21 జనవరి 2007, ఆదివారం, వారాంతం కాబట్టి ఆ రోజు తెల్లవారుజామున 11 గంటలకే లేచాము. ఏదో కొనాలని యం.జి.రోడ్ కి వెళ్దామనుకున్నాము. బద్దకం విదిల్చుకొని తొందరగా వంట చేసుకొని నేను నా ఫ్రెండ్ సందీప్ బయటపడ్డాము. మన అభిమాన బెం.మ.సా.సం (BMTC) ఎక్కి రెండు యం.జి.రోడ్ కి టికెట్ తీసుకున్నాము. రోడ్ మీద అన్ని కాషాయం జెండాలు ఉన్నాయి. ఆర్.ఎస్.ఎస్ వాళ్లవి ఏవో సమావేశాలు ఉన్నాయనుకున్నాము. ఎప్పుడూ సందడిగా ఉండే అలసూర్ లో అంతా నిర్మానుష్యంగా ఉంది, ఇదేంటి ఇలా ఎప్పుడు లేదే, ఆదివారం మధ్యాహ్నాం అయ్యేసరికి అలా ఉందేమో అనుకుంటుండగా రోడ్డు మీద కొందరు పోలీస్ లు నిలబడి వేరే రూట్ లో బస్సు ను పంపిస్తున్నారు, అక్కడే ఆ సమావేశం జరుగుతుందని మేమే ఒక నిర్ధారణకు వచ్చాము.
బస్సు అలసూరు చెఱువు చుట్టూ తిప్పుతూ ట్రినిటి సర్కిల్ వైపు వెళ్తోంది. ఒకచోట బస్సు ఆగిపోయింది, బెంగళూరు వాసిని గనక ట్రాఫిక్ జామ్ లు కొత్తకాదు, అసలే అన్ని బస్సు లు దారి మరలిస్తున్నారు కాబట్టి ఎప్పటికి యం.జి.రోడ్ కి వెళ్తామా అని కూర్చున్నాము. ఏదో గోల వినబడటం మొదలయ్యింది. మా బస్సు లో వాళ్లు కూడా దిగి ఏదో చూస్తున్నారు. సరే మనమూ చూద్దామని కిందికి దిగాము, కాని ఏమి కనపడటం లేదు, చాలామంది వెనక్కి వస్తున్నారు. పెద్ద ట్రాఫిక్ జామ్ ఏమో అలా వెళ్లడం కష్టం అని జనాలు వస్తున్నారేమో అనుకున్నాము. కాని ఏదో పగలగొడుతున్న శబ్దం, నెమ్మదిగా ఆ శబ్దాలు పెద్దగా వినపడుతున్నాయి. మేము కొద్దిగా ముందుకు వెళ్లి చూస్తే కాషాయం జెండాలు పట్టుకొని కొందరు రాళ్లతో ఒక్కొక్క బస్సు అద్దాలు పగులగొడుతూవస్తున్నారు. మా బస్సు అద్దాలు కూడా పగులగొట్టారు. ఏవో చిన్నచిన్న గొడవలు చూడటం తప్ప ప్రత్యక్షంగా ఇలా చూడటం అదే మొదటిసారి. ఇదేం మాయరోగం వీళ్లకి, వాళ్ల సమావేశం వాళ్లు చూసుకోక ఇదేంటి అనుకొని అక్కడే ఉంటే మా మీదికి రాళ్లు విసురుతారేమోనని మేము వెనక్కి వెళ్లాం.
అక్కడ నుండి శివాజినగర్ మీదుగా మెజిస్టిక్ వెళ్లే బస్సులు కనపడ్డాయి, సరేలే ఎలాగు బస్సులు వెళ్తున్నాయి కదా అని ఒక బస్సు ఎక్కాము. మాకు ఏమి తెలుసు పద్మవ్యూహం లోకి అడుగుపెడుతున్నాము అని. బస్సు ఎక్కగానే రెండు టికెట్లు మెజిస్టిక్ కి తీసుకున్నాము. కండక్టర్ డ్రైవర్ తో 'ఎక్కడ ఆపకుండా వెళ్లు' అని చెబుతున్నాడు. అక్కడ గొడవ అవుతుంటే ఈయన ఇక్కడ ఎందుకు కంగారు పడుతున్నాడో అర్ఠం అవ్వలేదు. కాని అక్కడ మాత్రం అంతా కోలాహలంగా ఉంది. అందరూ ఉరుకుల పరుగుల మీద ఉన్నారు.
అలా వెళ్తూంటే, ఒక సందు చివర చాలా మంది గుంపుగా కనపడ్డారు, కొందరు ముస్లింలు, అందరు ఏదో యుద్దానికి సన్నద్దమవుతున్నట్టుగా కనపడ్డారు. చేతుల్లోకి ఇనుపరాడ్లు, సోడా సీసా లు తీసుకొని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా బస్సు కండక్టర్ ’స్పీడ్ గా వెళ్లు, ఆపకు’ అని పురమాయిస్తున్నాడు. మాకు గుండెల్లో దడ మొదలయ్యింది. వాళ్లు మా వైపే వస్తున్నారు. అయ్యో ఎరక్క పోయి వచ్చి ఇరుక్కు పోయాము అని భాధ, భయం రెండు ఒక్కసారిగా కలిగాయి. ఎప్పుడు మా బస్సు మీద దాడి చేస్తారో అని బిక్కు బిక్కు మంటూ ఉన్నాము, వాళ్లు అందరూ పరుగెత్తుకుంటూ మా బస్సు వైపు వచ్చారు. ఇక అయిపోయాము అనుకున్నాము. కాని అదృష్టవశాత్తు మా బస్సుని దాటి వెళ్లారు. చూస్తే మా వెనక వస్తున్న వాహనం మీద దాడికి దిగారు, అందులో అంతా ఆర్.ఎస్.ఎస్ వాళ్లు ఉన్నారు. అప్పుడర్థమయింది అక్కడ హిందు ముస్లిం ల గొడవ జరుగుతుందని. ఆ వాహనం నుండి వాళ్లు కిందికి దిగి బిగ్గరగా అరుస్తూ కొట్టుకోవడం మొదలు పెట్టారు.
రోడ్డుమీద అంతా అంతకు ముందు జరిగిన గొడవ దాఖలాలు కనపడతున్నాయి. కుడివైపు వున్న రోడ్డు మీద కాలుతున్న బస్సు, తరువాత రోడ్లో అద్దాలు పగిలిన బస్సులు, కార్లు, కాలుతున్న టైర్లు, చిందరవందరగా చెప్పులు, కర్రలు, రాళ్ళు, చినిగిపోయిన చొక్కాలు, అక్కడ అక్కడ రక్తపు మరకలు కనపడ్డాయి. మాకు కొంత సేపు మణిరత్నం సినిమానో, రామ్ గోపాల్ వర్మ సినిమానో చూస్తున్నట్టుగా అనిపించింది. వాళ్ల సినిమాలు చూసి వీళ్లు ఇలా చేస్తారో, ఇవి చూసి వాళ్లు తీస్తారో తెలియదు కాని అచ్చు అలానే ఉంది. ఇంతలో ఒకడు పెట్రోల్ సీసా పట్టుకొని పరిగెడుతున్నాడు, మళ్లీ ఒక రెండు నిమిషాలు భయం, అతను ఎక్కడికో వెళ్లిపోయాడు. హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నాము. మొత్తానికి ఎలాగోలా అక్కడి నుండి బయటపడ్డాము.
తరువాత మా స్నేహితురాలికి ఫోన్ చేస్తే తను ’మీకు తెలుసా శివాజినగర్ లో గొడవలు జరుగుతున్నాయి, కర్ఫ్యూ అట’ అంది. మేము ’తెలుసు ! అందుకే లైవ్ కవర్ చేద్దామని వచ్చాము’ అని మా కష్టాలు చెప్పుకున్నాము. తిరిగివచ్చేప్పుడు బెంగుళూర్ అంతా తిప్పి ఆ BMTC బస్సు వాడు మొత్తానికి క్షేమంగా తీసుకువచ్చాడు.
రోజు కి 25 గంటలు వార్తలు చూసే మా సందీప్ ఆ రోజు వార్తలు చూడకపోవడం ఒక కారణం, వాడు చూసుంటే వెళ్ళేవాళ్ళం కాదేమో, అయినా ఇలాంటివి ఊహించలేము కదా. కొన్ని దేశాలలో ఉంటే, బయటికి వెళ్లేప్పుడు వర్షం ఉందా లేదా, వాతావరణం ఎలా ఉంది అని చూసుకొని వెళ్లాలి. మన దగ్గర మాత్రం గొడవలు ఉన్నాయో లేవో చూసుకొని వెళ్లాలనుకుంటా. ఈ forcasting కి కూడా గూగుల్ వాడు ఒక gadget తయారుచేస్తాడేమో.
మొత్తానికి సరదాగా వారాంతం బయటికి వెళ్దామని వెళితే అలా ఇరుక్కుపోయాము.
ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా సిరివెన్నెల గారి పాట గుర్తుకువస్తుంది, " సురాజ్య మవ్వలేని స్వరాజ్యం ఎందుకని... సుఖాన మనలేని వికాసమెందుకని ". ఈ క్రింది వీడియో చూడండి, నేను చెప్పిన వాటికి ఇంచుమించు దృశ్యరూపం.
ప్రతీ రెండు మూడు నెలలకొకసారి ఇలా ఏవో జరగడం, జరిగిన వారానికి అందరూ మర్చిపోవడం, అన్నీ మామూలు అయ్యాయి. ఏ సమస్యా లేదనుకుంటూ "జెండా పండుగ" ఘనం గా చేసుకుంటాము. అలాగే ఈ సారి కూడా.
బ్లాగ్మిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు (ముందస్తు).
గమనిక: నేను ఏ వర్గానిదో తప్పు అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం కాదిది, కేవలం ఒక యధార్ధ సంఘటనని చెప్పాలని ప్రయత్నం మాత్రమే. ఎవరిది తప్పు అని చర్చిస్తే ఆ చర్చకు ఆది, అంతం ఉండదనుకుంటాను. పై విషయాల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించగలరు, ఆ విషయాలు కేవలం నేను అప్పుడు చూసినవి, అనుభవించినవి మాత్రమే.
5 comments
మంచిటపా తో పాటు మంచి పాట ని గుర్తు చేసారు. ధన్యవాదాలు.
అసలు ఆ రోజు నేను కూడా మీతో రావాల్సింది.. కానీ రాలేదు.. వచ్చి ఉంటే, నేనుఊ లై టెలికాస్ట్ చూసి ఉండేదాన్ని...!
@MURALI,
నెనర్లు
@Sandeep,
ఆ పోలీస్ లు కూడా ఎక్కడ గొడవలు లేవో అక్కడే కూర్చున్నారు. నేనే నిన్ను లాకెళ్లాను :(
@మేధ,
ఈ సారి తీసుకెళ్తాంలే :), ఒకవేళ నువ్వు వచ్చి ఉండుంటే ఎలాగోలా మధ్యలోనే తిరిగివచ్చేవాళ్ళం.
అవును మరి, సురాజ్యమవ్వలేని స్వరజ్యమెందులకు?
ఎవడికో ఎవడిమీదో కోపమొస్తే ప్రజా ధనంతో కొన్న ప్రభుత్వ అస్థుల్ని నాశనం చేయడమెందుకో నాకు అర్ధంకాదు! ప్రభుత్వం మీద కోపం రాగానే ముందు కనపడేది rtc బస్సులే. ఎప్పుడు ఎడారికి కోపం వచ్చినా వారికే సంకటం. పోనీ ఆ బస్సులపై రాళ్ళు వేసి వాటిని తగలబెట్టే వెధవ కార్లో తిరుగుతాడా అంటే అదీ లేదు. తెల్లారితే ఏ బస్సు స్టాప్లోనో బస్సు ఎక్కి ఉద్యోగానికి వెళ్ళేవాడే. స్వతంత్ర భారతంగా మన దేశం అవతరించి 61 సంవత్సరాలు అయింది. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు స్వాతంత్ర్యం అనేది బాహ్యంగా కాదు. మనిషి లోపల రావాలి. కుల, మత, వర్గ, దేశ, భాషా భేదాల ఉక్కు సంకెళ్ళ నుంచి బయటపడి విశ్వమానవ ప్రేమను పంచె స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం కావాలి.
కాశ్మీర్ గొడవ గురించి ఆలోచిస్తే నాకు ఒక్కోసారి - అక్కడ ఒక ఇల్లు కట్టుకోవడానికి కుదరదు, ఒక పంట వేసుకొని ఒక కేజీ బియ్యం పండించలేము, అక్కడున్న మంచుతో వ్యాపారమూ చెయ్యలేము. అలాంటి దానికోసం ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారా? అనిపిస్తుంది. నిజమే మీరన్నట్లు ఈ సమస్యను మొదట్లోనే సామరస్యంగా పరిష్కరించి ఉండి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదేమో. రాజకీయాల కోసమో లేక ఏ ఇతర కారణాల చేతనో ఆనాడు వాళ్ళు చేసిన తప్పు నిన్న మన ముందు తరాన్ని, ఇప్పుడు మనల్ని బాధిస్తుంది, రేపు మన భావి తరాల వారిని కుడా బాధిస్తూవేధిస్తుంది.
-ప్రణవ్
Post a Comment
టపాలు
నేను
- ప్రపుల్ల చంద్ర
- చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమి లేదు, శతకోటి బ్రహ్మీ లలో ఒక బ్రహ్మి. నా సరదా ఙ్ఞాపకాలను, ఆలోచనలను, చూసిన ప్రదేశాల విశేషాలను మీతో పంచుకోవాలనే ప్రయత్నమే ఈ బ్లాగ్.