చూడడానికి చాలా అందంగా ఉంది కదా, మంచు టోపీ పెట్టుకొని !! బొమ్మలలో గీసినట్టుగా, పర్వతం అంటే ఇలాగే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది ఫుజి పర్వతం. వాతావరణం మంచిగా ఉన్నప్పుడు టొక్యొ నుండే కనపడుతుంది. జపాన్ లోనే ఎత్తైన పర్వతం కాబట్టి చాలా గంభీరంగా, హుందాగా కనపడుతుంది !!!. జపాన్ కి వెళ్ళినప్పడి నుండి ఫుజి పర్వతం ఎక్కాలని చాలా కోరికగా ఉండేది. కాకపోతే ఎక్కడానికి అనుమతి కేవలం వేసవి కాలంలోనే ( జూలై, ఆగష్ట్ నెలల్లో ) ఉంటుంది. నేను వెళ్ళేప్పటికే వేసవి అయిపోయింది. వేసవిలో తప్ప మిగతా కాలం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి తరువాతి వేసవి వరకు వేచి చూడాల్సి వచ్చింది.
ఫుజి పర్వతాన్ని జపాన్ వాళ్ళు ’ఫుజియమ’ లేక ’ఫుజిసాన్’ అని పిలుస్తారు. మనకు తాజ్ మహల్ లా జపాన్ వారి గుర్తుగా ఫుజి పర్వతాన్ని ఉపయోగిస్తారు ( symbol to represent Japan). వీరి కళలలో ( చిత్రలేఖనం, సాహిత్యం లలో ) ఫుజి చాలా కనపడుతుంది. ఫుజి 3776 మీటర్ల (12388 ft) ఎత్తైన పర్వతం, అంటే దాదాపు ఎవరెస్ట్ లో మూడో వంతన్నమాట. సంవత్సరానికి ఒక 2 లక్షల మంది వరకు ఫుజి పర్వతారోహణ చేస్తారు. అందులో 30 శాతం వరకు విదేశీయులే ఉంటారు. ప్రపంచంలో ఎక్కువమంది పర్వతారోహణ చేసేది ఇదేనేమో !!. ఇంకొక విశేషమేమిటంటే ఇది ఇంకా క్రియాశీలకం (active) గా ఉన్న అగ్నిపర్వతం. కాకాపోతే ఇంకో 200, 300 సంవత్సరాల వరకు బద్దలయ్యే అవకాశం లేదట. చివరిసారి 300 వందల సంవత్సరాల క్రితం లావా వెదజల్లింది. కొన్ని వేల సంవత్సరాలుగా మారుతూ మారుతూ ఇప్పుడు ఉన్న రూపానికి వచ్చిందట. ఫుజి పర్వతం చాలా అద్భుతంగా సమవిభక్తం (symmetrical) గా శంఖువు ఆకారంలో ఉంటుంది, అగ్నిపర్వతం అయ్యేసరికి అలా ఉందేమో, కాని అలా ఉండటం చాలా అరుదు. విమానం నుండి తీసిన ఈ ఫోటో చూడండి, మేఘాలు దూదిపింజల్లా ఫుజి పర్వతం చుట్టూ చేరాయి.
సాధారణంగా సూర్యోదయం చూసే విధంగా ( ఆ సమయానికల్లా శిఖరాన్ని చేరే విధంగా ) పర్వతారోహణం మొదలు పెడతారు. కాబట్టి సాయంత్రం బయలుదేరుతారు. ఫుజి ఎక్కడానికి 4 దారులు ఉన్నాయి. ’కవగుచికొ’ నుండి వెళ్ళే దారి చాలా ప్రాచూర్యమైనది. క్రింది నుండి ఒక్కో స్టేషన్ ఉంటుంది. మొదటి స్టేషన్ నుండి దాదాపు ఎవరూ నడక మొదలుపెట్టరు, సాధారణంగా అందరూ 5 వ స్టేషన్ నుండి ఎక్కడం మొదలుపెడతారు (అక్కడ పార్కింగ్ కోసం చాలా స్థలం ఉంటుంది). కేవలం 5 వ స్టేషన్ వరకే రోడ్డు ఉంటుంది, తరువాత అంతా కాలి నడకే. ఇది 2300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే 1500 మీటర్లే ఎక్కుతారు ( cheating... cheating.. అంటారా !!!, ఏం చేస్తాం అందరూ అలానే ఎక్కుతారు). అక్కడి నుండి శిఖరాన్ని చేరుకోడానికి దాదాపు 6-8 గంటలు పడుతుంది.
అగ్నిపర్వతం కాబట్టి మట్టి ( చిన్న చిన్న రాళ్ళతో ), అక్కడక్కడ బూడిద, గడ్డకట్టిన లావా వల్ల ఎగుడు దిగుడు (uneven) గా ఉండి ఎక్కడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. పైకి వెళ్తున్నాకొద్ది చల్లదనం పెరుగుతూ ఉంటుంది. ఆక్సీజన్ శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది ( ఇవి ఎక్కడైనా అంతే కదా అంటారా !!, సాధారణంగా ఇంతా పెద్ద పర్వతాలు ఎక్కం కాబట్టి ప్రత్యేకంగా, ముందు జాగ్రత్తగా చెబుతున్నానంతే ). శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు చిన్న చిన్న ఆక్సీజన్ డబ్బాలు తీసుకెళ్ళడం మంచిది. ఎత్తులు పడనివారు (altitude sickness ఉన్నవారు) కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, పీడనం (pressure) లో తేడాల వలన తల నొప్పి లాంటివి వస్తూ ఉంటాయి. రాత్రి గనక ఎక్కితే టార్చ్ లైట్లు పట్టుకెళ్ళడం మంచింది, దారిలో ఎక్కడా లైట్లు ఉండవు. పైన చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వెచ్చగా ఉండే బట్టలు వేసుకెళ్ళాలి. జపాన్ లో వేసవి చాలా వేడిగా ఉంటుంది, కాబట్టి ఆ బట్టలు పర్వతం క్రింద ఉన్నప్పుడు వేసుకోవడం కష్టం. మొత్తానికి బట్టలు, తినే పదార్ధాలు ( జపాన్ ఆహరం తినే వారికి సమస్య ఉండదనుకోండి అది వేరే విషయం), ఇలా సరంజామా చాలానే తీసుకువెళ్ళాలి. దారి మధ్యలో అక్కడక్కడ హట్ లు ఉంటాయి, అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవచ్చు, తినడానికి పదార్ధాలు కూడా దొరుకుతాయి.
జపాన్ వారు ఫుజి పర్వతాన్ని చాలా గౌరవిస్తారు (అసలే ప్రకృతి ఆరాధకులు కదా !). వీరికి ఫుజి పర్వతం ఎక్కాము అని చెబితే ’ఆఆఆఁ..... ’ అని ఆశ్చర్యపడతారు. ఎవరెస్ట్ ఎక్కామని చెప్పినా అంత ఆశ్చర్యపడరేమో!. జపాన్ వారి ఒక నానుడి ఉంది, 'He who climbs Mount Fuji once is a wise man. He who climbs it twice is a fool' అని, అది ఎందుకని చివర్లో తెలుస్తుంది లేండి. ఫుజి పర్వతం అందంగా చూడటానికి 36 వేర్వేరు విధాలుగా ( వివిధ ప్రదేశాల నుండి వివిధ వాతావరణాలలో ) ఎలా చూడాలని ఇక్కడ ఉంది చూడగలరు. క్రింది రెండు ఫోటోలు జపాన్ లో చాలా చోట్ల చూడవచ్చు. మొదటిది వసంతకాలంలో ఫుజి పర్వతానికి సమాంతరంగా వెళ్తున్న బుల్లెట్ ట్రైన్. రెండవది ఒక పెద్ద సముద్రపు అల వెనకాల దూరంగా, చిన్నగా కనపడే ఫుజి పర్వతం, దీన్ని the great wave off kanagawa అంటారు.
ఎక్కేముందు ముందుగా చూసుకోవలసిన ముఖ్య విషయం వాతావరణం. అక్కడ చాలా తొందరగా వాతావరణం లో మార్పులు వస్తాయి. కాబట్టి ముందుగా ఊహించడం కొద్దిగా కష్టమే. ఆకాశం నిర్మలంగా ఉంటేనే వెళ్ళడం మంచిది, మంచు ( మేఘాలు అనాలేమో !!) ఉంటే చాలా కష్టం, సూర్యోదయం కాదు కదా ప్రక్కన ఉన్న మనిషి కూడా కనపడడు. అంత కష్టపడి ఎక్కిన తరువాత అలా జరిగితే చాలా భాధ పడాల్సివస్తుంది. ఇక వర్షం పడితే అంతే సంగతులు, చలి చంపేస్తుంది, తల దాచుకోవడానికి ఏమి ఉండవు. రెండు సంవత్సరాల క్రితం వాతావరణం అంతా మంచిగా చూసుకొని మా కొలీగ్స్ వెళ్తే, అనుకోకుండా వర్షం పడి చాలా అవస్థలు పడ్డారట.
మొత్తానికి మేము కూడా అన్నీ చూసుకొని జూలై 19 రోజు వెళ్దామని నిర్ణయించుకున్నాము. ఆ యాత్రా విశేషాలు వచ్చే టపాలో.
మొదటి రెండు ఫోటోలు flicker నుండి, తరువాత రెండు వికీ నుండి తీసుకున్నవి.
8 comments
వహ్వా..ఇది బ్లాగ్లోకంలో 2వ ట్రెక్కుడు అనుకుంటా.."ఫు" అన్న అక్షరం (హీరాగానా) కూడా ఆ కొండ లానే ఉంటుంది కదా...
చంద్ర గారు మీరు నిజముగా నా జపాన్ విశేషాలన్ని రాస్తున్నట్లు ఉన్నది, కొంప తీసి నా డైరి మీ చేతిలో ఉన్నదా అని సందేహం వస్తుంది!!
పోయిన ఆగష్ట్ 15న నేను మా ప్రెండ్స్ కలసి ఫుజి పర్వతాన్ని ఎక్కినాము, అక్కడ చాలా మంది ఉన్నారు, రాత్రి 9 న మాతో పాటు ఓ పెద్ద చీమలదండు కదిలినట్లు కదిలారు. టార్చ్ లైట్లు కూడా అవసరం రాలేదు (మాకు చందమామ తోడుగా), మాకు 6 గంటలు పట్టినది (from 9pm to 3am), చివరి స్టేషన్ లో కొద్దిగా కష్టపడినాము (మాకు ఊతకర్ర లేదు). అప్పటికి పైన అంత జనం, ఒక జపనీస్ వల్లన మాకు సూర్యోదయం చూడటానికి మంచి place దొరికినది (ఇది చాలా అవసరం, అంత దూరం పోయి... ప్రపంచలో మొదటి సూర్యోదయం సరిగా చూడపోతే..). నా జీవితంలో అలాంటి సూర్యోదయం (at 3:30)నేను చూడలేదు అఖరుకు, నేను ఫోటోలు తీయటం మరిచి అలా ఉండిపోయాను. అక్కడ కొందరూ చైనా జెండా ఊపుతూ ఫోటోలకు ఫోజులు కొట్టినారు, మాకు అ అవకాశం లేదు (మా దగ్గర ఇండియా జెండా లేదుగా మరి)కనుక మేము జపాన్ జెండా తో ఫోజులు ఇచ్చినాము. పైన ఒక గుడి మరియి దానికి ఒక చర్రిత కూడ ఉంది. తిరిగి వచ్చే అప్పుడు మాస్క్ కావాలి(ఇది ఎవరూ చెప్పలేదు కాని, ఎదుటివాడి కాలి దుమ్ము మనం పీల్చకుండా). చివరిగా అంత అయిపోయిన తరువాత ఇంటికి వచ్చి, మా కాళ్లను తీసి ఓరోజు ప్రక్కన పెట్టాము. నాకు తలవంచిన మొట్టమొదటి అగ్నిపర్వతం ఇదే అని చెప్పాలి. Really, it's very good experience.
మరమరాలు
ప్రపుల్ల...జపాన్ గురించి చాలా ఓపిగ్గా రాస్తున్నారు.
Nice Job.
మీ టపాలకి సంభందం లేని ప్రశ్న, జపాన్లో రజనీకాంత్ కి చాలా ఫాలోఇంగ్ ఉంది అని అంటారు అది నిజమా ?
ప్రపుల్ల గారూ, మీ జపాన్ కబుర్లు simply suparb..
@bhagavan, @ఉమాశంకర్,
నెనర్లు,
@రవి ,
'ふ ' , అవునండి కొద్దిగా అలాగే ఉంటుంది.
@vikatakavi,
నెనర్లు, అంతేననుకుంటాను !!
@మరమరాలు ,
అలాగంటారా.....
మాకన్నా చాలా త్వరగా ఎక్కేసారు !!!, జెండా లేదని మేము కూడా అనుకున్నాము.
ఆ గుడి గురించి మాత్రం నాకు తెలియదు.....
సూర్యోదయం గురించి ఎంత చెప్పినా తక్కువే, దాని గురించి వ్రాయలి....
@రిషి,
నెనర్లు...
’ఒడరు మహరాజా’ (Dancing Maharaja) అని ’ముత్తు’ సినిమా బాగానే ఫేమస్ అయ్యింది. తరువాత వచ్చిన సినిమాలు కూడా పర్వాలేదు. ఫాలోయింగ్ ఉందా అంటే, మా కొలీగ్స్ లో కొందరికి తెలుసు, కొందరికి అస్సలే తెలియదు. ఆ సినిమా గురించి వాళ్లని అడిగితే, " suddenly dance, suddenly fight, hero is old but young at heart" లాంటి సమాధానాలు వచ్చాయి. ’బాబా’ సినిమాలో కూడా ఒక జపాన్ అమ్మాయి ఉంటుంది, ఇక్కడి ప్రేక్షకులను ఆకర్షించటానికి కావొచ్చు.
బాగున్నాయి మీ ఫుజి విశేషాలు.
మీ ట్రెక్కు విశేషాల కోసం ఎదురు చూస్తాను.
Post a Comment
టపాలు
నేను
- ప్రపుల్ల చంద్ర
- చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమి లేదు, శతకోటి బ్రహ్మీ లలో ఒక బ్రహ్మి. నా సరదా ఙ్ఞాపకాలను, ఆలోచనలను, చూసిన ప్రదేశాల విశేషాలను మీతో పంచుకోవాలనే ప్రయత్నమే ఈ బ్లాగ్.