నాకు విమానం ఎక్కడం అంటే చాలా భయం. బస్సు అనుకోండి, చెడిపోతే రోడ్డు ప్రక్కన ఆపుతారు. ట్రైన్ అనుకోండి, చెడిపోతే ఏ ప్లాట్ ఫామ్ దగ్గరో లేక ఎక్కడ ఆగిపోయిందో అక్కడే నిలిపివేస్తారు. కాని విమానం చెడిపోతే ఏంటి పరిస్థితి, గాల్లో ఆపలేరు కదా! అదే నా భయం. కాని నాకు జపాన్ కి వెళ్ళే అవకాశం రావడం తో ఎక్కడం తప్పలేదు.
ఒక శుభముహుర్తాన అందరి వీడ్కోలుల తో మొదటిసారి బేగంపేట ఏయిర్ పోర్ట్ లో అడుగుపెట్టా. ఎర్రబస్సులలో తిరిగే మనకు ఒక్కసారే ఏయిర్ పోర్ట్ అంటే అంతా వింతే మరి!!!
లోపలికి వెళ్లగానే అన్నీ రకరకాల విమానాల కౌంటర్లు కనపడ్డాయి. నేను సరాసరి నేను ఎక్కబోయే ’థాయ్ ఏయిర్ వేస్’ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నా టికెట్ చూపెట్టా. వాడు నా లగేజ్ కన్వేయర్ బెల్ట్ మీద పెట్టి ఒక ట్యాగ్ పెట్టి నాకొకటి ఇచ్చాడు. నా బ్యాగ్ బరువు గురించి ఏమైనా గొడవ చేస్తాడు అనుకుంటే అస్సలు ఏమి పట్టించుకోలేదు, అరే ఇంకో 2 కిలోలు తెచ్చుకుంటే అయిపోయేదే అనుకున్నాను. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అందరూ బయపెట్టినట్టుగా నా భుజానికి ఉన్న బ్యాగ్ బరువు చూడలేదు... అయ్యో అనవసరంగా కొన్ని ఇంట్లోనే పడేసానే అనుకున్నాను. ఇంతలో అతను నా బోర్డింగ్ పాస్ ఇచ్చాడు, నాకు వెంటనే నా స్నేహితుడు చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి, బోర్డింగ్ పాస్ తీసుకునేముందే కిటికీ సీట్ అడిగితే ఇస్తాడని. అరే అడగలేదే అని ’విండో సీట్ ఉందా?’ అని అడిగా, మొదటిసారిగా మరి, ఆ మాత్రం ఆతృత తప్పదు. అతను ఒక్కసారి నా వైపు అదోరకంగా చూసి ’ఈ ముక్క ఇచ్చేముందు సెప్పాలా!!’ అని మనసులో అనుకొని ( తిట్టుకొని ) తీసిన టికెట్ చింపేసి, కిటికి దగ్గరి సీట్ ఇచ్చాడు బ్యాంకాక్ వరకు. ’సారీ’ అన్నట్టుగా ఒక పిచ్చి నవ్వు పడేసా. అక్కడ మారే విమానానికి అక్కడే బోర్డింగ్ పాస్ ఇస్తారని చెప్పాడు. ఆ తరువాత ఆ ఫామ్ ఈ ఫామ్ అని రెండు, మూడు నింపి, ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగిన కొన్ని చెత్తప్రశ్నలకి సమాధానం చెప్పి లోపలికి వెళ్ళా.
లోపల ఫ్లైట్ టైం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను. మళ్ళీ ఎప్పటికి తింటానోనని ఒక షాప్ కి వెళ్ళి సమోసా అడిగా, 60 రూపాయలు అన్నాడు, 5 రూపాయల సమోసా 60 రూపాయలా, అంతా స్థలప్రభావం అనుకొని ఒకటి తీసుకున్నాను. ఒక ఫోన్ బూత్ కనపడితే ఇంటికి ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడాను. అక్కడ ఉన్న విమానాల పట్టికల నేను ఎక్కబోయే విమానం వివరాలు తప్ప మిగతా అన్ని ఉన్నాయి. మనకు అసలే కొత్త, అది కనపడక పోయే సరికి కంగారు, గభగభా ఆ ఫోన్ బూత్ వాడి దగ్గరికి వెళ్ళి అడిగా ఏంటి బ్యాంకాక్ వెళ్ళే విమానం పేరు లేదే అని, అతను కంగారు పడకండి సార్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు లేండి అని చెప్పాడు, ఇతనేంటి ఒకటి అడిగితే ఇంకో సమాధానం ఇచ్చాడు, RIN ఎంతా అంటే SURF 10 రూపాయలు అని చెప్పే చుంచు మొహం వీడూనూ అని మనసులో తిట్టుకొని మళ్ళీ ఎదురుచూడటం మొదలు పెట్టా. సమయం దగ్గరపడుతుంటే వెళ్ళి ముందు కూర్చున్నా.
అంతలో ఏయిర్ హోస్టెస్ లు ’థాయ్ ఏయిర్ వేస్’ అని బోర్డ్ పట్టుకొని నిల్చున్నారు. వెంటనే అక్కడ ’Q’ లో నిలబడ్డాను, తరువాత అందరు మన భారతీయ పద్దతిలో గుంపులుగా వచ్చి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కొత్త లైన్లు సృష్టించి మళ్ళీ అందులో వాళ్ళ వాళ్ళని ఇరికించి నానా రభస చేయడం మొదలు పెట్టారు. పాపం నా ముందే నిల్చొని వున్న ఒక పాశ్చాత్యుడు ( ఎక్కడ నుండో తెలియదు కాని ఎర్ర తోలు!!!!) తల పట్టుకొని ’ఏంటి ఇది?’ అనుకుంటూ విసుగ్గా ఎదో గొణిగాడు, నాకు మొదట నవ్వు వచ్చింది, ఇండియా నుండి వెళ్తున్నాడంటే ఈపాటికి మన వాళ్ళ గొప్పతనం గురించి తెలిసే ఉండాలే అనుకున్నాను, మనకైతే ఇది కొత్త కాదు కాని అతని ముందే కొద్దిగా నామోషిగా అనిపించింది. ఎర్రబస్సు అయినా ఏయిర్ బస్ అయినా మన పద్దతిలో పెద్ద తేడాలేదు అని నిరూపించారు.
అలా అందరిని చేధించుకొని విమానంలోకి అడుగుపెట్టా రాత్రి 12 గంటలకి, ఏయిర్ హోస్టెస్లు నవ్వుతూ స్వాగతం చెప్పారు. నాకు లోపలకి అడుగుపెట్టగానే ఒక పెద్ద బస్ లోకి వెళ్ళినట్టుగా అనిపించింది, విమానం లా అనిపించలేదు!!!, నా అంచనాలు ఎక్కువైయ్యాయేమో. ఒక రకమైన వాసన కూడా రావడం మొదలుపెట్టింది, అది అక్కడ వున్న ఆహార పదార్ధాల వల్ల అని తరువాత తెలిసిందనుకోండి. సీట్ ఎక్కడా అని చూస్తే చివరాకరిది నాది, కిటికీ ప్రక్కన కావలనుకుంటే అక్కడ దొరికిందన్నమాట.
పైన నా బ్యాగ్ పెట్టి కూర్చున్నాను. ఏయిర్ హోస్టెస్ లు వచ్చి అందరి బ్యాగ్ లు ఒక పద్దతిలో పెడుతున్నారు, ఒక బ్యాగ్ పెట్టడానికి స్థలం లేకపోయేసరికి అక్కడ ఉన్న పెద్ద బ్యాగ్ ను చూపిస్తూ ’ఇది ఎవరిది?’ అని అడిగారు, నాదే అని చెప్పా. కొద్దిగా మీ బ్యాగ్ మీ సీట్ వెనక పెట్టుకుంటారా అని అడిగితే, మనది విశాల హృదయం కదా సరే అని ఒప్పేసుకున్నాను. నెమ్మదిగా విమానం కదలడం మొదలయ్యింది. ’మనం బయలుదేరబోతున్నాము, మీ ఎలాక్ట్రానిక్ వస్తువులను ఆపేసేయండి’ అని ఎంత చెబుతున్నా నా ప్రక్కన కూర్చున్నతను మాత్రం ఏమి పట్టించుకోకుండా ఫోన్ లో తాపీ గా మాట్లాడుతున్నాడు. అంతలో ఏయిర్ హోస్టెస్లు విమానం విరిగిపోతే ఏం చెయ్యాలి, పెట్రోల్ అయిపోతే ఏం చెయ్యాలి, టైర్ పంక్చర్ అయితే ఏం చెయ్యాలి అని ఒక demonstration ఇచ్చారు, అసలే విమానం అంటే భయం ఉన్న నాకు చిన్నపాటి హాలివుడ్ సినిమా చూపెట్టారు. నేను మాత్రం పారాచ్యూట్ ఎక్కడా అని నా సీట్ కింద పైన మొత్తం వెతికా కాని కనపడలేదు, వాళ్లని అడిగితే బాగుండదని అడగలేదు!!.
తరువాత నడుముకు బంధనాలు వేసుకొని takeoff కి సిద్దమయ్యాను. విమానం ఒక్కసారిగా త్వరణాన్ని పెంచేసి వేగంగా కదులుతూ అలా గాలిలోకి ఎగిరింది. ఆ ఒక్క క్షణం ఒక గమ్మతైన భావన. ’feeling zero gravity for a moment' . అలా పైకి వెళ్లిపోతూ ఉంటే కిటికీలోంచి మన భాగ్యనగర రాత్రి అందాలను చూస్తూ, ధగధగా వెలిగిపోతున్న బుద్దభగవానుణ్ణి చూస్తూ కూర్చున్నాను, 1000 అడుగుల ఎత్తుకు వెళ్ళేసరికి మేఘాలు వచ్చేసాయి, అవి చూడగానే ఆనందానికి అవధులు లేవు. అలా అలా పైకి ఎగిరాక 25000 అడుగులు పైకి వెళ్ళాక, పైలెట్ ’ఇప్పుడు స్థిరంగా వెళ్తాం, పండగ చేసుకోండి’ అని సెలవిచ్చాడు. అందరం తమ తమ బంధనాలు తీసేసుకొని స్వేచ్చాజీవులం అయ్యాము.
మనకు ఏమి తెలియదు కాబట్టి నెమ్మదిగా నా ప్రక్కన కూర్చున్నతనిని గమనించడం మొదలు పెట్టా, ఆయన ఏం చేస్తే అది చూసి ఒక రెండు నిమిషాల తరువాత నేను చేయడం అన్నమాట!!!. ఆయన సీట్ ను వెనక్కు అనుకొని కూర్చున్నాడు, నేనూ ప్రయత్నించా, కాని అస్సలు కదలడం లేదు, ఏంటా అని వెనక్కి చూస్తే నా బ్యాగ్ !!, నేను చేసిన బల ప్రయోగానికి పాపం నన్ను బిక్కు బిక్కు మంటూ చూస్తోంది. మన విశాల హృదయం వల్ల ఇదొక బొక్క అని అప్పుడు తెలిసింది, ఏం చేస్తాం అలాగే నిటారుగా కూర్చున్నాను. పాటలు వినడానికి హెడ్ ఫోన్స్ ఇచ్చారు, ఆ పాటలు వినేసరికి లేని తలనొప్పి వచ్చింది, పక్కన పడేసా, తరువాత వాళ్ళు ఇచ్చిన తిండినంతా తినేసరికి, అన్నీ కలిసి ఒక రకంగా అనిపించడం మొదలైయింది. మధ్య మధ్య లో గతుకుల రోడ్డు మీద వెళ్తే బస్సు ఎగిరినట్టుగా విమానం కూడా తడబడుతోంది, ఇదేంటిరా బాబు ఇక్కడ కూడా ఇది తప్పదా అనుకోవడం, మళ్ళీ అలా జరగగానే భయపడటం ( మొదలే చెప్పాకదా!!! ), మొత్తానికి 3 1/2 గంటల తరువాత బ్యాంకాక్ వచ్చేసాము, అప్పుడప్పుడే తెల్లవారుతుంది, పైనుండి చూస్తే బ్యాంకాక్ చాలా అందంగా, అంతా ఒక పద్దతిలో అమర్చినట్టుగా చాలా బాగుంది. నెమ్మదిగా క్రిందికి దిగుతూ ’సువర్ణభూమి ఏయిర్ పోర్ట్’ (బ్యాంకాక్) కి చేరుకున్నాము.
ఏయిర్ పోర్ట్ కూడా చాలా బాగుంది, మన ఇమ్లిబన్ ని పెద్ద భూతద్దంలో చూసినట్టుగా ఉంది, ఇక్కడ కూడా అన్ని ప్లాట్ ఫామ్స్ ( గేట్స్ ) ఉన్నాయి, కాకాపోతే బస్సుల బదులు ఏయిర్ బస్సులు నిల్చొని వున్నాయి. వాటికి తగ్గట్టే స్థలం కూడా అంత పెద్దగా ఉంది. అక్కడ విమానం మారే కౌంటర్ కు దారి అని చూపెడుతుంటే అది చూసుకుంటూ వెళ్ళా, అలా ఒక 4,5 కిలోమీటర్లు నడిచాక అప్పుడు కౌంటర్ కనపడింది, హమ్మయ్య అనుకొని నరీటా ఏయిర్ పోర్ట్( టోక్యో ) కి బోర్డింగ్ పాస్ తీసుకున్నాను, ఈ సారి మాత్రం కిటికీ దగ్గర సీట్ దొరకలేదు. మళ్ళీ అక్కడ నుండి విమానం ఎక్కవలసిన గేట్ దగ్గరికి ఒక 4,5 కిలోమీటర్లు నడిచి, అక్కడ ఎదురుచూస్తూ కూర్చున్నాను.
ఈ సారి ఎక్కిన విమానం కొద్దిగా పెద్దదిగా ఉంది, బ్యాగ్ మాత్రం పైనే పెట్టాను. నా ప్రక్కన దాదాపు నా అంత వయసున్న దక్షిణ భారతీయుడు కూర్చుంన్నాడు. పేరు సెంథిల్ అని చెప్పాడు. ఓహ్ తమిళ్ తంభి అనుకున్నాను. మొదటిసారి వస్తున్నాడట, పాపం చాలా భయపడుతున్నాడు, నేను మాత్రం గంభీరంగా కూర్చున్నాను, ఏదో అన్ని తెలిసిన వాడిలా !!!. మాటల్లో అతను ఇండియా అని వాడాల్సిన చోట్లల్లా తమిళ్ నాడు అని, భారతీయ భాషలు అని వాడాల్సిన చోట్లల్లా తమిళ్ అని మాట్లాడటం, మళ్ళీ నాలుక కరుచుకోవడం. అలా ఏదో మాట్లాడితూ కూర్చున్నాము.
మరీ ప్రొద్దున్నే అయ్యేసరికి ప్రయాణం కొద్దిగా చిరాగ్గా అనిపించింది. శాఖాహారం అంటే మరీ పచ్చి కూరగాయలు, ఎండిపోయిన బ్రెడ్ ఇచ్చాడు. ఛీ! పాడు జీవితం అనుకొని ఏమి తినలేదు. ఈ సారి విమానం దాదాపు 40,000 అడుగుల ఎత్తులో ప్రయాణించింది. ఒక 5 1/2 గంటల తరువాత నరీటా ఏయిర్ పోర్ట్ లో దిగబోతున్నాము బంధనాలు వేసుకోండి అని అనగానే వేసేసుకున్నాము. విమానం వాలు గా వంగుతూ క్రిందికి దిగుతోంది, అంతలో నా బ్యాగ్ పెట్టిన క్యాబిన్ తలుపు తెరుచుకుంది, అయ్యో బ్యాగ్ క్రింద పడితే ఎలా అసలే చాలా బరువు గా ఉంది అని జేమ్స్ బాండ్ లెవిల్లో బంధనాలు తీసుకొని నిలబడ్డాను, అందరూ నన్నే చూస్తున్నారు!!, వాలు గా ఉండే సరికి నెమ్మదిగా బ్యాలెన్స్ చేస్తూ ఆ తలుపు పెట్టేసి మళ్ళీ బంధనాలు తగిలించుకున్నాను.
మొత్తానికి నరీటా ఏయిర్ పోర్ట్ లో దిగాము. అక్కడ కూడా 2,3 ఫామ్స్ నింపి, లగేజ్ తీసుకుని కస్టమ్స్ దగ్గరికి వెళ్ళా, సినిమాల్లో చూపెట్టినట్టుగా ( ముఖ్యంగా ’జీన్స్’ లో చూపెట్టినట్టుగా) మన బ్యాగ్ తీసి ఇదేంటి, ఇదేంటి అని అడిగితే భాషకాని భాషలో ఎలా రా బాబు అని ఊహించుకుంటూ ఉంటే, అక్కడ అలాంటిది ఏమి జరగలేదు, ఒక ఫామ్ తీసుకొని పంపించేసాడు. అలా ఏయిర్ పోర్ట్ బయట పడ్డాను. నాకు నేను జపాన్ కి స్వాగతం అని చెప్పుకున్నాను, ఎందుకంటే ఏయిర్ పోర్ట్ కి నాకోసం ఎవరూ రాలేదు కాబట్టి. తరువాత జరిగిన విశేషాలు వచ్చే టపాలో !!!.
17 comments
హ్హహ్హహ్హ బావుంది..
నేను కొరియా కి వచ్చేటప్పుడు వాడిచ్చిన బ్రేక్-ఫాస్ట్ దాదాపు ఇలాంటిదే... అయితే వాడు ఆ ఎండిపోయిన బ్రెడ్ తో పాటు ఆవకాయ పచ్చడి ఇచ్చాడు..! బ్రెడ్ తో ఆవకాయ తిన్నాను.. నిజంగా భలే ఉంది.. ఇప్పుడు రిటర్న్ లో వెళ్ళేటప్పుడు కూడా అదే పెడతాడేమో అని వెయిటింగ్.. లేకపోతే ఇంటికి వెళ్ళగానే బ్రెడ్ తో ఆవకాయ తినెయ్యాలి.. అస్సలు ఆవకాయ తో ఇన్ని ఉపయోగాలు ఉంటాయని కొరియా కి వచ్చేటప్పుడే తెలిసింది...!
మీ టపాని నేను బాగా ఎంజాయి చేసానండి
బాగా రాసారు!
మీకున్న భయాలు చాలక ఫ్లైట్ చెడిపోతే అ0టూ మమ్మల్ని కూడా భయపెడతారా?
కధన0 భలెవు0ది.బాగా రాసారు.
చాలా బాగారాసావు ప్రపుల్లా ...నీ టపా అదిరంది. నీ జపాన్ విశేషాల కోసం ఎదురుచూస్తూవుంటాం..
haha...I too had simlar experience.
especiallying observing and following the people around. :)
very nice. I enjoyed reading.
శాఖాహారం అంటే మరీ పచ్చి కూరగాయలు, ఎండిపోయిన బ్రెడ్ ఇచ్చాడు. ఛీ! పాడు జీవితం---ప్చ్
టెంప్లేట్ అదిరింది
నాకు ట్రావెలాగులన్నా, ప్రయాణ విశేషాలన్నా భలే ఇష్టం. బాగుంది మీరు చెప్పిన తీరు.
విమానం ఒక్కసారిగా త్వరణాన్ని పెంచేసి
విమానం త్వరణాన్ని పెంచేసిందా ??? :P
@విహారి, @Srikanth vadarevu, @శ్రీ , @మోహన, @Shankar Reddy,
నెనర్లు,
@మేధ,
నెనర్లు, ఈ సారి కూడా అవకాయ తిన్నారా మరి!!!
@రాధిక,
నెనర్లు, మీరు ఈ పాటికి చాలా సార్లు ఎక్కి ఉంటారు, మీరు భయపడితే ఎలా? :)
@Murali.Marimekala,
నెనర్లు, తప్పకుండా!!
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి,
నెనర్లు, కొన్ని సార్లు తప్పదు కదండి.
@ప్రవీణ్ గార్లపాటి,
నెనర్లు, నాకు చాలా ఇష్టం,
త్వరణం అంటే acceleration కదండీ!!! ఒక్కసారిగా పెంచేస్తుంది కదా takeoff అవ్వాలంటే!!!
మీరు అడిగింది అర్థం అవ్వలేదు :(
RIN ఎంతా అని అడిగితే 10 రూ.surf...
అని చెప్పాడు చుంచుమొహం..హ హ హ హా
చాలా బా రాసారు చంద్రా గారు..
@మీనాక్షి ,
నెనర్లు
అదేంటండీ, నా అనుభవాలు మీరు రాశారు? ఒక్కదాన్నే హైదరాబాదు నించీ చికాగో వెళ్ళినపుడు నావీ ఇవే అనుభవాలు!
@సుజాత ,
మొదటిసారి వెళ్ళే వాళ్ళందరికి, అదీ ఒక్కరే వెళ్ళే వాళ్ళకి, ఇలాంటి అనుభవమే ఉంటుందేమో :)
Mama, kummesaav.. Neelo Yandamoori kanipistunnadu.. Nee kathanam baavundi..
@sriks
thank you ra.... edo nee abhimanam
Post a Comment
టపాలు
నేను
- ప్రపుల్ల చంద్ర
- చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమి లేదు, శతకోటి బ్రహ్మీ లలో ఒక బ్రహ్మి. నా సరదా ఙ్ఞాపకాలను, ఆలోచనలను, చూసిన ప్రదేశాల విశేషాలను మీతో పంచుకోవాలనే ప్రయత్నమే ఈ బ్లాగ్.