అలా జపాన్ కి చేరుకున్న తరువాత, ఏయిర్ పోర్ట్ బయటికి వచ్చాను. బయటే వరుసగా బస్ టికెట్లు ఇచ్చే కౌంటర్లు ఉన్నాయి. జపాన్ కు మొదటిసారి వచ్చినప్పుడు చాలామంది ఈ బస్సులనే ఉపయోగిస్తారట. ’ల్యుమినిసెన్స్’ బస్సు లో ’యోకోహామా’ వరకు టికెట్ తీసుకున్నాను, అక్కడకి మా వాళ్ళు నాకోసం వస్తా అన్నారు.
వెళ్ళి అక్కడ ఉన్న లైన్లో నిలబడ్డాను. జపాన్ లో జూలై నుండి సెప్టెంబర్ వరకు వేసవి కాలం, నేను సెప్టెంబర్ మొదట్లో వచ్చాను, అయ్యేసరికి చాలా వేడిగా ఉంది. నాకు అదితెలియక చొక్కా మీద చొక్కా, మళ్ళీ దానిపై జర్కిన్ వేసుకున్నాను. చేతిలో బ్యాగులు ఉండే సరికి జర్కిన్ అలాగే వేసుకొని నిలబడ్డాను, బస్సు ఎక్కాక తీసేయొచ్చని.
బస్సు రావడం, క్రింద ఉండే లగేజ్ క్యాబిన్లో లగేజ్ పెట్టేసి ఎక్కి కూర్చోవడం జరిగిపోయాయి. ప్రక్కనే ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. అప్పుడు మొదలయ్యాయి అస్సలు కష్టాలు, వేసుకున్న జర్కిన్ విప్పేదామనుకుంటే, చేతులు పక్కకి అనడానికి కూడా స్థలం లేదు, అనుకోకుండా ఆ అమ్మాయికి చేయితగిలితే, అబ్బో ఎందుకులే లేని తలనొప్పి, అసలే భాష కాని భాష, మనకు కనీసం ’excuse me' అని కూడా జపనీస్ లో ఎలా అనాలో తెలియదు, ఇలాంటి చిన్న చిన్న పదాలకోసం తీసుకున్న printout క్రింద ఉన్న లగేజ్ లో ఉండిపోయింది, ఇక ఏం చేస్తాం అలాగే కూర్చున్నాను. లోపల మాత్రం ఉడికిపోతోంది !!! చెమట తో స్నానం అయిపోతోంది.
జపాన్ లో రోడ్లు చాలా శుభ్రం గా, విశాలంగా ఉన్నాయి ( అన్ని అభివృద్ది దేశాలలో ఇలాగే ఉంటుందేమో! ). వాహనాలు కూడా శుభ్రంగా ధృడంగా కనపడ్డాయి(ముఖ్యంగా ట్రక్కులు). రోడ్డు ప్రక్కన ఉండే కొండలు, గుట్టలు నున్నగా ఉన్నాయి. దూరపు కొండలు నునుపు అనుకుంటే దగ్గరి కొండలు కూడా నునుపు గా ఉన్నాయి!!!. రోడ్లు, వాహానాలు అయితే అలా ఉండటంలో ఆశ్చర్యం లేదు కాని కొండలు అలా ఎలా ఉన్నాయో అర్థం అవ్వలేదు. కొద్దిగా పరీక్షగా చూస్తే, సిమెంట్ తో అలా చేసినట్టుగా కనపడింది. అంటే ఆ నునుపు సహజ సిద్దం కాదన్నమాట!!, ఎందుకలా చేసారబ్బా అని ఆలోచిస్తూ ఉంటే, భారతదేశంలో అప్పుడప్పుడు వినబడే మాటలు గుర్తుకు వచ్చాయి, ’కొండ చెరియలు విరిగిపడి........’, ఓహ్ ఇందుకోసమా అనిపించింది. అభివృద్ది చెందిన దేశాలంటే ఇలా ఉంటాయా అని అనిపించింది, ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టరు. ఆ కొండలపై కొన్ని చోట్ల ఆకులు క్రింద పడకుండా వలలు కూడా వేసి ఉంచారు!!!.
అస్సలు ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్లు కూడా కనపడలేదు, ప్రత్యేకంగా వేసిన 'expressway' అనుకుంటాను, ఎక్కడా ఆగకుండా బస్సు వెళ్ళింది. కొన్ని కిలోమీటర్లు సముద్రం క్రింది నుండి వేసిన underground tunnel గుండా ప్రయాణించాము. ఇళ్ళు అన్నీ చిన్న చిన్న అగ్గిపెట్టల్లా కనపడ్డాయి, చాలా ఇరుకుగా, ఒక్కచోటే చాలా ఉన్నాయి. జపాన్ స్థలాభావం అని తెలిసింది, టోక్యోలో జనసాంద్రత చాలా ఎక్కువ. రోడ్లు కూడా ’రోడ్డు మీద రోడ్డు కట్టి పదహారు రోడ్లు కట్టి, ఏ రోడ్లో పోతవ్..... ’ ( బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి..... లా అన్నమాటా !!!) అన్నట్టుగా ఒకదానిపై ఒకటి ఉండి వేరు వేరు దారుల్లో వెళ్తున్నాయి.
ఒక 1 1/2 గంటల తరువాత ’యోకోహామా’ చేరుకున్నాను. నా కోసం నా సహోద్యోగి (మురళి), మా నాయకుడు (ప్రాజెక్ట్ లీడర్) వచ్చారు. రెండు నెలల ముందు వచ్చిన మా ప్రాజెక్ట్ లీడర్ పాపం బక్క చిక్కిపోయాడు. అసలే వచ్చే ముందు మా వాళ్ళు తిండి గురించి చాలా భయపెట్టారు, త్వరలో నేను కూడా అలా అవుతానేమో అనుకున్నాను. జపాన్ అంటే అందరు మనుషులు ఒకేలా ఉంటారు! గుర్తుపట్టడం కష్టమేమో అనుకున్నాను, కాని ఇక్కడికి వచ్చాక చూస్తే ఒక్కొక్కళ్లు ఒకలా ఉన్నారు, గుర్తుపట్టడం అంత కష్టమేమి కాదు!!!.
అక్కడి నుండి ఒక రైలు లో మేము ఉండే ప్రదేశానికి వెళ్ళాలి. మా ప్రాజెక్ట్ లీడర్ ’Mr.లవంగం’ అవతారం ఎత్తి జపాన్ లో ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో చెప్పడం (భయపెట్టడం) మొదలుపెట్టాడు. ఒకచోట ’ఎవరిని తగలకు, ఇక్కడ కొందరికి తిక్క ! కోపం వస్తే కేస్ వేస్తారు’ అని అన్నాడు, ఇంకా నయం ఉరితీయిస్తారనలేదు అని మనసులో అనుకున్నాను. తరువాత తరువాత ఇక్కడ వాళ్ళు చాలా మంచి వాళ్ళని తెలిసిందనుకోండి అది వేరే విషయం. రోజూ రైళ్లలో ప్రయాణిస్తే వింత వింత జనాలను చూడవచ్చట, కాని మా ఆఫీస్ మా రూమ్ దగ్గరే అయ్యేసరికి ఆ అవకాశం రాలేదు.
రైలు మాత్రం చాలా బాగుంది. ఎక్కగానే చల్లగా A/C గాలులు తగిలాయి. ఒక 15 నిమిషాల ప్రయాణం తరువాత మేము చేరవలసిన ప్రదేశం వచ్చింది. అక్కడ నుండి మా రూమ్ కి చాలా దూరం. రోడ్లన్నీ పద్దతిగా ఫుట్ పాత్ లతో, ట్రాఫిక్ సిగ్నల్లతో ఉన్నాయి. చిన్న చిన్న రోడ్లలో కూడా అలాగే ఉంది. ఒకచోట మేము రోడ్డు దాటాలి, దరిదాపుల్లో ఎవరూ కనపడలేదు, మన పద్దతిలో రోడ్డు దాటుదామనుకుంటే మా నాయకుడు ససేమిరా అన్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ వరకు నడిచి, అక్కడ గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఆగి అప్పుడు దాటాము. ఇప్పుడు అదే అలవాటైయింది. అలా మొత్తానికి రూమ్ కి చేరుకున్నాను.
జపాన్ విశేషాలు, చూసిన ప్రదేశాలు చాలా వున్నాయండోయ్... అవి వచ్చే టపాలలో....
This entry was posted
on Thursday, July 31, 2008
at 6:33 AM
and is filed under
జపాన్,
ప్రయాణాలు
. You can follow any responses to this entry through the
comments feed
.
7 comments
ముఖ్యమైన కొన్ని జపనీస్ మాటలు వాటి తెలుగు అర్థాలు రాయగలరా? ఒక ఇంటి చిరునామా అక్కడ ఎలా వుంటుంది? చిరునామాతో ఇల్లు కనుక్కోవటం సులభమా? వచ్చే టపాలలో మీ వీలుని బట్టి ఈ అంశాలను స్పృశించండి.
July 31, 2008 at 9:40 AM
Lovely ! Your blog's template is so good. And I look fwd to your next posts on Japan.
July 31, 2008 at 9:57 AM
త్వరగా జపాన్ తిండి ముఖ్యంగా వారి టీ,చేపలు ఇలాంటివాటి గురించి చెప్పి పుణ్యం కట్టుకోండి
July 31, 2008 at 10:36 AM
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మీ జపాన్ కబుర్లు.
చదువుతుంటె చదవలనిపిస్తుంది.
waiting 4 next post..
August 1, 2008 at 4:17 AM
చాలా బాగున్నాయండి మీ జపాన్ కబుర్లు
వచ్చే టపా కోసం వేచి వుంటాను
August 1, 2008 at 11:04 AM
@ Murali ,
నెనర్లు,
@cbrao , @రాజేంద్ర కుమార్ దేవరపల్లి,
నెనర్లు, తప్పకుండానండి, ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్క టపా వ్రాద్దామనుకుంటున్నాను.
@sujata, @మీనాక్షి, @శ్రీకాంత్ వాడరేవు,
నెనర్లు, సాధ్యమైనంత చెప్పడానికి ప్రయత్నిస్తాను !!!
August 3, 2008 at 4:33 AM
Post a Comment
టపాలు
నేను
- ప్రపుల్ల చంద్ర
- చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమి లేదు, శతకోటి బ్రహ్మీ లలో ఒక బ్రహ్మి. నా సరదా ఙ్ఞాపకాలను, ఆలోచనలను, చూసిన ప్రదేశాల విశేషాలను మీతో పంచుకోవాలనే ప్రయత్నమే ఈ బ్లాగ్.