గాలిపటాలు, వాటితో నా ఙ్ఞాపకాలు  

Posted by ప్రపుల్ల చంద్ర inసంక్రాంతి అంటే అందరికి భోగి మంటలు, ముగ్గులు, గొబ్బిల్లు, గంగిరెద్దులు గుర్తుకువస్తాయి. నాకు మాత్రం వీటితో పాటు గాలి పటాలు గుర్తుకువస్తాయి. చిన్నప్పుడు చాలా ఎగురవేసేవాళ్ళం, సంక్రాంతి కి నెలరోజుల ముందు నుండి ఉండేది మా హడావుడి, ఎప్పుడు సంక్రాంతి సెలవులు వస్తాయా అని ఎదురుచూసేవాడిని. కాని ఈ మధ్య ఎక్కడా గాలిపటాల హడవుడి అంతగా లేదు. ఇప్పుడు పిల్లలు ( మా బంధువులలో నేను చూసినంత వరకు అందరూ ) పోగో, జెటిక్స్ అంటూ కార్టూన్స్ చూస్తూ ఇంటి బయటికే రావడం లేదు, మన చిన్నప్పుడు అవి ఉంటే మనం కూడా అలాగే తయారయ్యేవాళ్లమేమో, మన అదృష్టం కొద్దీ అప్పుడు అంత అభివృద్ది చెందలేదు. హాయిగా బయటే ఆడుకునేవాళ్లం. ఇక వెన్నెల్లో ఆడిన ఆటలు ఎప్పుడూ మరచిపోలేము. సంక్రాంతి సెలవుల్లో మాత్రం ఎప్పుడూ డాబా పైనే ఉండేవాళ్ళం. గాలిపటాలతో నా జ్ఞాపకాలను పంచుకోవాలనే నా ప్రయత్నమే ఈ టపా. ఇక నేను చెప్పబోయే కొన్ని పదాల గురించి హైదరాబాద్ వాళ్ళకి, హైదరబాద్ చుట్టుప్రక్కల వాళ్లకి ఎక్కువ తెలిసే అవకాశం ఉంది, తెలంగాణా ప్రాంతం వాళ్ళకి కాక వేరే వారికి తెలియదనుకుంటాను. ఇవి తెలిసిన వారికి గుర్తు చేయడానికి, తెలియని వారు తెలుసుకోవడానికి.మేము గాలిపటాలని పతంగులు అంటాం. సంక్రాంతి సమయంలో గాలిపటాలు అమ్మడానికి కొత్త కొత్త దుకాణాలు వెలిసేవి, వేరే దుకాణాలలో కూడా అమ్మేవారు. అన్నీ రంగురంగుల పతంగులతో కలకలలాడేవి ఒక నెల రోజులు. రకరకాల పతంగులు దొరికేవి, వాటి మీద ఉండే గుర్తులను బట్టి వాటి పేర్లు ఉండేవి. గుడ్డు పతంగి ( పతంగి మధ్యలో వృత్తాకారంలో గుర్తు ఉంటే), రెండు గుడ్ల పతంగి, నామం పతంగి, కత్తెర పతంగి, టోపి పతంగి, జెండా పతంగి (రెండు, మూడు రంగులతో జెండాలా ఉంటే ) ఇలా రకరకాల పతంగులు ఉండేవి, మళ్ళీ ఈ గుర్తులు కూడా రెండు, మూడు ఒకే పతంగీలో ఉండేవి అంటే రెండు గుడ్లు ఉండి క్రింద కత్తెర గుర్తు అలా. పతంగి రంగులు, గుర్తుల రంగులతో వాటిని పిలిచేవాళ్ళం. తరువాత ప్లాస్టిక్ కవర్లతో చేసిన పతంగులు, ఎవేవో బొమ్మలు ముద్రించిన పతంగులు ఇలా వచ్చాయి కాని చూడడానికి అంత బాగుండేవి కావు. పెద్ద పెద్ద పతంగులని ’డోరీ’ అనేవాళ్ళం. అవి చాలా సన్నని కాగితం తో చేయబడి చుట్టూ దారం అతికించి ఉండేవి. మేము కూడా అప్పుడప్పుడు తయారు చేసేవాళ్ళం, కాని అవి కొద్దిగా బరువుగా ఉండేవి. అప్పుడప్పుడు అవి ఎగిరేవి కూడా కావు.

పతంగులను నియంత్రించడానికి కట్టే దారాన్ని ’కార్ణాలు’ అనే వాళ్లం. ఇది కట్టే విధానాన్ని బట్టి పతంగులు ఎగురుతాయి. ఒక రకంగా కడితే పతంగి బొమ్మలా గాలిలో కదలకుండా నిలబడేది, వాటిని ’బొమ్మ కార్ణాలు’ అంటారు. సరదాగా అప్పుడప్పుడు అలా కట్టి ఎగరవేసి చాలా దూరం పోనిచ్చి, అలాగే గాల్లో ఉంచి, డాబా పై నుండి క్రిందికి వెళ్ళి అమ్మతో గొప్పగా చెప్పుకునేవాణ్ణి. అప్పుడప్పుడు పతంగులు సరిగ్గా ఎగరడానికి తోకలు అతికించవలసి వచ్చేది.పతంగుల మధ్య పోటీని ’పేంచ్’ అంటారు (ఒకదానితో మరొకటి కోయడం). దాని కోసం గట్టి దారం ( మాంజా ) కొనేవాళ్లం, అవీ రకరకాల రంగులలో దొరికేవి. పాలపిట్ట రంగు మాంజా, పసుపు రంగు మాంజా ఇలా చాలా రకాలు ఉండేవి. ఏది మంచిదో తెలుసుకొని ఎప్పటికప్పుడు కొత్తకొత్తవి కొనుక్కునేవాళ్ళం. మేము కూడా గాజుపెంకులు నూరి, కలమంద, అన్నం ముద్ద అన్నీ కలిపి దారానికి రుద్ది మాంజా తయారుచేసేవాళ్ళం.

ఇక ఈ పేంచ్ లో రకరకాల పద్దతులు ఉండేవి. ముఖ్యంగా పతంగి కొద్దిగా బరువుగా ఉండి మంచి మాంజా ఉండాలి. రెండు పతంగులు ముడిపడ్డ తరువాత దారం పదునుని బట్టి ఎదో ఒకటి వెంటనే తెగిపోతుంది. ఒకవేళ రెండూ సమానంగా ఉంటే మాత్రం చాలాసేపు పడుతుంది, దీన్ని ’మొండి పేంచ్’ అనేవాళ్ళం. దారాన్ని వదులుతూ, దారాన్ని లాగి మళ్ళీ వదిలి (దీన్ని ’కీంచ్ కట్’ అనే వాళ్ళం), బలంగా దారాన్ని లాగడం ఇలా ఒక్కో దారాన్ని బట్టి ఒక్కోలా చేసి అవతలి వారి దారాన్ని కోసేవాళ్ళం. వాళ్ళ పతంగి తెగిపోతే ’అఫా’ అని గట్టిగా అరిచేవాళ్ళం. అప్పుడప్పుడు దారాన్ని లాగుతూ ఉంటే అవతలివారి పతంగి మన చేతికి వస్తే దాన్ని ’లుప్టా’ చేయడం అంటారు. ఇలా చేయడం వల్ల గొడవలు కూడా జరిగేవి. పేంచ్ చేసేప్పుడు ముఖ్యమైంది పక్కన ఉండి దారం అందించేవాళ్ళు. ’చరఖా’ పట్టుకొని దారం వదలడం ( మేము రీల్ వదలడం అనేవాళ్ళం), దారాన్ని తొందరగా చుట్టడం (దీనికీ కొన్ని పద్దతులు ఉండేవి), దారం చిక్కులు పడకుండా చూసుకోవడం వీరి భాద్యత. మా అన్నయ్య ఎగిరేసేప్పుడ్డు నేనే చరఖా పట్టుకునేవాడిని.

పతంగులు ఎగిరేసేటప్పుడు చెట్లకు, స్తంభాలకి తట్టుకుంటూ ఉండేవి. అలా తట్టుకుంటే మాములుగా అయితే కర్రలతో తీసేవాళ్ళం. లేకపోతే దారానికి కొద్దిగా బరువున్న రాయిని కట్టి ( దీన్ని లండోరి అంటారు ), రాయిని జాగ్రత్త గా పతంగి దారం పై విసిరి లాగేవాళ్ళం. అప్పుడు మాంజా, దారం చాలా ఉండేది కాబట్టి లండోరి తయారు చేసుకొని పోటీలు కూడా పెట్టుకునేవాళ్ళం, ఎవరి దారం తెగిపోతే వారు ఓడిపోయినట్టు.

సంక్రాంతి ముందు రోజు మా ఊర్లో పెద్ద పతంగుల పోటీ జరిగేది. ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎవరి పతంగి ఏ రంగు, ఎవరు గెలిచారు, ఇలా చెబుతూ మైక్ సెట్స్ ద్వారా ప్రత్యక్ష వ్యాఖ్యానం (live commentry) ఉండేది. కాకపోతే మేము ఎప్పుడు పాల్గొనలేదు అందులో.

మొత్తానికి అలా ఒక నెలరోజులు బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం. పండగ రోజు ఇప్పటికీ మా స్నేహితులు ఎగురవేస్తారనుకుంటాను. కాని అప్పటిలా లేదు ఇప్పుడు. ఇప్పుడు చేయలేకపోయినా ఆ ఙ్ఞాపకాలు మాత్రం ఉన్నాయి.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

This entry was posted on Tuesday, January 13, 2009 at 2:50 AM and is filed under . You can follow any responses to this entry through the comments feed .

10 comments

అబ్బా..చాలా బాగా రాసారండి.. :)

January 13, 2009 at 6:33 AM

బావున్నయి..మీ పతంగుల విశేషాలు.
మేము గాలిపటాలు సొంతంగా తయారు చేసేవాళ్ళం న్యూస్ పేపర్లతోటి. :)

January 13, 2009 at 10:26 AM

బాగా రాసారండి.ఈ పేర్లు ఒక్కటి కూడా నాకు తెలియదు.గాలిపటాలు మేమూ న్యూస్ పేపర్లతోటి చేసేవాళ్ళం.తరువాత షాపుల్లో రంగు రంగుల కాగితాలుకొని చేసుకునేవాళ్ళం.దారానికి కొన్ని కాగితం ముక్కలు గుచ్చి వదిలేస్తే అవి దారంవెంట పైకి వెళ్ళేవి.వాటిని ఉత్తరాలు పంపడం అనేవాళ్ళం.

January 13, 2009 at 12:44 PM

@నేస్తం
నెనర్లు,

@మధు,
నెనర్లు,
న్యూస్ పేపర్లతో మేము కూడా అప్పుడప్పుడు చేసేవాళ్ళం ! మనం తయారు చేసింది ఎగురుతూ ఉంటే భలే ఆనందంగా ఉండేది.

@రాధిక,
నెనర్లు,
ఉత్తరాలు పంపడం నేను వినలేదు, కాని దారానికి అలా కాగితాలు అప్పుడప్పుడు సరదాగా కట్టేవాళ్ళం.

January 14, 2009 at 6:07 PM

maaku news peparlato cheyyatam maatrame vachchu,kaanimeeru cheppe viseshaalu vimte gaali pataalalo innirakaalaa ani anipistomdi

January 15, 2009 at 2:46 AM
This comment has been removed by the author.
January 15, 2009 at 5:30 AM

Manchi tapa Prapulla, chinnathanam lo enti paiki ekki galipatam vegareyadam entha saradhaga vundedho :))...I miss it now :)....nenu kuda news papers thoney galipatam chesey vadini :)...

January 15, 2009 at 5:33 AM

@durgeswara ,
నెనర్లు,
అవునండి చాలా ఉంటుంది... నెలరోజుల హంగామ కదా !!!
@Murali,
నెనర్లు,
మ్ మ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం..

January 17, 2009 at 6:56 AM

చరఖా, పేంచ్, మాంజా ఈ పదాలన్నీ విని కూడా చాలా రోజులయిపోతోందండీ, ఎంత బాగా వ్రాశారో!

February 11, 2013 at 11:29 AM

మీ పతంగుల సంగతుల ఆ'పాత'మధురాలతో అందంగా గగన విహారం చేయించారు. నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఎన్నో అందమైన ఆటలు ఆడుకున్నాం

July 6, 2014 at 5:52 AM

Post a Comment