జపాన్ విశేషాలు - 2 ( మనుషులు )  

Posted by ప్రపుల్ల చంద్ర in



"దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్". జపాన్ వాళ్ళను చూస్తే ఈ మాటలు చాలా నిజమనిపిస్తాయి, మనుషులు మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుందని !!! ఇక్కడ అందరికీ క్రమశిక్షణ ఎక్కువ, అన్నీ పద్దతిగా చేస్తారు. నేను ఇప్పటి వరకు ఎవరి మొహములో కూడా చిరాకు కాని కోపం కాని చూడలేదు. (మరీ 100% అని కాదు, అలాంటి వారు కూడా అక్కడక్కడ ఉంటారట, కాని నేను చూడటం తటస్ఠించలేదు). ఇక ’గొడవ’ అనే మాట కూడా వినలేదు. చాలా నెమ్మదస్తులు, ఎప్పుడు సహాయం అడిగినా చాలా ఓపికగా, నవ్వుతూ చేస్తారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కకి జరిగి దారి ఇస్తే ’sorry, thank you'(జపనీస్ లో, సుమిమసేన్, అరిగతోఉ గొజయిమస్) అని చెప్తారు, ఇంత చిన్న విషయానికి కూడా చెప్తారా అని ఆశ్చర్యపడటం మా వంతవుతుంది. ఇక దుకాణాలలో వీరు ఇచ్చే గౌరవం ఎంత చెప్పినా తక్కువే. జపనీయులు చాలా కష్టపడి పనిచేస్తారు. కొందరు ప్రొద్దున్నే 9 గంటలకు ఆఫీస్ కి వచ్చి రాత్రి 12 గంటలకు ఇంటికి వెళ్తారు. పని కూడా చాలా నెమ్మదిగా చేస్తారు (మనతో పోలిస్తే !!! ). కాని ఎన్ని రోజులు చేసినా చివరికి perfect గా చేస్తారు. వీళ్ళు perfection కోసం ఎంత ప్రయత్నిస్తారో ఈ క్రింది ఫోటో చూడండి ( తమాషాగా :) ).



వీళ్లు చాలా మొహమాటస్తులు. అంత త్వరగా ఎవరితో మాట్లాడరు. కాని ఎప్పుడైనా తినడానికి పార్టీలకు వెళ్లినప్పుడు మాత్రం వాళ్లలోని ’చంద్రముఖి’ బయటికి వస్తుందనుకుంటాను, చాలా మాట్లాడుతారు, పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటారు. ముందురోజు వరకు వీరినా నిశ్శబ్దంగా ఉండటం చూసాము అని ఆశ్చర్యమవుతుంది. అది ’మందు’ ప్రభావం అయి కూడా ఉండొచ్చు!!. తరువాత రోజు మళ్ళీ మాములుగా ఉంటారు, అస్సలు మాట్లాడరు. కొందరయితే అస్సలు పరిచయమేలేనట్టుగా (పార్టీలో కొత్తగా పరిచయమైనా వాళ్లు) ప్రవర్తిస్తారు. వేరే కంపనీలలో పనిచేసే నా మిత్రులకు కూడా ఇదే అనుభవం. జపనీయులు ఏదైనా నచ్చినా నచ్చక పోయినా నచ్చిందనే చెబుతారు, చెప్పాకదా వీళ్లకి మొహామాటం ఎక్కువ. వాళ్ల మనసులో మాట అస్సలు చెప్పరు, ముందు వాళ్లు ఏమైనా అనుకుంటారని. కాని అప్పుడప్పుడైనా ముక్కుసూటిగా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంటుంది నాకు. వీళ్లు అంత సుళువుగా మనని నమ్మరు, నమ్మకం కుదరడానికి చాలా సమయం తీసుకుంటారు.

ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాముఖ్యం ఇస్తారు, ఒకరి విషయాలలో మరొకరు అస్సలు తలదూర్చరు. అలా అని విచ్చలవిడితనం కూడా ఉండదు. పిల్లలు ఎంత అల్లరి చేసినా ఏమీ అనరు, చాలా ఓపికగా ఉంటారు. పిల్లలు పెద్దగా అరుస్తూంటే వద్దనడం మాత్రమే చూసాను ( ప్రక్క వాళ్లకి ఇబ్బందని ). పిల్లలకి చిన్నప్పటి నుండే అన్ని పద్దతులు నేర్పుతారు. ఉదాహారణకి ట్రైన్స్ లో వెళ్ళేప్పుడు సీట్స్ మీద నిలబడి ఆడుకోవాలంటే పిల్లలు వాళ్ళ షూ విప్పుకోవాల్సిందే, లేకపోతే తల్లిదండ్రులు సీట్ ఎక్కనివ్వరు !!! రోజూ చాలా కష్టపడే వీరు వారాంతంలో మాత్రం సరదాగా వాళ్ల పిల్లలతో పార్కుల్లో ఆడుతూ కనపడతారు. ఇక్కడ పిల్లలను ముద్దు చేయడం నేను చూడలేదు. మన దగ్గర పిల్లల బుగ్గలు గిల్లడం, ముద్దు పెట్టుకోవడం మామూలు కదా, ఇక్కడ మాత్రం నాకు కనపడలేదు, అది ఎందుకో మాత్రం నాకు తెలియదు. ఒక వయసు వచ్చేవరకే తల్లిదండ్రుల మీద పిల్లలు ఆధారపడతారు పాశ్చాత్య దేశాలలా. తరువాత వాళ్లే పనులు చేస్తూ చదువుకుంటారు. చాలా తక్కువ మంది తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటారు.


ఫోటో: తన కూతురితో ఆడుకుంటున్న మా బాస్

జపాన్ లో భద్రత చాలా ఎక్కువ, రాత్రి 1,2 గంటల వరకు ఆడవాళ్లు ఒంటరిగా తిరుగుతూ కనపడతారు. ఎప్పుడైనా మేము తలుపులు సరిగ్గా వేయకుండా భయటికి వెళ్లినా పెద్దగా భయపడం, ఎందుకంటే ఇక్కడ ఏమి జరగదని నమ్మకం. కాని మా జాగ్రత్తలో మేము ఉంటాము అది వేరే విషయం అనుకోండి.

ఇక్కడ కొందరు ఒంటరిగా ఉండటం వలన మానసికంగా కౄంగి పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు జీవితం మరీ రొటీన్ గా ఉందని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు, వేరే వాళ్ళని చంపిన సంఘటనలు, కొందరు వీడియో గేములు బాగా ఆడి ఆ ప్రభావం తో వేరే వాళ్ళని చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ తప్పు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి, ఉరిశిక్షలు చాలానే వేస్తారు, అందుకే ఇక్కడ చిన్న చిన్న తప్పులు చేయడానికి కూడా భయపడతారు. ఆక్సిడెంట్స్ చేస్తే చాలా డబ్బులు ఫైన్ కట్టాలట అందుకే ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర చాలా నెమ్మదిగా నడుపుతారు. మనుషులు రోడ్డు దాటేంత వరకు ఆగి మరీ వెళ్తారు.

నాకు ఆశ్చర్య మైన విషయం ఏంటంటే ఇక్కడ కూడా విడాకులు తీసుకోవడం ఎక్కువే!. బయటికి మంచిగా కనపడే వీళ్లు కూడా గొడవలు పెట్టుకొని విడిపోతారు. రోజులో ఎక్కువ శాతం పని చేస్తూ ఉండటం వల్ల ఒకరితో ఒకరు గడపలేకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. ప్రపంచ యుద్ద సమయంలో చాలా కౄరంగా ఉండేవారట. ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. అపరిచితుడు సినిమాలో చివరలో చూపెట్టినట్టు మొత్తం చికిత్స అయిపోయిన తరువాత కూడా అప్పుడప్పుడు లోపల ఉన్న అపరిచితుడు బయటికి వచ్చినట్టు, వీళ్లకు అప్పటి కౄరత్వం అప్పుడప్పుడు బయటికి వస్తుందేమో !!!!.

This entry was posted on Monday, August 25, 2008 at 7:32 AM and is filed under . You can follow any responses to this entry through the comments feed .

12 comments

Very interesting... sir.

August 25, 2008 at 9:46 AM

మీరు పక్కనుండి చెప్పినట్లు చక్కగా ఎక్కింది బుర్రలోకి ప్రపుల్లగారు:)

August 25, 2008 at 10:23 AM

Nice narration prapulla...ending chala bagundi...mee next tapa kosam eduru choosthunnam.. :)

August 25, 2008 at 6:53 PM

చాలా బాగుంది.

August 25, 2008 at 7:58 PM

ఒక సంస్కృతిని వేరే సంస్కృతివారు అర్థం చేసుకోవాలంటే కొంత భావవైశాల్యం కావాలి. ఆ తీరు మీ రచనలో కనబడింది.

August 25, 2008 at 7:58 PM

పోయిన టపా, సోషల్ పుస్తకం ఇచ్చి చదువుకోమన్నట్లుంది, ఇది సోషల్ టీచర్ వివరించి చెబుతున్నట్లుంది!!!

August 25, 2008 at 10:18 PM

GOOD JOB

August 26, 2008 at 12:44 AM

chaalaa chakkagaa vivarimchaaru

August 26, 2008 at 3:51 AM

@sujata, @Murali.Marimekala, @కత్తి మహేష్ కుమార్, @Ghanta Siva Rajesh , @durgeswara,

టపా నచ్చినందుకు నెనర్లు

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి ,
నెనర్లు,
'గారు' వద్దండి, ప్రపుల్ల అని పిలిస్తే చాలు, నేను మీ కన్నా చాలా చిన్న వాడిని.

@మేధ,
ఇలాంటివి వ్రాసేప్పుడు అలాగే తయారవుతుందేమో !!!

August 26, 2008 at 7:25 PM

కొన్ని నెలల క్రితం ఒక మేగజైన్ వాళ్ళు నిర్వహించిన సర్వే లో తేలిందేమిటంటే, ప్రపంచం లో కెల్ల అతి మర్యాదగా ప్రవర్తించే వాళ్ళు జపనీయులని. ఏదైనా ఒక విషయం నచ్చక పోతే వీళ్ళు చెప్పే విధానమే వేరు. కఠినమైన పదాలు ఉండవు, గట్టిగా ఆరవడం ఉండదు, మొహం లో ఆవేశం మచ్చుకైనా కనపడదట.

మంచి వ్యాసం.

/ఉమాశంకర్
http://umasankarrao.blogspot.com

August 27, 2008 at 6:35 AM

మంచి వ్యాసం.

August 27, 2008 at 1:12 PM

@ Umasankar Sivadanam ,
నెనర్లు,
అవునండి, చాలా మర్యాద ఇస్తారు.

@రాధిక,
నెనర్లు

August 28, 2008 at 6:52 AM

Post a Comment