గాలిపటాలు, వాటితో నా ఙ్ఞాపకాలు  

Posted by ప్రపుల్ల చంద్ర in



సంక్రాంతి అంటే అందరికి భోగి మంటలు, ముగ్గులు, గొబ్బిల్లు, గంగిరెద్దులు గుర్తుకువస్తాయి. నాకు మాత్రం వీటితో పాటు గాలి పటాలు గుర్తుకువస్తాయి. చిన్నప్పుడు చాలా ఎగురవేసేవాళ్ళం, సంక్రాంతి కి నెలరోజుల ముందు నుండి ఉండేది మా హడావుడి, ఎప్పుడు సంక్రాంతి సెలవులు వస్తాయా అని ఎదురుచూసేవాడిని. కాని ఈ మధ్య ఎక్కడా గాలిపటాల హడవుడి అంతగా లేదు. ఇప్పుడు పిల్లలు ( మా బంధువులలో నేను చూసినంత వరకు అందరూ ) పోగో, జెటిక్స్ అంటూ కార్టూన్స్ చూస్తూ ఇంటి బయటికే రావడం లేదు, మన చిన్నప్పుడు అవి ఉంటే మనం కూడా అలాగే తయారయ్యేవాళ్లమేమో, మన అదృష్టం కొద్దీ అప్పుడు అంత అభివృద్ది చెందలేదు. హాయిగా బయటే ఆడుకునేవాళ్లం. ఇక వెన్నెల్లో ఆడిన ఆటలు ఎప్పుడూ మరచిపోలేము. సంక్రాంతి సెలవుల్లో మాత్రం ఎప్పుడూ డాబా పైనే ఉండేవాళ్ళం. గాలిపటాలతో నా జ్ఞాపకాలను పంచుకోవాలనే నా ప్రయత్నమే ఈ టపా. ఇక నేను చెప్పబోయే కొన్ని పదాల గురించి హైదరాబాద్ వాళ్ళకి, హైదరబాద్ చుట్టుప్రక్కల వాళ్లకి ఎక్కువ తెలిసే అవకాశం ఉంది, తెలంగాణా ప్రాంతం వాళ్ళకి కాక వేరే వారికి తెలియదనుకుంటాను. ఇవి తెలిసిన వారికి గుర్తు చేయడానికి, తెలియని వారు తెలుసుకోవడానికి.



మేము గాలిపటాలని పతంగులు అంటాం. సంక్రాంతి సమయంలో గాలిపటాలు అమ్మడానికి కొత్త కొత్త దుకాణాలు వెలిసేవి, వేరే దుకాణాలలో కూడా అమ్మేవారు. అన్నీ రంగురంగుల పతంగులతో కలకలలాడేవి ఒక నెల రోజులు. రకరకాల పతంగులు దొరికేవి, వాటి మీద ఉండే గుర్తులను బట్టి వాటి పేర్లు ఉండేవి. గుడ్డు పతంగి ( పతంగి మధ్యలో వృత్తాకారంలో గుర్తు ఉంటే), రెండు గుడ్ల పతంగి, నామం పతంగి, కత్తెర పతంగి, టోపి పతంగి, జెండా పతంగి (రెండు, మూడు రంగులతో జెండాలా ఉంటే ) ఇలా రకరకాల పతంగులు ఉండేవి, మళ్ళీ ఈ గుర్తులు కూడా రెండు, మూడు ఒకే పతంగీలో ఉండేవి అంటే రెండు గుడ్లు ఉండి క్రింద కత్తెర గుర్తు అలా. పతంగి రంగులు, గుర్తుల రంగులతో వాటిని పిలిచేవాళ్ళం. తరువాత ప్లాస్టిక్ కవర్లతో చేసిన పతంగులు, ఎవేవో బొమ్మలు ముద్రించిన పతంగులు ఇలా వచ్చాయి కాని చూడడానికి అంత బాగుండేవి కావు. పెద్ద పెద్ద పతంగులని ’డోరీ’ అనేవాళ్ళం. అవి చాలా సన్నని కాగితం తో చేయబడి చుట్టూ దారం అతికించి ఉండేవి. మేము కూడా అప్పుడప్పుడు తయారు చేసేవాళ్ళం, కాని అవి కొద్దిగా బరువుగా ఉండేవి. అప్పుడప్పుడు అవి ఎగిరేవి కూడా కావు.

పతంగులను నియంత్రించడానికి కట్టే దారాన్ని ’కార్ణాలు’ అనే వాళ్లం. ఇది కట్టే విధానాన్ని బట్టి పతంగులు ఎగురుతాయి. ఒక రకంగా కడితే పతంగి బొమ్మలా గాలిలో కదలకుండా నిలబడేది, వాటిని ’బొమ్మ కార్ణాలు’ అంటారు. సరదాగా అప్పుడప్పుడు అలా కట్టి ఎగరవేసి చాలా దూరం పోనిచ్చి, అలాగే గాల్లో ఉంచి, డాబా పై నుండి క్రిందికి వెళ్ళి అమ్మతో గొప్పగా చెప్పుకునేవాణ్ణి. అప్పుడప్పుడు పతంగులు సరిగ్గా ఎగరడానికి తోకలు అతికించవలసి వచ్చేది.



పతంగుల మధ్య పోటీని ’పేంచ్’ అంటారు (ఒకదానితో మరొకటి కోయడం). దాని కోసం గట్టి దారం ( మాంజా ) కొనేవాళ్లం, అవీ రకరకాల రంగులలో దొరికేవి. పాలపిట్ట రంగు మాంజా, పసుపు రంగు మాంజా ఇలా చాలా రకాలు ఉండేవి. ఏది మంచిదో తెలుసుకొని ఎప్పటికప్పుడు కొత్తకొత్తవి కొనుక్కునేవాళ్ళం. మేము కూడా గాజుపెంకులు నూరి, కలమంద, అన్నం ముద్ద అన్నీ కలిపి దారానికి రుద్ది మాంజా తయారుచేసేవాళ్ళం.

ఇక ఈ పేంచ్ లో రకరకాల పద్దతులు ఉండేవి. ముఖ్యంగా పతంగి కొద్దిగా బరువుగా ఉండి మంచి మాంజా ఉండాలి. రెండు పతంగులు ముడిపడ్డ తరువాత దారం పదునుని బట్టి ఎదో ఒకటి వెంటనే తెగిపోతుంది. ఒకవేళ రెండూ సమానంగా ఉంటే మాత్రం చాలాసేపు పడుతుంది, దీన్ని ’మొండి పేంచ్’ అనేవాళ్ళం. దారాన్ని వదులుతూ, దారాన్ని లాగి మళ్ళీ వదిలి (దీన్ని ’కీంచ్ కట్’ అనే వాళ్ళం), బలంగా దారాన్ని లాగడం ఇలా ఒక్కో దారాన్ని బట్టి ఒక్కోలా చేసి అవతలి వారి దారాన్ని కోసేవాళ్ళం. వాళ్ళ పతంగి తెగిపోతే ’అఫా’ అని గట్టిగా అరిచేవాళ్ళం. అప్పుడప్పుడు దారాన్ని లాగుతూ ఉంటే అవతలివారి పతంగి మన చేతికి వస్తే దాన్ని ’లుప్టా’ చేయడం అంటారు. ఇలా చేయడం వల్ల గొడవలు కూడా జరిగేవి. పేంచ్ చేసేప్పుడు ముఖ్యమైంది పక్కన ఉండి దారం అందించేవాళ్ళు. ’చరఖా’ పట్టుకొని దారం వదలడం ( మేము రీల్ వదలడం అనేవాళ్ళం), దారాన్ని తొందరగా చుట్టడం (దీనికీ కొన్ని పద్దతులు ఉండేవి), దారం చిక్కులు పడకుండా చూసుకోవడం వీరి భాద్యత. మా అన్నయ్య ఎగిరేసేప్పుడ్డు నేనే చరఖా పట్టుకునేవాడిని.

పతంగులు ఎగిరేసేటప్పుడు చెట్లకు, స్తంభాలకి తట్టుకుంటూ ఉండేవి. అలా తట్టుకుంటే మాములుగా అయితే కర్రలతో తీసేవాళ్ళం. లేకపోతే దారానికి కొద్దిగా బరువున్న రాయిని కట్టి ( దీన్ని లండోరి అంటారు ), రాయిని జాగ్రత్త గా పతంగి దారం పై విసిరి లాగేవాళ్ళం. అప్పుడు మాంజా, దారం చాలా ఉండేది కాబట్టి లండోరి తయారు చేసుకొని పోటీలు కూడా పెట్టుకునేవాళ్ళం, ఎవరి దారం తెగిపోతే వారు ఓడిపోయినట్టు.

సంక్రాంతి ముందు రోజు మా ఊర్లో పెద్ద పతంగుల పోటీ జరిగేది. ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎవరి పతంగి ఏ రంగు, ఎవరు గెలిచారు, ఇలా చెబుతూ మైక్ సెట్స్ ద్వారా ప్రత్యక్ష వ్యాఖ్యానం (live commentry) ఉండేది. కాకపోతే మేము ఎప్పుడు పాల్గొనలేదు అందులో.

మొత్తానికి అలా ఒక నెలరోజులు బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం. పండగ రోజు ఇప్పటికీ మా స్నేహితులు ఎగురవేస్తారనుకుంటాను. కాని అప్పటిలా లేదు ఇప్పుడు. ఇప్పుడు చేయలేకపోయినా ఆ ఙ్ఞాపకాలు మాత్రం ఉన్నాయి.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

కమకుర, జపాన్ - ట్రావెలాగ్  

Posted by ప్రపుల్ల చంద్ర in ,



’కమకుర’ నాకు జపాన్ లో చాలా బాగా నచ్చిన ప్రదేశం. కమకుర 800 సంవత్సరాల క్రితం జపాన్ కి రాజధానిగా ఉండేది, అదే సమయంలో ఇక్కడ ఎన్నో బౌద్ద, షింటో దేవాలయాలు కట్టడం జరిగింది. ఎన్నో గుడులకి, బీచ్ లకి ప్రఖ్యాతి చెందింది. టోక్యో నుండి ఒక గంటలో అక్కడికి చేరుకోవచ్చు.



మొదట మేము ’కెన్ చోజి’ అనే జెన్ బౌద్ద దేవాలయానికి వెళ్ళాము. మేము వెళ్లే సమయానికి అక్కడ ఎవరూ లేరు. గిలిగింతలు పెడుతున్న చలి, సూర్యున్ని మింగేసిన మేఘాలు, చుట్టూ రకరకాల చెట్లు (ముందే చెప్పిన్నట్టు ఇక్కడి గుడులలో తోటలు చాలా అందంగా ఉంటాయి), చుట్టూ ఉన్న కొండలు, వాటి మీద దట్టంగా ఉన్న చెట్లు, అక్కడక్కడ ఉన్న గుడులు, లయబద్దంగా పక్షుల చేస్తున్న శబ్దం, వీటన్నిటితో ఆ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా రోజుల తరువాత నగరానికి దూరంగా వచ్చినందుకు అనుకుంటాను ఆ ప్రదేశం నాకు చాలా బాగా నచ్చింది. అంతా కలయతిరిగి వెళ్ళిపోయే సమయానికి జనాలు రావడం మొదలుపెట్టారు. ఆ తరువాత ’ఎన్ గకుజి’ దేవాలయానికి వెళ్ళాము, ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఎక్కువ మంది ఉండే సరికి మొదటి ప్రదేశం అంత ప్రశాంతంగా లేదు, కాని తోటలు మాత్రం ఎప్పటిలా చాలా బాగున్నాయి.



కమకుర లో హైకింగ్ ట్రయల్స్ కూడా చాలా బాగుంటాయి. మేము గ్రేట్ బుద్ద విగ్రహాన్ని చేరే విధంగా మా హైకింగ్ కోర్స్ ని ఎంచుకున్నాము. చూడటానికి చిట్టడవిలా ఉండి ఎగుడుదిగుడు కొండలతో హైకింగ్ చాలా సరదాగా అనిపించింది. మధ్యలో ’జెనియరయి బెంతెన్’ గుడి కి వెళ్ళాము. జెనియరయి అంటే డబ్బులను కడగడం అని అర్ధం. డబ్బులను కడగడం ఏంటని అంటారా, ఇక్కడి గుడిలో ఒక చిన్న గుహ ఉంది, అందులో ఒక చిన్న నీటి ప్రవాహం ఉంటుంది, ఆ నీటి తో డబ్బులను కడిగితే అవి రెట్టింపు అవుతాయని వారి నమ్మకం (వెంటనే కాదండోయ్, కొన్ని రోజుల తరువాత !!). చాలా మంది డబ్బులను కడుగుతూ కనపడ్డారు, మేము కూడా మా అదృష్టాన్ని పరిక్షించుకున్నాము. కొందరైతే నోట్లను కూడా కడుగుతున్నారు, ఆ తరువాత బయట ఉన్న అగరుబత్తీల వేడిలో ఆరబెట్టుకున్నారు. ఇది గమనిస్తున్న కొందరు పాశ్చత్యులు "వీళ్లేంటి డబ్బులను తగలపెడుతున్నారు" అని జోకులు వేసుకుంటున్నారు. అయినా ఎవరి నమ్మకాలు వారివి.



తరువాత మళ్ళీ మా నడకను మొదలుపెట్టాము. దూరంగా కనపడే పసిఫిక్ మహాసముద్రం చూడడానికి ఎంతో బాగుంది. దాదాపు ఒక గంట నడక తరువాత ’గ్రేట్ బుద్ద’ విగ్రహం (డయిబుట్సు) కి చేరుకున్నాము. ఇది రాగితో చేసిన విగ్రహం. ఈ ప్రదేశంలో మొదట ఒక గుడి ఉండేది, కాని 15వ శతాబ్దంలో వచ్చిన సునామి వల్ల గుడి మొత్తం కొట్టుకుపోయి ఒక విగ్రహం మాత్రం మిగిలిఉంది. అలా అప్పటి నుండి ఆ విగ్రహం బయటే ఉండేసరికి ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. విగ్రహం క్రింద ఉన్న మెట్ల ద్వారా విగ్రహం లోపలికి వెళ్ళవచ్చు.




ఫోటో : గ్రేట్ బుద్ద పాదరక్షలు

డయిబుట్సు తరువాత అక్కడికి దగ్గర్లోనే ఉన్న ’హసెదర’ అనే జొడొ బౌద్దమతానికి చెందిన గుడికి వెళ్ళాము. ఆ గుడిలో చెక్కతో చేయబడిన Kannon(god of mercy) పదకొండు తలల విగ్రహం ఉంది. ఇది జపాన్ లో చెక్కతో చేయబడిన విగ్రహాలలో పెద్దది. గుడిలో ఉన్న చిన్న చిన్న సరస్సులు తాబేళ్ళు, చేపలతో ఉండి చూడడానికి అద్భుతంగా ఉన్నాయి. ఆ గుడిలో ఉన్న ఒక గుహలో ఇంకా ఎన్నో విగ్రహాలను చూడవచ్చు. గుడి ప్రక్కనే చిన్న మ్యూజియం ఉంది. అందులో హిందూమతం నుండి బౌద్దమతం లోకి తీసుకోబడిన దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇంద్ర, సూర్య, వరుణ ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి, వాటి క్రింద జపనీస్ పేర్లు ఉండి దాని ప్రక్కనే సంస్కృతంలో పేర్లు ఉన్నాయి. కమకురలో ఇంకా చాలా గుడులు ఉన్నాయి, కాని సమయాభావం వల్ల వెళ్ళడం కుదరలేదు.



చివరగా పసిఫిక్ మహాసముద్ర తీరానికి చేరుకున్నాము. పసిఫిక్ సముద్రాన్ని చూసి చాలా సంతోషపడ్డాను. చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నది ప్రత్యక్షంగా చూడటం ఒక విధంగా సంతోషమేగా మరి.అతి పెద్దదైన మహా సముద్రం కాబట్టి చూడటానికి గంభీరంగా కనపడింది. సర్ఫింగ్, యాచింగ్ చేసే వాళ్ళు చాలా మంది కనపడ్డారు. అక్కడి బీచ్ లోనే సాయంత్రం వరకు గడిపి సూర్యాస్తమయాన్ని చూసి వెనుదిరిగాము.


నేను తీసిన ఫోటోలలో నాకు చాలా నచ్చిన ఫోటో

రోటీ, కపడా, మకాన్ ఔర్ ?  

Posted by ప్రపుల్ల చంద్ర in



ఇప్పుడు ఈ ప్రశ్నను ఎవరిని అడిగినా ఖచ్చితంగా చెబుతారు ’రక్షణ’ అని, ఎందుకంటే అదికూడా ఒక ప్రాధమిక అవసరంగా మారింది. ఇంటి బయట అడుగుపెడితే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నమ్మకం లేదు, వస్తామో లేదో అని. మొన్న జరిగిన హింసాకాండకి చలించని వారుండరు. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగేసరికి దేశమంతటా భారీ స్పందన వచ్చింది, కాని ఇలాంటి సంఘటనలు దేశవిభజన నాటి నుండి కాశ్మీర్ లో జరుగుతూనే ఉంది. ఇప్పుడు తెగబడి ఏ ప్రాంతం లో కావాలనుకుంటే అక్కడ విధ్వంసం సృష్టించగలుగుతున్నారు. భారతదేశంలోనే వారికి సహాయం దొరుకుతుందన్నది ఎవరూ కాదనలేని నిజం. అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయో కొన్ని పూర్వాపరాలు, అవి ఆపే ప్రయత్నం ఎలా చేయవచ్చో అన్న నా ఆలోచనలని పంచుకోవాలనే ప్రయత్నమే ఈ టపా.

కాశ్మీర్ వరకే ఉండే గొడవలు దేశం మొత్తం వ్యాపించడానికి కారణం బాబ్రి మసీద్ కూల్చివేత అని అనుకునే వాడిని, కాని తీవ్రవాదం మాత్రం అప్పటినుండే మొదలయ్యింది. ఇక గొడవల విషయానికి వస్తే ముస్లిం రాజులు 11వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి మొదలయ్యింది. గుడులను ధ్వంసం చేయడం, మత మార్పిడులు చాలా జరిగాయి. అలా గొడవలు జరుగుతూ ఉండేవి. క్లాస్ లోకి టీచర్ వచ్చాక అల్లరి చేసే పిల్లలు కాస్త నిశ్శబ్దంగా కూర్చునేటట్లుగా, ఆంగ్లేయులు వచ్చాక గొడవలు తగ్గించేసారు. మ్యూటిని అప్పుడు ఆంగ్లేయులు చిచ్చు పెట్టినా.... తరువాత అది సర్దుకుంది. సరైన ప్రాతినిధ్యం లేదని అలీజిన్నా లాంటి నాయకులు కాంగ్రెస్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. స్వాతంత్రం రావడం, భారతందేశంలో ముస్లింలకు న్యాయం జరగదని వారు భావించి ప్రత్యేక దేశం కావాలని అడగడం జరిగింది, ఆ తరువాతి పరిస్థితులు ఎంతో రక్తపాతానికి తెరతీసింది. తరువాత కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతూ వచ్చాయి.

ఇక బాబ్రి మసీద్ విషయానికి వస్తే బాబర్ ఆ మసీద్ కట్టినప్పటి నుండి అది వివాదాస్పదమే. రామజన్మ భూమి పైన ఉన్న గుడిని కూల్చి, అక్కడ మసీద్ కట్టారని వాదన ఉంది (అలాంటిది ఏమీ లేదని ముస్లింల వాదన). మ్యూటిని ముందు వరకు హిందు, ముస్లిం లు అందరూ అక్కడ పూజలు జరిపేవారు. కాని మ్యూటిని గొడవల తరువాత హిందువులను అనుమతించలేదు. శ్రీరామ నవమి ఉత్సవాలు ఆ మసీద్ ముందే చేసేవారు. ఆ మసీద్ యొక్క ఒక భాగం లో హిందువులు గుడి కట్టాలని ప్రయత్నించినా అధికారులు అనుమతించలేదు. తరువాత జరిగిన గొడవలలో కొద్దిగా కూలిపోతే ఆంగ్లేయులు కట్టించారు. స్వాతంత్రం తరువాత 1949 లో ఒకరాత్రి కాపలా పోలిసుల కన్నుగప్పి సీతారాముల విగ్రహాలని లోపల ప్రతిష్టించారు. తరువాత హిందూ భక్తులు మసీద్ లోపలికి రావాలని ప్రయత్నించడం, ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని ఆపి, ఆ గుడిని వివాదాస్పద ప్రదేశంగా పరిగణించి మూసివేసారు. 1984 నుండి అక్కడ గుడి కట్టాలని VHP, BJP లు గొడవలు చేయడం, కోర్టు ఆదేశాలని ప్రక్కన పెట్టి 1992 లో మసీద్ కూల్చడం జరిగింది. అది ఒక విధంగా మన రాజ్యాంగాన్ని మనమే వెక్కిరించినట్టు !!! నా ఉద్దేశ్యం ప్రకారం సరైన ఆధారాలు చూపి న్యాయపరంగా సాధించుకుంటే బాగుండేది. అది ఓటు బ్యాంకు రాజకీయాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను!!! ఈ పని వల్ల సమస్య మరింత జటిలమైంది. మతవిద్వేషాలు రగిలి ఎన్నో గొడవలకి ఆజ్యం పోసింది. ముస్లింలలో అభద్రతాభావం పెంచింది. ఇది ఆసరాగా చేసుకొని ఉగ్రవాదులు కొందరిని రెచ్చగొట్టి వారి సహాయంతో చెలరేగిపోతున్నారు. రామజన్మభూమి దగ్గర జరిగిన త్రవ్వకాల ఫలితాలు కూడా వివాదాస్పదమయ్యాయి. అక్కడ రామాలయం ఉందనే ఆధారాలు ఎన్ని దొరికాయో, లేవని కూడా అన్నే దొరికాయి. అసలు సంగతి రామునికే తెలియాలి !!!

మరి ఇప్పుడు ఏం చేయాలి !!!!

ఇప్పుడు పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిందంటే తప్పులు ఇద్దరి వైపు జరిగిపోయాయి. అన్నింటికి అవతలి వారే కారణం అని చూపెట్టుకోవడం, ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడం మానెయ్యాలి.

అయోధ్యలో రాముడి గుడి గురించి ప్రస్తావన తీసుకు రాకపోవడం చాలా మంచింది. ఒకవేళ పట్టుబట్టి కట్టినా ( ఒకవేళ అక్కడ గుడి ఉందని ఋజువైతే! ) గుడికి ఎమైనా జరిగితే గోద్రా కన్నా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. అనవసరంగా దేశంలో అస్థిరత వస్తుంది. అప్పుడు ఇంకెన్ని తీవ్రవాద సంస్థలు మొదలవుతాయో.

కాశ్మీర్ విషయానికి వస్తే అది ఇచ్చే సమస్యే లేదు. కాశ్మీర్ ఇచ్చినంత మాత్రాన ఉగ్రవాదం ఆగదు, ఇంకా పెరిగినా పెరగొచ్చు. అంతే కాక అక్కడ ఉన్న 30% హిందువుల గురించి కూడా ఆలోచించాలి ( కనీసం ఈ విషయం లో నైనా మనం అన్ని దేశాలలా ఆలోచించాలి ). పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితి అందరికి తెలిసిందే !!. పాకిస్థాన్ లో హిందువుల పరిస్థితి కన్నా భారతదేశంలో ముస్లింల పరిస్థితి బాగుందని ఖచ్చితంగా చెప్పగలను. 1989 లో కాశ్మీరీ పండిట్లకి వ్యతిరేకంగా జీహాద్ మొదలు పెట్టారు, స్వాతంత్రం ఇస్తే ఇంకేం చేస్తారో.

భారతదేశం ఏర్పడినప్పటి నుండి లౌకిక రాజ్యం గా ఉంటున్నాం, అది అందరూ గౌరవించాలి. ప్రభుత్వం మాదే కదా అని ' రాముడే లేడు ' అనే కాంగ్రెస్ నాయకులకి, నోరుంది కదా అని 'రాముడు పెద్ద తాగుబోతు' అనే కరుణానిధి లాంటి నాయకులకి, మెజారిటీలము కదా అని ' బాబ్రి మసీద్ గతే మీకు పడుతుంది ' అని హెచ్చరించే (సామ్నా పత్రికలో) బాల్ థాకరే లాంటి నాయకులకి ప్రజలు బుద్ది చెప్పాలి.

మన దగ్గరి సమస్యలని కేవలం ప్రాంతీయ సమస్యలు గానే చూస్తుంన్నాము, దేశ సమస్యలు గా చూడటం లేదు. మొన్నటి వరకు కాశ్మీర్ తీవ్రవాదం కేవలం కాశ్మీర్ సమస్యగానే చూసాము, కాని ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతూ ఉండడం వల్ల జాతీయ సమస్య గా పరిణమించింది. మొన్న ముంబయి దాడులు జరిగిన తరువాత రోజే అస్సాం లో రైలు లో బాంబు వల్ల ముగ్గురు చనిపోయారు, ఆ విషయం గురించి పెద్దగా స్పందనే రాలేదు. కాశ్మీర్ తీవ్రవాదం అయినా, ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న తీవ్రవాదమైనా, దండాకారణ్యంలో మావోయిస్టులనైనా, దేశ సమస్యకు కారణం ఎవరైనా మనందరం ఒక్కటిగా ఎదురుకోవాలి. జాతీయ సమైక్యతను పెంచాలి.

ఒకవైపు అందరం ఉగ్రవాదాన్ని అణచివేయాలి అని కోరుకుంటూ ఉంటే మరోవైపు మన ప్రియతమ కరుణానిధి గారు LTTE వాళ్ళని రక్షించే పనిలో ఉన్నారు. ఈ విధంగా మనది ద్వంద వైఖరి అని ప్రపంచానికి చాటి చెబుతున్నామన్నమాట. శ్రీలంక ప్రజలు 'వారికి వాళ్ళ సమస్యే తీర్చుకోవడం తెలియదు, మనది తీరుస్తారా' అని నవ్వుకుంటున్నారు. మన నాయకులకు ఎప్పుడు బుద్ది వస్తుందో!!!

కొందరు ముస్లింలకు తీవ్రవాదులతో సంబంధాలు ఉండటం వల్ల అందరు ముస్లింలు ప్రమాదకరమైన వ్యక్తులుగా చిత్రీకరింపబడ్డారు. అందువల్ల కొందరు హిందువులు ముస్లింలను స్నేహితులుగా చేసుకోవడం లోను, ఇల్లు అద్దెకు ఇవ్వడం లాంటి విషయాలలోను ఆసక్తి చూపడంలేదు. ఇలాంటి విషయాలలో మార్పు రావాలి.

ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుడు జరిగినా భారతీయ ముస్లింలు వేధింపులకు గురి అవుతున్నాం అని భాధ పడుతున్నారు. ప్రశ్నించబడేది కేవలం అనుమానితులే, అది కూడా నేర పరిశోధనలో భాగంగానే తప్ప ఇస్లాం మీద ద్వేషం తో కాదని ముస్లింలు గ్రహించాలి. దానికి కారణం కూడా కొందరు భారతీయ ముస్లింలు తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి వారిని కాపాడిన సందర్భాలు చాలా బయటపడ్డాయి కాబట్టి.

భారతదేశంలో ముస్లింలకి సరైనా ప్రాతినిధ్యం లేదా, ఆర్ధికంగా వెనక బడ్డారా? అని అడిగితే దానికి సమాధానం అవుననే వస్తుంది. సచార్ రిపోర్ట్ లో మనం పూర్తి గణాంకాలు చూడవచ్చు. ఆ రిపోర్ట్ దాకా ఎందుకు, మనం చదివిన ప్రదేశాలలో, ఉద్యోగం చేసే చోట చూస్తే మనకే తెలుస్తుంది... వారి ప్రాతినిధ్యం ఏంతో. వారి అభివృద్ది కోసం చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం. ముస్లింలే కాదు మన దేశంలో కోట్ల మంది హిందువులు కూడా కటిక పేదరికం లో ఉన్నారు. దాదాపు 30% (అంటే ఒక 30 కోట్లనుకోండి !!) మంది దారిద్ర్య రేఖకి దిగువున ఉన్నారు. కాకపోతే రిజర్వేషన్లు మత ప్రాతిపదకన కాకుండా ఆర్థికంగా వెనకబడిన వారికి అందరికి ఇవ్వాలనేదే చాలా మంది కోరిక. దానికోసం ఒక ప్రత్యేక వ్యవస్థ యొక్క అవసరం ఎంతైనా ఉంది. పేదరికంలో మగ్గుతున్న ఎందరో అమాయకులైన ముస్లిం యువకులను తీవ్రవాదులు తమ పావులుగా వాడుకుంటుంన్నారు, ఈ విషయం లో వారిని మరింత విజ్ఞానవంతులను చెయ్యాలి. మన దేశంలో ఉన్న సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి.

దేశవిభజన సందర్భంలో అక్షరాస్యులైన, ధనికులైనా ముస్లింలు చాలా మంది పాకిస్థాన్ కి వెళ్ళారు, అందువల్ల ముస్లింలలో పేదవాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాము ( ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ). మైనారిటీలం కాబట్టే మాకు సరైనా అవకాశాలు దొరకడం లేదు అనే భావన చాలా మంది లో ఉంది, కాని అది కేవలం రాజకీయనాయకులు సృష్టి మాత్రమే, రాజకీయాలు, ఆటలు, సినిమాలలో ( చెప్పాలంటే బాలివుడ్ మొత్తం వారిదే) ముస్లింలను ఎంతో మందిని చూడవచ్చు. ఇక అజారుద్దీన్ లాంటి వారు 'మైనారిటీలమనే మా మీద వివక్ష' అని నాటకాలాడటం, మతం అడ్డం పెట్టుకొని MIM వాళ్ళు రౌడీయిజం చేయడం లాంటి వాటి వల్ల ప్రజలలోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయి. ఈ విషయాన్ని కూడా ముస్లింలు గుర్తించాలి.

అంతర్జాలంలో వెతుకుతూ ఉంటే ఈ లింక్ దొరికింది. హిందు-ముస్లిం వివాదాలతో పాటు కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. అందులో చాలా విషయాలు అవును కదా అని అనిపించాయి. ఉదాహారణకి, పోలీసులు ఉద్యోగంలో చేరక ముందు నుండి ఉన్న నమ్మకాలని (దేవుడు, మతం....) వారు మార్చుకోరు. అందువల్ల హిందు-ముస్లిం గొడవలు జరిగేప్పుడు పోలీసులు హిందువుల పక్షాన ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలలో సంస్కరణలు అవసరం. ఇదే ప్రశ్న పోలీసులని అడిగితే గొడవలు జరిగేప్పుడు ఎవరు aggressive గా ఉంటే వారిని control చేయడానికి ప్రయత్నిస్తాం అంటారు.

పరిస్థితులన్ని చక్కబడి అందరూ ఒక కుటుంబంలా ఉండాలని కోరుకుంటూ...
సర్వేజనా సుఖినోభవంతు !!!

ఫుజి పర్వతారోహణం - 4 (చివరి భాగం)  

Posted by ప్రపుల్ల చంద్ర in ,



శిఖరం మీద ముఖ్యంగా చూడవలసినది crator, అక్కడి నుండే లావా వెదజల్లింది. అది చాలా లోతుగా ఉంది !!!. 300 సంవత్సరాల క్రితం లావా అక్కడి నుండే వచ్చింది. ఇప్పుడు అంతా ఏదో తెలుపు రంగులో ఉంది.



ఫుజి పర్వతం నేషనల్ పార్క్ గా గుర్తించబడినది, కాబట్టి ఎక్కడ కూడా టెంట్ వేసుకోకూడదు. కొద్ది సేపటి తరువాత మళ్ళీ మా తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. అంతా మట్టి మట్టిగా ( లావా బూడిదలా ) ఉంది. మట్టి అయ్యేసరికి జారుతూ ఉంది. అలా అయితే కొద్దిగా తొందరగా వెళ్ళొచ్చు. పాము మెలికలలా ఉంది దారి అంతా. నడుస్తూ ఉంటే దుమ్ముంతా పైకి లేస్తూ ఉంది, అందువల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాము.



నడిచివస్తూ ఉంటే ఒక గమ్మత్తైన దృశ్యం కనపడింది, మేఘాలు క్రింది నుండి పైకి వెళ్తున్నాయి, అవి పర్వతం ఎక్కుతున్నట్టుగా అనిపించింది.



తిరుగుప్రయాణం కూడా చాలా సేపు అనిపించింది. అలా మొత్తానికి మా ఫుజి యాత్ర ముగించాము. మొదటి టపాలో చెప్పినట్టు 'He who climbs Mount Fuji once is a wise man. He who climbs it twice is a fool' అని ఎందుకో అర్ధం అయ్యింది. ఇక్కడి కవులు ఫుజిపర్వతం గురించి ఇలా అంటారు, " కొన్నింటి అందాన్ని దూరం నుండి చూసి ఆనందించాలి, దగ్గరకి వెళ్ళి చూడలనుకోకూడదు". ఎందుకంటే ’ఫుజి’ దూరం నుండి చూస్తే చాలా అందంగా ఉంటుంది, దగ్గరికి వెళితే అంతా బూడిద, మట్టి, దుమ్ము.
కాని ఇప్పటికీ ’ఫుజి’ ఎప్పుడు గుర్తు వచ్చిన ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది, అది ఎప్పటికీ మరిచిపోలేని యాత్ర !!!

చిత్రాలపై క్లిక్ చేస్తే మంచిగా చూడవచ్చు...

ఫుజి పర్వతారోహణం - 3 ( మేఘాలలో..... )  

Posted by ప్రపుల్ల చంద్ర in ,

అలా 3.30 గంటల నుండి సూర్యోదయం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాము. చలి కూడా చాలా ఉంది. అప్పటికే మా వాళ్ళు చాలా అలసిపోయి నిద్రపోవడం మొదలుపెట్టారు. నేను మాత్రం కెమరా పట్టుకొని ఎదురుచూస్తూ కూర్చున్నాను. నెమ్మదిగా ఆకాశం ఎర్రగా అవుతూ, కొద్ది కొద్దిగా క్రింద ఉన్న మేఘాలు మంచిగా కనపడుతూ వచ్చాయి. అంత ఎత్తులో, ప్రపంచంలో మొదటి సూర్యోదయాన్నిచూడటం మాత్రం ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. అక్కడ నేను, నా మిత్రులు తీసిన ఫోటోలు చూడండి.











చుట్టూ మేఘాలు మధ్యలో మేము, మేఘాలు పరుపులలా మొత్తం పరుచుకొని ఉన్నాయి. చిన్నప్పుడు మేఘాలు పరుపులలా ఉంటాయి, వాటి మీద నడవవచ్చు అని అనుకునేవాడిని. అలాగే ఉంటే ఎంచక్కా సూర్యుడి వరకు నడుస్తూ వెళ్ళొచ్చు కదా !!!.



అలా తనివితీరా చూసిన తరువాత శిఖరాన్ని చేరడానికి మళ్ళీ మా నడక మొదలుపెట్టాము. జనాభా కూడా అంతకు అంత పెరిగిపోయింది. మళ్ళీ రాత్రి లా తయారయ్యింది పరిస్థితి, రెండడుగులు వెయ్యడం నిమిషం ఆగిపోవడం. కొందరు ఆక్సిజన్ సరిప్పోక అవస్థలు పడుతూ కనపడ్డారు, ఆక్సిజన్ బాటిల్స్ తో పఫ్ తీసుకుంటున్నారు అనుకోండి అది వేరే విషయం. మొత్తానికి 20 నిముషాలు ఎక్కవలసింది 2 గంటలు పట్టింది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మధ్యలో తప్పిపోయిందనుకున్న అమ్మాయి ’స్వాతి’ మా కన్నా ముందే శిఖరానికి చేరుకొని మా కోసం ఎదురుచూస్తూ ఉంది!!!.



మొత్తానికి విజయవంతంగా పర్వతారోహణాన్ని ముగించాము. పైనే కాసేపు విశ్రాంతి తీసుకున్నాము. శిఖరం మీద ఒక తోరి ఉంది ( మనభాషలో చెప్పాలంటే తోరణం ).
మిగతా విశేషాలు వచ్చే టపాలో.

ఫుజి పర్వతారోహణం - 2  

Posted by ప్రపుల్ల చంద్ర in ,

మొదటిభాగం.... తరువాత

మా దగ్గరి నుండి ఒక రెండు గంటల ప్రయాణం తరువాత మధ్యాహ్నం 3:30 గంటలకు ’కవగుచికొ’ చేరుకున్నాము. అక్కడి నుండి ఫుజి 5వ స్టేషన్ కి బస్సులు ఉంటాయి. ఆ రోజు చాలా వేడి గా ఉంది. అక్కడి నుండి బస్సు ప్రయాణం చాలా బాగుంది. ఒక అడవిలా ఉంది అంతా, చుట్టూ చెట్లు, మధ్యలో నుండి వెళ్ళే ఘాట్ రోడ్డు చాలా బాగుంది. బస్సు అక్కడి నుండి 2300 మీటర్ల ఎత్తులో ఉన్న 5వ స్టేషన్ కి చేరుకుంది. అక్కడ కొద్దిగా చల్లగా ఉంది.



జపాన్ లో మేము ఒక 8 మంది బ్యాచ్, ఎక్కడికి వెళ్ళినా అంతా కలిసే ఉంటాము. మాతో పాటు మా కొలీగ్ స్వాతి అనే అమ్మాయి కూడా వచ్చింది. అలా 9 మందిమి ఒక గంట ఫోటో సెషన్ అయ్యాక, కొద్దిగా ఫలహరం తిన్నాము. అక్కడి నుండి ఫుజి చిన్నగా అనిపించింది, మరి 2300 మీటర్ల ఎత్తులో ఉన్నాము కదా!. క్రింద కనపడుతున్న మేఘాలను చూసి మేమే పైన వున్నాం అంటూ వెక్కిరిస్తుంటే, ఇంకా పైన ఉన్న మేఘాలు ’మీకంత సీన్ లేదమ్మా’ అన్నాయి, వాటి సంగతి కూడా చెబుతామని పర్వతారోహణం మొదలు పెట్టాము. అలా సాయంత్రం 6 గంటలకి మా ప్రయాణం మొదలు పెట్టాము. పైకి వెళ్ళడానికి 6-8 గంటలు పడుతుంది, సూర్యోదయం ఇంకా 10 గంటలు ఉంది కాబట్టి నెమ్మదిగా ఆడుతూ పాడుతూ వెళ్ళాలని నిశ్చయించుకున్నాము.



ఇలాంటి ప్రయాణాలలో మంచి జట్టు ఉండాలి. ఈ విషయంలో నేను మాత్రం అదృష్టవంతుడిని, ఒకరికోసం ఒకరం ఆగుతూ, అక్కడక్కడా సేద తీరుతూ, కబుర్లు చెప్పుకుంటూ చాలా సరదాగా ఎక్కాము. మొదట్లో కొద్దిగా వాలుగా ఉండి మామూలు మట్టి ఉంది, ఎక్కడం కొద్దిగా సుళువుగా అనిపించింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు అయ్యేసరికి మెదడుకి తప్ప శరీరానికి పెద్దగా పనిలేకుండా పోయింది, కొద్దిసేపటికే అలుపు వచ్చేసింది :( ( కొద్ది రోజుల ముందే క్రికెట్, ఈత మొదలు పెట్టామనుకోండి అది వేరే విషయం, లేకపోతే ఒక్కసారే మహాపర్వతం ఎక్కడం కష్టం అని). కొద్ది దూరం వరకు మెట్లు ఉండి ప్రక్కన చిన్న గోడలాగా ఆధారం ఉంది. చందమామ కూడా మాతోపాటే ఉన్నాడు మమ్మల్ని గమనిస్తూ !! ( ఆ రోజు వ్యాసపూర్ణిమ తరువాతి రోజు ).



మధ్య మధ్య లో జపనీయులు ’గంబత్తె కుడసయి’ ( keep your chin up, do well ) అంటూ ప్రోత్సహిస్తూ ఉన్నారు, మేమూ వాళ్ళకి చెప్పామనుకోండి. నాకు జపనీయులలో చాలా నచ్చే విషయం, తెలియని వారిని కూడా ఎప్పుడూ నవ్వుతూ పలకరించడం. ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. భారతీయులు చాలా మంది వచ్చారు.

వీడియో గేమ్ లో లెవెల్ పెరిగినట్టుగా మాములు దారి అయిపోయి లావా గడ్డకట్టి ఉన్న ఎగుడుదిగుడు దారి వచ్చింది. అక్కడ కొద్దిగా కుస్తీ పడాల్సి వచ్చింది. చల్లదనం కూడా పెరుగుతూ వచ్చింది. గ్లోవ్స్, జర్కిన్ లు వేసుకున్నాము. అలుపు తగ్గడానికి పాటలు పాడుతూ వెళ్ళాము, జపాన్ వాళ్ళు కూడా బానే విన్నారు ( భరించారు !!! ) మా పాటలు.



అలా అలా 10.30 గంటలకి 8వ స్టేషన్ కి చేరుకున్నాము. అక్కడి నుండి శిఖరం చేరడానికి ఇంకో రెండు, మూడు గంటలు తీసుకుంటుందని చెప్పారు. అంత తొందరగా పైకి వెళితే అక్కడ చలికి తట్టుకోవడం కష్టం అని ఉన్న 8వ స్టేషన్ (హట్) దగ్గరే కొంత సేపు ఉండి వెళ్ళాలని అనుకున్నాము. అక్కడే వెన్నెల్లో, 3300 మీటర్ల ఎత్తులో, మేము తెచ్చుకున్న భోజనం తిన్నాము ( moon light dinner :) ). అదో గొప్ప అనుభవం. అక్కడ నుండి క్రిందకు చూస్తే మాత్రం చాలా భయానకంగా ఉంది. అక్కడే చాలా సేపు గడిపి (ఒక కునుకు తీసి) మళ్ళీ ఎక్కడం మొదలుపెట్టాము.

చలి తీవ్రత పెరుగుతూ వెళ్ళింది, చలితో పాటు ఉదృతంగా గాలి కూడా ఉంది. తెచ్చుకున్న ఊలు టోపి చలిని ఆపలేకపోయింది, కొద్దిగా తలనొప్పి మొదలయ్యింది. లాభం లేదని ముఖానికి కర్చీఫ్, చెవులను కప్పుతూ టవల్ కట్టుకున్నాను. చూడడానికి ఒక మిలిటెంట్ లా తయారయ్యాను. ఎక్కుతూ ఉంటే శక్తి కూడా తగ్గుతూ వచ్చింది. 3350 మీటర్ల ఎత్తు వెళ్ళిన తరువాత మా స్నేహితుడికి వాతావరణం పడలేదు, పాపం అక్కడే ఆగిపోయాడు. కొద్దిగా భాదగా అనిపించింది, కాని అంత దూరం వెళ్ళాం అని మళ్ళీ ఎక్కడం మొదలు పెట్టాము. జనాభా కూడా చాలా పెరిగిపోయింది. నెమ్మదిగా నడవాల్సి వచ్చింది. అక్కడ ఒక western ఆవిడ కనపడింది చిన్న షార్ట్, పలుచని టి-షర్ట్ వేసుకొని !!, మేము కళ్ళు తప్ప శరీరంలో అన్ని భాగాలు కప్పేసుకున్నా, మాకు చాలా చలిగా ఉంది. ఆమె మాత్రం చాలా తాపీగా నడుస్తోంది.



ఒకానొక సమయం లో గాలి ఎంత పెరిగిపోయిందంటే, ఆ గాలికి క్రింద పడిపోతామా అనిపించింది, క్రింద మట్టి కూడా జారుతోంది. ప్రక్కన చూస్తే పెద్ద లోయలా ఉంది. కొద్దిగా భయం వేసింది !!! అలా 3450 మీటర్ల ఎత్తు ఎక్కేసరికి 2.30 అయ్యింది. అంత మంది ఉన్నా మేము 8 మంది ఒకరికోసం ఒకరు ఆగుతూ దాదాపు గుంపుగానే వెళ్ళాము. 3.30 అయ్యేలోపు పైకి వెళ్ళాలని మా వాళ్లని తొందరపెట్టడం మొదలుపెట్టాను. ఒక్కచోట కూడా విశ్రాంతి తీసుకోలేదు నేను. అలా వెళ్ళడం చాలా కష్టం అయ్యింది. ఒక సమయం లో నాకు మా వాళ్ళు ఎవరూ కనపడలేదు, క్రింద ఇసుక మరీ జారుతూ ఉంది, దానికి తోడు గాలి. ఒంట్లో శక్తి లేకుండా పోయింది. ఇలా అయితే శిఖరం చేరడం కష్టం అనుకొని, ఒక ప్రక్కన కూర్చొని, బ్యాగ్ లో నుండి చాక్లెట్ తీసి, తిని, కొద్దిగా నీళ్ళు త్రాగి ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాను. తరువాత మళ్ళీ నడక మొదలు పెట్టాను, కొద్ది దూరంలోనే మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. హమ్మయ్యా అనుకున్నాను. కాని మాతో వచ్చిన అమ్మాయి మాత్రం ఎంత సేపు ఎదురుచూసినా కనపడలేదు. అంతకు ముందే ’నా వల్ల కాదు, ఆగిపోతాను’ అంది, అలాగే ఆగిపోయి మా స్నేహితుడి (మధ్యలో ఆగిపోయిన స్నేహితుడు) దగ్గరికి వెళ్ళిపోయుంటుందని మేము మళ్ళీ ఎక్కడం మొదలు పెట్టాము. కాని చాలా మంది ఉండే సరికి ఒక అడుగు వేస్తే మళ్ళీ ఇంకో అడుగుకోసం రెండు నిముషాలు ఆగాల్సి వస్తూ వచ్చింది, నాకు తిరుపతిలో ఉన్నట్టుగా అనిపించింది. అలా కష్టపడి 3700 మీటర్ల ఎత్తు ఎక్కేసరికి 3.30 అయ్యింది, ఇంకో 76 మీటర్లు ఎక్కితే శిఖరం చేరుకోవచ్చు, కాని అక్కడ పరిస్థితి చూస్తే ఒక 2 గంటలు పట్టేట్టుంది. ఇలా అయితే సూర్యోదయం సరిగ్గా చూడలేము అనుకొని, అక్కడే ఒక మంచి ప్రదేశం చూసుకొని కూర్చున్నాము.

సూర్యోదయం, శిఖరం విశేషాలు వచ్చే టపాలు.....

ఫుజి పర్వతారోహణం - 1  

Posted by ప్రపుల్ల చంద్ర in ,



చూడడానికి చాలా అందంగా ఉంది కదా, మంచు టోపీ పెట్టుకొని !! బొమ్మలలో గీసినట్టుగా, పర్వతం అంటే ఇలాగే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది ఫుజి పర్వతం. వాతావరణం మంచిగా ఉన్నప్పుడు టొక్యొ నుండే కనపడుతుంది. జపాన్ లోనే ఎత్తైన పర్వతం కాబట్టి చాలా గంభీరంగా, హుందాగా కనపడుతుంది !!!. జపాన్ కి వెళ్ళినప్పడి నుండి ఫుజి పర్వతం ఎక్కాలని చాలా కోరికగా ఉండేది. కాకపోతే ఎక్కడానికి అనుమతి కేవలం వేసవి కాలంలోనే ( జూలై, ఆగష్ట్ నెలల్లో ) ఉంటుంది. నేను వెళ్ళేప్పటికే వేసవి అయిపోయింది. వేసవిలో తప్ప మిగతా కాలం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి తరువాతి వేసవి వరకు వేచి చూడాల్సి వచ్చింది.

ఫుజి పర్వతాన్ని జపాన్ వాళ్ళు ’ఫుజియమ’ లేక ’ఫుజిసాన్’ అని పిలుస్తారు. మనకు తాజ్ మహల్ లా జపాన్ వారి గుర్తుగా ఫుజి పర్వతాన్ని ఉపయోగిస్తారు ( symbol to represent Japan). వీరి కళలలో ( చిత్రలేఖనం, సాహిత్యం లలో ) ఫుజి చాలా కనపడుతుంది. ఫుజి 3776 మీటర్ల (12388 ft) ఎత్తైన పర్వతం, అంటే దాదాపు ఎవరెస్ట్ లో మూడో వంతన్నమాట. సంవత్సరానికి ఒక 2 లక్షల మంది వరకు ఫుజి పర్వతారోహణ చేస్తారు. అందులో 30 శాతం వరకు విదేశీయులే ఉంటారు. ప్రపంచంలో ఎక్కువమంది పర్వతారోహణ చేసేది ఇదేనేమో !!. ఇంకొక విశేషమేమిటంటే ఇది ఇంకా క్రియాశీలకం (active) గా ఉన్న అగ్నిపర్వతం. కాకాపోతే ఇంకో 200, 300 సంవత్సరాల వరకు బద్దలయ్యే అవకాశం లేదట. చివరిసారి 300 వందల సంవత్సరాల క్రితం లావా వెదజల్లింది. కొన్ని వేల సంవత్సరాలుగా మారుతూ మారుతూ ఇప్పుడు ఉన్న రూపానికి వచ్చిందట. ఫుజి పర్వతం చాలా అద్భుతంగా సమవిభక్తం (symmetrical) గా శంఖువు ఆకారంలో ఉంటుంది, అగ్నిపర్వతం అయ్యేసరికి అలా ఉందేమో, కాని అలా ఉండటం చాలా అరుదు. విమానం నుండి తీసిన ఈ ఫోటో చూడండి, మేఘాలు దూదిపింజల్లా ఫుజి పర్వతం చుట్టూ చేరాయి.



సాధారణంగా సూర్యోదయం చూసే విధంగా ( ఆ సమయానికల్లా శిఖరాన్ని చేరే విధంగా ) పర్వతారోహణం మొదలు పెడతారు. కాబట్టి సాయంత్రం బయలుదేరుతారు. ఫుజి ఎక్కడానికి 4 దారులు ఉన్నాయి. ’కవగుచికొ’ నుండి వెళ్ళే దారి చాలా ప్రాచూర్యమైనది. క్రింది నుండి ఒక్కో స్టేషన్ ఉంటుంది. మొదటి స్టేషన్ నుండి దాదాపు ఎవరూ నడక మొదలుపెట్టరు, సాధారణంగా అందరూ 5 వ స్టేషన్ నుండి ఎక్కడం మొదలుపెడతారు (అక్కడ పార్కింగ్ కోసం చాలా స్థలం ఉంటుంది). కేవలం 5 వ స్టేషన్ వరకే రోడ్డు ఉంటుంది, తరువాత అంతా కాలి నడకే. ఇది 2300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే 1500 మీటర్లే ఎక్కుతారు ( cheating... cheating.. అంటారా !!!, ఏం చేస్తాం అందరూ అలానే ఎక్కుతారు). అక్కడి నుండి శిఖరాన్ని చేరుకోడానికి దాదాపు 6-8 గంటలు పడుతుంది.

అగ్నిపర్వతం కాబట్టి మట్టి ( చిన్న చిన్న రాళ్ళతో ), అక్కడక్కడ బూడిద, గడ్డకట్టిన లావా వల్ల ఎగుడు దిగుడు (uneven) గా ఉండి ఎక్కడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. పైకి వెళ్తున్నాకొద్ది చల్లదనం పెరుగుతూ ఉంటుంది. ఆక్సీజన్ శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది ( ఇవి ఎక్కడైనా అంతే కదా అంటారా !!, సాధారణంగా ఇంతా పెద్ద పర్వతాలు ఎక్కం కాబట్టి ప్రత్యేకంగా, ముందు జాగ్రత్తగా చెబుతున్నానంతే ). శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు చిన్న చిన్న ఆక్సీజన్ డబ్బాలు తీసుకెళ్ళడం మంచిది. ఎత్తులు పడనివారు (altitude sickness ఉన్నవారు) కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, పీడనం (pressure) లో తేడాల వలన తల నొప్పి లాంటివి వస్తూ ఉంటాయి. రాత్రి గనక ఎక్కితే టార్చ్ లైట్లు పట్టుకెళ్ళడం మంచింది, దారిలో ఎక్కడా లైట్లు ఉండవు. పైన చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వెచ్చగా ఉండే బట్టలు వేసుకెళ్ళాలి. జపాన్ లో వేసవి చాలా వేడిగా ఉంటుంది, కాబట్టి ఆ బట్టలు పర్వతం క్రింద ఉన్నప్పుడు వేసుకోవడం కష్టం. మొత్తానికి బట్టలు, తినే పదార్ధాలు ( జపాన్ ఆహరం తినే వారికి సమస్య ఉండదనుకోండి అది వేరే విషయం), ఇలా సరంజామా చాలానే తీసుకువెళ్ళాలి. దారి మధ్యలో అక్కడక్కడ హట్ లు ఉంటాయి, అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవచ్చు, తినడానికి పదార్ధాలు కూడా దొరుకుతాయి.

జపాన్ వారు ఫుజి పర్వతాన్ని చాలా గౌరవిస్తారు (అసలే ప్రకృతి ఆరాధకులు కదా !). వీరికి ఫుజి పర్వతం ఎక్కాము అని చెబితే ’ఆఆఆఁ..... ’ అని ఆశ్చర్యపడతారు. ఎవరెస్ట్ ఎక్కామని చెప్పినా అంత ఆశ్చర్యపడరేమో!. జపాన్ వారి ఒక నానుడి ఉంది, 'He who climbs Mount Fuji once is a wise man. He who climbs it twice is a fool' అని, అది ఎందుకని చివర్లో తెలుస్తుంది లేండి. ఫుజి పర్వతం అందంగా చూడటానికి 36 వేర్వేరు విధాలుగా ( వివిధ ప్రదేశాల నుండి వివిధ వాతావరణాలలో ) ఎలా చూడాలని ఇక్కడ ఉంది చూడగలరు. క్రింది రెండు ఫోటోలు జపాన్ లో చాలా చోట్ల చూడవచ్చు. మొదటిది వసంతకాలంలో ఫుజి పర్వతానికి సమాంతరంగా వెళ్తున్న బుల్లెట్ ట్రైన్. రెండవది ఒక పెద్ద సముద్రపు అల వెనకాల దూరంగా, చిన్నగా కనపడే ఫుజి పర్వతం, దీన్ని the great wave off kanagawa అంటారు.





ఎక్కేముందు ముందుగా చూసుకోవలసిన ముఖ్య విషయం వాతావరణం. అక్కడ చాలా తొందరగా వాతావరణం లో మార్పులు వస్తాయి. కాబట్టి ముందుగా ఊహించడం కొద్దిగా కష్టమే. ఆకాశం నిర్మలంగా ఉంటేనే వెళ్ళడం మంచిది, మంచు ( మేఘాలు అనాలేమో !!) ఉంటే చాలా కష్టం, సూర్యోదయం కాదు కదా ప్రక్కన ఉన్న మనిషి కూడా కనపడడు. అంత కష్టపడి ఎక్కిన తరువాత అలా జరిగితే చాలా భాధ పడాల్సివస్తుంది. ఇక వర్షం పడితే అంతే సంగతులు, చలి చంపేస్తుంది, తల దాచుకోవడానికి ఏమి ఉండవు. రెండు సంవత్సరాల క్రితం వాతావరణం అంతా మంచిగా చూసుకొని మా కొలీగ్స్ వెళ్తే, అనుకోకుండా వర్షం పడి చాలా అవస్థలు పడ్డారట.
మొత్తానికి మేము కూడా అన్నీ చూసుకొని జూలై 19 రోజు వెళ్దామని నిర్ణయించుకున్నాము. ఆ యాత్రా విశేషాలు వచ్చే టపాలో.

మొదటి రెండు ఫోటోలు flicker నుండి, తరువాత రెండు వికీ నుండి తీసుకున్నవి.