్చాయి, తరువాతవి కొన్ని గుర్తున్నాయి, ఇప్పటికీ 64, 87 లాంటివి ఎంతా అంటే ప్రశ్నార్ధకమే.


ఒకసారి మా ఇంట్లో అందరం కబుర్లు చెప్పుకుంటూ ఉంటే హిందీ గురించి ఏదో విషయం వచ్చింది. ఎవరో మా అక్కని ’నీకు హిందీ వచ్చా?’ అని అడిగారు. అక్క వచ్చు అంది. వెంటనే మా తమ్ముడు ఎంత వచ్చో తెలుసుకోవాలనుకున్నాడు. కాని ఆ తొందరలో అసలు విషయం మరిచిపోయాడు... వాడికీ అంతంత మాత్రమే వచ్చని. వాడికి అప్పుడు గుర్తుకువచ్చి అడిగిన ప్రశ్న ’तुम्हारा नाम क्या है?’, అది వినగానే అందరం గొల్లుమని నవ్వాము ఎంత కష్టమైన ప్రశ్న అడిగాడని. అది కూడా తెలియని వారు ఉండరేమో !!.


నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మా కాలేజ్ సెక్యూరిటీ గార్డ్ బీహార్ అతను. నేను మా స్నేహితులతో కలిసి బస్సు కోసం ఎదురుచూస్తూ ఒక చోట నిలబడి ఉంటే అతను వచ్చి హిందీ లో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏదో విషయం పై చర్చ మొదలైంది... అందరం వచ్చీ రాని హిందీలో ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నాము. చర్చ కాబట్టి చెప్పదల్చుకున్నది తొందరగా చెప్పెయ్యాలి, లేకపోతే వేరేవాళ్లు మనకు అవకాశం ఇవ్వరు గనుక. తిప్పలు పడుతూ మరీ మా ప్రతిభను చాటుతున్నాము. నేను ఏదో చెప్పాను (ఏం చెప్పానో గుర్తు లేదు). అప్పుడు నా స్నేహితుడు ’तूतॊ मरी है’ అన్నాడు. నా బుర్రలో ఉన్న హిందీ decoder ఒక్కసారిగా ఖంగుతింది, దానికి ఏమి అర్ఠం అవ్వలేదు, semantics error ఇచ్చింది. తొలిగించిన ఫలితాలు చూపెట్టాలా అంది. అది చూస్తే ’నువ్వు చచ్చావు’ లాంటి అర్ఠం ఇచ్చింది. కాని అది మేము మాట్లాడే విషయానికి సంబంధం లేదు. అంతలో తెలుగు decoder, 1 match found అంది. ఇది ఏంటి హిందీ లో మాట్లాడుతుంటే తెలుగు decoder కు ఎలా తెలిసిందని, ఆ పదం ఏంటా అని చూస్తే అది ’మరీ’. ఆ తెలుగు పదం తో ఏమయుండొచ్చు అని అలోచిస్తే, నేను అన్న మాటలకి, ’నువ్వు మరీనూ’, ’నువ్వు మరీ రా’ అనే అవకాశం ఉంది తెలుగులో అయితే.

అప్పుడు అర్థం అయ్యింది, వాడు తెలుగు నుండి హిందీ కి మార్చే క్రమంలో సగం మాత్రమే నిజానువాదం చేసాడు, తొందరలో ’మరీ’ కి ఏమనాలో గుర్తు రాక అలాగే వాడేసాడు "तूतॊ ’మరీ’ है " అని. అలా ఒక సెకను తరువాత అర్థం. అవ్వగానే నాకు నవ్వు ఆగలేదు... ఇప్పటికీ గుర్తుతెచ్చుకొని నవ్వుకుంటాము.

ఇంకా నయం అతను నాతో అన్నాడు కాబట్టి సరిపోయింది, ఆ బీహార్ అతనితో అని ఉంటే ఆయన నువ్వు చచ్చావనో ఇంకా ఏదో అన్నాడనో అనుకొని ఫీల్ అయ్యేవాడేమో. ఇవండీ నా హిందీ కబుర్లు.

మొదటి టపా  

Posted by ప్రపుల్ల చంద్ర

" Hello world "
ఏంటో, అంతకు ముందు ఏ పని మొదలుపెట్టినా ’శ్రీరామ’ అనో ’ఓం’ అనో రాసి మొదలుపెట్టేవాడిని. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం లో చేరినప్పటి నుండి ఏది మొదలుపెడదామన్నా మొదట "Hello world" వ్రాయడం అలవాటైపోయింది. ఏ కొత్త కంప్యూటర్ భాష నేర్చుకుందామన్నా మొదట ఇదే నేర్పుతారు కదా మరి.
చాలా రోజుల నుండి కూడలి లో బ్లాగ్స్ చదువుతున్నాను. సరే నేను కూడా ఒకటి మొదలుపెడితే బాగుంటుంది అనుకున్నాను, కాని ఎప్పుడు ఏవో పనుల వల్ల వాయిదా వేస్తూ వస్తున్నాను. ఏదో ఒకరోజు మొదలుపెడుదామనుకున్నా కూడలి లో బ్లాగ్స్ చదివాక ఇంత మంచిగా మనం వ్రాయగలమా అని ప్రయత్నాన్ని విరమించేవాడిని. ఇలా అయితే లాభం లేదు, మొదలు రంగం లోకి దూకుదాం తరువాత సంగతి తరువాత చూసుకోవచ్చు అని ఇలా మొదలు పెడుతున్నాన్న మాట. వ్రాయడం మొదలు పెడితేనే కదా తెలిసేది వ్రాయగలమో లేదో అని !!!.
వృత్తిపరంగా ఒక సంవత్సరంగా జపాన్ లో ఉంటుంన్నాను. ఇక్కడి విశేషాలు, అలాగే నా స్వగతాలు ఈ బ్లాగ్ లో వ్రాద్దామనుకుంటుంన్నాను. ఇక మొదలుపెడుతున్నాను నా బ్లాగ్ ప్రస్థానం.