జపాన్ విశేషాలు - 1  

Posted by ప్రపుల్ల చంద్ర in



జపాన్ ను జపనీయులు ’నిహాన్’ లేదా ’నిప్పాన్’ అని పిలుస్తారు. మనము ఇండియాని ’భారతదేశం’ అని పిలిచినట్టుగా !!. నిప్పాన్ అని అధికారికంగా ఉపయోగిస్తారు, నిహాన్ అని వాడుక భాషలో ఉపయోగిస్తారు. నిహాన్/నిప్పాన్ అంటే ’సూర్యుడికి మూలమైనది’ అంటే ’సూర్యుడు ఉదయించే దేశం’ అని అర్ధం. జపాన్ జాతీయపతాకం కూడా ఎరుపు రంగులో ఉండే ఉదయించే సూర్యుడే.

జపాన్ దాదాపు 3,000 ద్వీపాల సమూహం. అందులో నాలుగు ద్వీపాలు చాలా పెద్దవి. దాదాపు 70% పర్వతాలతో నిండి ఉంది. జపాన్ 4 భూమి పలకల ( earth plates ) కూడలిలో ఉండే సరికి ఇక్కడ భూకంపాలు చాలా ఎక్కువ. వీటి కారణంగా అగ్నిపర్వతాలు కూడా ఎక్కువగానే వున్నాయి. జపాన్ లో పెద్దదైన ఫుజి మహాపర్వతం కూడా ఒక అగ్నిపర్వతమే. చెప్పాలంటే రోజూ ఎదో ఒక ప్రాంతంలో వస్తూనే ఉంటుంది, సంవత్సరానికి దాదాపు 1500 భూకంపాలు నమోదు అవుతాయి. ఇక్కడ ఇళ్లు కూడా చెక్కలతోనే కడతారు (పెద్ద పెద్ద భవనాలు తప్ప). భూకంపం రెక్టర్ స్కేల్ పై 6-7 వరకు వచ్చినా తట్టుకునే విధంగా ఈ ఇళ్లు ఉంటాయి. చిన్న చిన్న భూకంపాలు రావడం ఒకవిధంగా మంచిదే, ఒక్కసారే పెద్దది వస్తే కష్టం కదా మరి !!!

జపాన్, 13 కోట్ల జనాభాతో ప్రపంచంలో పదవస్థానంలో ఉంది. కాకాపోతే ఇప్పుడు ఇక్కడ చాలా మంది పెళ్ళిళ్లు, పిల్లల మీద ఇష్టత చూపెట్టడం లేదు. అందువల్ల జనాభా తగ్గిపోతోంది. ఇక్కడి ప్రజల సరాసరి జీవితకాలం 82 సంవత్సరాలు. అయ్యేసరికి యువకుల సంఖ్యకన్న ముసలివాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఒకసారి మాటల్లో నాకు తెలిసిందేంటంటే, ఇక్కడ ముసలి వాళ్ళకోసం బడ్జెట్ లో చాలా భాగం కేటాయిస్తారట. వారి సంఖ్యపెరిగే సరికి యువకులపై పన్ను భారం చాలా పడుతోంది. ఈ విషయం గురించి మా బాస్ ఇలా చెప్పారు "నేను పన్ను ఎక్కువ కడుతున్నా అని ఎప్పుడూ భాదపడను, ఎందుకంటే వాళ్ళే జపాన్ ని నిర్మించారు, రెండో ప్రపంచ యుద్దంలో దాదాపు నాశనమైన జపాన్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉందంటే వాళ్ళే కారణం, వాళ్ళని చూసుకోవడం మా భాద్యత." నిజమే వాళ్ళని ఎంత పొగిడినా తక్కువే !!!. రెండో ప్రపంచ యుద్దంలో దాదాపు 70 నగరాలు నాశనమైయ్యాయి. ఆ యుద్దంలో ఓడిపోయిన తరువాత వీరికంటూ ప్రత్యేకంగా సైన్యం లేదు, జపాన్ రక్షణ అమెరికానే చూసుకుంటోంది. జపాన్ చుట్టూ అమెరికా వాళ్ళ యుద్దనౌకలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వీళ్లకంటూ ఒక సైన్యం ఉండాలని ఆలోచిస్తున్నారు.

ఒకప్పుడు సైన్యంలో బలంగా ఉన్నవారు ఇప్పుడు ఆర్ధికంగా చాలా బలంగా ఉన్నారు. అక్షరాస్యత కూడా 99 %. ఇన్ని పర్వతాలు ఉన్నా, యుద్దంలో అంత నష్టపోయినా, ఎప్పుడూ భూకంపాలు వస్తున్నా, అన్నింటిని అధిగమించి ఆర్ధిక రంగంలో మొదటి మూడు స్థానాలలో స్థానం సంపాదించారు. ఒక్క యెన్ ఇప్పుడు దాదాపు 40 పైసలు. ( మరీ 40 పైసలే అనుకోకండి, వీళ్ళ కరెన్సీ అలా ఉంది అంతే !!, మన దగ్గర లాగా రూపాయలు/పైసలు ( డాలర్/ సెంట్ , పౌండ్/పెన్ని) అని వేరు గా కాకుండా ఒక్క యెన్ మాత్రమే ఉంది, కాబట్టి అంత తక్కువ నుండి మొదలవుతుంది !! ).

జపాన్ అంటే ముందుగా ఎలక్ట్రానిక్స్, రోబోట్స్, ఆటో మొబైల్ కంపెనీలు గుర్తుకు వస్తాయి. క్రింద ఉన్న జపాన్ కంపనీల పేర్లు చూడండి, అవి చూస్తే ఈ దేశం ఇంత అభివృద్ది చెందిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా.

ప్రధాన ఎలక్ట్రానిక్ కంపెనీలు :
Sony, Canon, Casio, Hitachi, Toshiba, Panasonic/National, Fujitsu, Sharp, NEC, TDK, JVC, Roland, Fujifilm, Pioneer, Kyocera, Mitsubishi, Nikon, Yamaha, Citizen Watch, Pentax, Olympus, Nintendo, Sanyo, Epson, Sansui, Akai, Sega, Konica Minolta, Maxell, Kenwood, Seiko.

ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు :
Toyota, Honda, Nissan, Suzuki, Yamaha, Kawasaki, Mitsubishi, Isuzu, Mazda.

ఇంకా మరిన్ని జపాన్ విశేషాలు వచ్చే టపాలో.

This entry was posted on Thursday, August 21, 2008 at 7:30 AM and is filed under . You can follow any responses to this entry through the comments feed .

5 comments

మీరు కూతంత ఇస్పీడుగా రాయాలి,ఇక్కడ టెన్షను,ఎదురుచూపులూ ఎక్కువుతున్నాయ్ :)

August 22, 2008 at 4:10 AM

జపాన్ లో తయారయే electronic వస్తువులు జపాన్ కంటే హాంగ్‌కాంగ్ లో చవక అని విన్నా. నిజమేనా? ఇది ఎలా సాధ్యం?

August 22, 2008 at 7:19 AM

i agree with mr.rajendra kumar.

August 22, 2008 at 11:12 AM

చాలా బాగున్నాయి విశేషాలు ఈ సారి కూడా...
వారి సాంకేతిక ప్రగతి, పట్టుదల మీద నాకెంతో గౌరవం.

మీకు వీలుంటే వారి సాంప్రదాయాలు, కట్టుబాట్ల గురించి కూడా రాయగలరు.
ఫోటోలు పెడితే ఇంకా మంచిది :-)

August 22, 2008 at 11:20 AM

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి, @sujata
తప్పకుండానండి, ఇప్పటి నుండి త్వరత్వరగా వ్రాస్తాను.

@cbrao,
అవునండి, జపాన్ కంపెనీల వస్తువులు చాలా దేశాలలో జపాన్ కన్న చవకగా దొరుకుతాయి. ఇక్కడ పన్నులు ఎక్కువ, ప్రభుత్వం ఇచ్చే రాయితి తక్కువ అనుకుంటాను, చాలా జపాన్ కంపెనీలు, వాళ్ళ ’manufacturing fecilities' చైనా లో పెట్టారు అది కూడా ఒక కారణం ఏమో మరి హాంకాంగ్ లో చవకగా దొరకడానికి ! ఎందుకబ్బా అని నేను నెట్ లో వెతికితే హాంగ్ కాంగ్ లో సబ్సిడి ఎక్కువ ఇస్తారని ఉంది!!!

@ప్రవీణ్ గార్లపాటి,
నెనర్లు, అన్నింటి గురించి టపాలు వ్రాస్తాను.

August 23, 2008 at 6:57 AM

Post a Comment