तूतो ’మరీ’ है  

Posted by ప్రపుల్ల చంద్ర in ,

ఏంటీ టపా పేరు వింతగా అనిపిస్తోందా !! చివర్లో మీకే తెలుస్తుంది లేండి. మన బ్లాగర్లు హిందీ తో వాళ్ళ అనుభవాలు చెబుతూంటే నాకు హిందీ వల్ల కలిగిన కితకితలు గుర్తుకువచ్చాయి, ఆ కితకితలే ఈ టపా. హిందీ మన మాతృభాష కాదు కాబట్టి అప్పుడప్పుడు తంటాలు తప్పవు.

నా చిన్నతనంలో ఒకసారి మేము షిరిడి వెళ్ళాము. అక్కడ చాలా మంది హిందీ లో మాట్లాడుతూ కనపడ్డారు. అప్పటికే టీవీలో మహాభారత్, సర్కస్ లాంటివి చూస్తున్నాను కాబట్టి కొద్ది కొద్ది గా పదాలు తెలుసు... వాటి అర్థం తెలియకపోయినా !!!!.
ఏదో బొమ్మ కొనాలని నేను మా నాన్నతో కలిసి వెళ్ళాను. ఒక షాప్ దగ్గర మా నాన్న గారు బేరం చేస్తూంటే విన్నాను.
నాన్న - ’यॆ कित्ना है’
షాపువాడు - ’पन्द्रहा रुपय्या’
నాన్న - ’दस कॊ दॆतॆहॊ क्या’
షాపువాడు - ’नही आता है सर’

బేరం కుదరక అది కొనలేదు. నాన్నని అడిగి తెలుసుకున్నాను వాళ్ళు మాట్లాడిన మాటలకి అర్థం. ఇంకా ఏముంది నేర్చుకున్న వాటిని ప్రయోగించాలి కదా మరి. సరే నేను కూడా మాట్లాడాలి అనుకున్నాను నోరు మరీ దురదగా ఉంటే. మా వాళ్ళు చుట్టుప్రక్కల లేనిది చూసి ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను.
ఒక వస్తువు చూపిస్తూ అడిగా...

నేను - ’यॆ कित्ना है’
షాపువాడు - ’पांच रुपय्या’
నేను - ’दस कॊ दॆतॆहॊ क्या’ (మనకు అది ఒక్కటే తెలుసుకదా మరి)
షాపువాడు - !!!!!!!!!!!! ( ఆవక్కయ్యాడు )

షాపువాడు నన్ను ఎగాదిగా చూసాడు, వీడు అస్సలు కొనే రకమేనా అని. కాని నేను అంతగా పట్టించుకోలేదు, నా మనసు వెంటనే ’భేష్ బాగా మాట్లాడావు’ అని భుజం తట్టింది. అమెరికా వాళ్ళు, వాళ్ళు తయారుచేసిన ఆయుధాలు పరిక్షించుకోవడానికి, కారణాలు లేకుండా వేరే దేశాల మీద యుద్దం చేసినట్టు నేను కూడా నన్ను నేను పరిక్షించుకోవడానికి వెళ్ళా కాని నిజంగా కొంటామా ఏంటి. అనుకున్న పని అయిపోయిందని అక్కడ నుండి కదిలా. తరువాత వెళ్ళి మా వాళ్ళని ’पांच रुपय्या’ అంటే ఎంతో తెలుసుకున్నాను, అప్పుడు తెలిసింది వాడు ఎందుకు అలా చూసాడో.

తరువాత దూరదర్శన్ పుణ్యమా అని ’స్టోన్ బాయ్’, ’జంగిల్ బుక్’, ’అలిఫ్ లైలా’, ’డక్ టేల్స్’, ’మంగళ, గురు వారాలు రాత్రులు, శని వారం సాయంత్రం వచ్చే హిందీ సినిమాలు’ చూసి ఏదో కొద్దో గొప్పో హిందీ నేర్చుకున్నాను. కాని నాకు హిందీలో సంఖ్యలు మాత్రం అస్సలు నచ్చలేదు, మొదట్లో నేర్చుకోడానికి ప్రయత్నించా కాని 20 వరకు మాత్రమే వచ్చాయి, తరువాతవి కొన్ని గుర్తున్నాయి, ఇప్పటికీ 64, 87 లాంటివి ఎంతా అంటే ప్రశ్నార్ధకమే.


ఒకసారి మా ఇంట్లో అందరం కబుర్లు చెప్పుకుంటూ ఉంటే హిందీ గురించి ఏదో విషయం వచ్చింది. ఎవరో మా అక్కని ’నీకు హిందీ వచ్చా?’ అని అడిగారు. అక్క వచ్చు అంది. వెంటనే మా తమ్ముడు ఎంత వచ్చో తెలుసుకోవాలనుకున్నాడు. కాని ఆ తొందరలో అసలు విషయం మరిచిపోయాడు... వాడికీ అంతంత మాత్రమే వచ్చని. వాడికి అప్పుడు గుర్తుకువచ్చి అడిగిన ప్రశ్న ’तुम्हारा नाम क्या है?’, అది వినగానే అందరం గొల్లుమని నవ్వాము ఎంత కష్టమైన ప్రశ్న అడిగాడని. అది కూడా తెలియని వారు ఉండరేమో !!.


నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మా కాలేజ్ సెక్యూరిటీ గార్డ్ బీహార్ అతను. నేను మా స్నేహితులతో కలిసి బస్సు కోసం ఎదురుచూస్తూ ఒక చోట నిలబడి ఉంటే అతను వచ్చి హిందీ లో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏదో విషయం పై చర్చ మొదలైంది... అందరం వచ్చీ రాని హిందీలో ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నాము. చర్చ కాబట్టి చెప్పదల్చుకున్నది తొందరగా చెప్పెయ్యాలి, లేకపోతే వేరేవాళ్లు మనకు అవకాశం ఇవ్వరు గనుక. తిప్పలు పడుతూ మరీ మా ప్రతిభను చాటుతున్నాము. నేను ఏదో చెప్పాను (ఏం చెప్పానో గుర్తు లేదు). అప్పుడు నా స్నేహితుడు ’तूतॊ मरी है’ అన్నాడు. నా బుర్రలో ఉన్న హిందీ decoder ఒక్కసారిగా ఖంగుతింది, దానికి ఏమి అర్ఠం అవ్వలేదు, semantics error ఇచ్చింది. తొలిగించిన ఫలితాలు చూపెట్టాలా అంది. అది చూస్తే ’నువ్వు చచ్చావు’ లాంటి అర్ఠం ఇచ్చింది. కాని అది మేము మాట్లాడే విషయానికి సంబంధం లేదు. అంతలో తెలుగు decoder, 1 match found అంది. ఇది ఏంటి హిందీ లో మాట్లాడుతుంటే తెలుగు decoder కు ఎలా తెలిసిందని, ఆ పదం ఏంటా అని చూస్తే అది ’మరీ’. ఆ తెలుగు పదం తో ఏమయుండొచ్చు అని అలోచిస్తే, నేను అన్న మాటలకి, ’నువ్వు మరీనూ’, ’నువ్వు మరీ రా’ అనే అవకాశం ఉంది తెలుగులో అయితే.

అప్పుడు అర్థం అయ్యింది, వాడు తెలుగు నుండి హిందీ కి మార్చే క్రమంలో సగం మాత్రమే నిజానువాదం చేసాడు, తొందరలో ’మరీ’ కి ఏమనాలో గుర్తు రాక అలాగే వాడేసాడు "तूतॊ ’మరీ’ है " అని. అలా ఒక సెకను తరువాత అర్థం. అవ్వగానే నాకు నవ్వు ఆగలేదు... ఇప్పటికీ గుర్తుతెచ్చుకొని నవ్వుకుంటాము.

ఇంకా నయం అతను నాతో అన్నాడు కాబట్టి సరిపోయింది, ఆ బీహార్ అతనితో అని ఉంటే ఆయన నువ్వు చచ్చావనో ఇంకా ఏదో అన్నాడనో అనుకొని ఫీల్ అయ్యేవాడేమో. ఇవండీ నా హిందీ కబుర్లు.

This entry was posted on Thursday, July 10, 2008 at 6:04 AM and is filed under , . You can follow any responses to this entry through the comments feed .

27 comments

Anonymous  

చాలా బాగుంది ఈ టపా. మీ బ్లాగు టెంప్లేట్ అదిరింది.

July 10, 2008 at 7:54 AM

:) బాగుంది

July 10, 2008 at 8:13 AM

:-) స్టార్టింగ్ అదిరింది. ఇలానే కొనసాగించండి.

July 10, 2008 at 8:47 AM

ప్రపుల్ల చంద్ర గారు...బాగుంది మి టపా..
ఒక కొత్త పదం తెలిసింది నాకు....
కీప్ పోస్టింగ్..నైస్ వన్....
ఏక్,దో,తీన్,చార్,పాంచ్,చే,సాథ్,ఆఠ్,నౌ,దస్ గ్యారా......బారా..తేరా...తేర కరో..తేరా కరో.. గిన్ గిన్ గిన్ గిన్ ...ఇంత్ జార్...చంద్ర జి..పోస్ట్ కరో నయా టాపా.....

July 10, 2008 at 8:48 AM

మీ టపా అదిరింది. మీ టెంప్లేట్ ఇంకా అదిరింది. మీ స్నేహితుడి నిజానువాదం నిజంగా కేక. ఆ స్థాయిలో కాకపోయినా మేము కూడా బెంగుళూరులో అప్పుడప్పుడు కన్నడలోకి అనువాదాలు ట్రై చేస్తుంటాం లెండి. కాకపోతే మీ దగ్గర తెలుగు, హిందీ రెండు decoders వున్నాయి కాబట్టి, ఒకటి error ఇచ్చినా ఇంకోటి match చేసుకుంది. పాపం ఇక్కడ కన్నడ జనాలకి తెలుగు decoder లేకపోవటంతో, మా అనువాదాలు అర్థం చేసుకోలేక బిక్కమెహాలేస్తున్నారు.

July 10, 2008 at 8:53 AM
This comment has been removed by the author.
July 10, 2008 at 8:58 AM

aap to bhale hi. :D

July 10, 2008 at 8:59 AM

చాలా బాగుంది స్టార్టింగ్ అదిరింది ప్రపుల్ల చంద్ర గారు..పోస్ట్ కరో నయా టాపా.....

July 10, 2008 at 9:12 AM

:)))
మీ బ్లాగ్ టెంప్లెట్ డిఫరెంట్ గా బావుంది..

July 10, 2008 at 9:21 AM

ముందు మీ టెంప్లేట్ అదుర్స్! మీ టపా కూడా అదుర్స్!

ఆప్ తో మరీ హై, , ఎవరికైనా 'బీస్ ' తర్వాత అంకెలొస్తాయా?

July 10, 2008 at 10:05 AM

టపా & టెంప్లేట్ రెండూ చాలా బావున్నాయ్.

July 10, 2008 at 11:47 AM

మీ బ్లాగు భీ మరీ హైఁ! :-)
మాంచి టపా...

July 10, 2008 at 12:43 PM

तूतो ’మరీ’ है ప్రపుల్ల!!!!

July 10, 2008 at 3:09 PM

భలె :)

July 10, 2008 at 5:34 PM

ప్రపుల్లా గారు జన్మదిన శుభాకాంక్షలు :) పండగ చేయండి... :)

July 10, 2008 at 5:35 PM

:)

టెంప్లేట్ బాగుంది.

July 10, 2008 at 6:29 PM

ఆప్‌కా టెంప్లేట్ బహుత్ బాగుంది హై!!

July 10, 2008 at 9:14 PM

యే టపా భలే ఉంది హై. మేరే కో హిందీ రాదూ హై, అంకెలు మాత్రం వచ్చు హై! 18 కే బాద్ ఉన్నీస్, పిన్నీస్, టెన్నీస్, గిన్నిస్, ... ఐసా హోతా హై. ఉస్ మే గిన్నీస్ బడా పెద్ద నంబర్ హై.

July 10, 2008 at 10:19 PM

@నాగమురళి, @వేణూ శ్రీకాంత్, @ప్రవీణ్ గార్లపాటి
టపా, టెంప్లెట్ రెండూ నచ్చినందుకు నెనర్లు

@రాధిక ,@sujata , @కొత్త పాళీ
నెనర్లు

@నాగరాజా , @నిషిగంధ , @సిరిసిరిమువ్వ
టెంప్లెట్ నచ్చినందుకు నెనర్లు

@ఆనందం , @mmksworld, @meenakshi.a ,
నెనర్లు తప్పకుండా!!!

@సుజాత ,
నెనర్లు, అవునండి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం

@మేధ,
तूभी ’మరీ’ है ;)

@చైతన్య క్రిష్ణ పాటూరు,
నెనర్లు, బెంగుళూర్ వాళ్ళకి తెలుగు అర్థం అవ్వకుండ ఉండదే !!!!
నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా తెలుగులోనే మాట్లాడేవాణ్ణి.

@త్రివిక్రమ్ Trivikram ,
బాగుంది మీ జోక్ !!!!
19, 29, 39 అన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా సుళువు, అన్నిటికి ఉన్ తో ముందు సంఖ్యను కలపడమే.
उन्नीस, उन्तीस, उन्चालीस అలా, అందుకే ఇవి మాత్రం నాకు వచ్చు :)

July 11, 2008 at 8:13 AM

భలే రాసారు....

July 11, 2008 at 11:10 AM

బాగుంది మీ బ్లాగు. నేను చిన్నప్పుడు హిందీ నేర్చుకున్నప్పుడు, 20 వరకు నేర్చుకుని, తర్వాత పదులన్నీ బట్టీ పట్టాను (బీస్, తీస్, చాలీస్, పచాస్, సాఠ్, సత్తర్, అస్సీ, నబ్బే, సౌ అని). మిగతా అంకెలన్ని similar గా ఉంటాయి కాబట్టి బట్టీ పట్టనవసరంలేదు.

ఇంతకీ "तूतो ’మరీ’ है" అన్నదానికి కరెక్ట్ హింది ట్రాన్స్లేషన్ తెలిసిందా?

July 11, 2008 at 12:27 PM

bahut bagundi hai.. hu.. ho.....hai hai..! ;-)

July 11, 2008 at 1:16 PM

బెంగుళూరు జనాలకు తెలుగు బానే అర్థం అవుతుందండి. కాని మనం కన్నడ పరిజ్ఞానం చూపించాలని వాడే తెలుగన్నడంతోనే వాళ్ళకు చిక్కు. మా ఇంటి ఒనరుతో ప్రతిసారి ఇలా hybrid బాషలో ప్రయత్నించి విఫలమై, తెలుగులోకి వచ్చేస్తుంటాను.

July 11, 2008 at 11:31 PM

@Srividya, @మోహన
నెనర్లు

@K ,
నెనర్లు, నేను కూడా అంతేనండి,
ఇప్పడికి నేను ఇదే వాడుతాను అందుకే అస్సలు పదం గురించి అలోచించలేదు, ఉత్తరాది వాళ్ళ తో మాత్రం ’तूभी यार’ లాంటివి వాడుతూ ఉంటాను.

@చైతన్య క్రిష్ణ పాటూరు ,
:))

July 12, 2008 at 8:22 AM

@ ప్రఫుల్ల చంద్ర గారూ,

మీరిచ్చిన సలహాతో ఈ 5 రోజులూ ఉన్నీస్, ఉంతీస్, ఉంతా(లీ)స్, ... నేర్చేసుకున్నా. "ఉన్యాసీ" అయ్యాక "ఉన్నబ్బే" అంటే "అబ్బెబ్బే, కాద"నేశారు హిందీ తెలిసిన మిత్రులు. నవాసీ అనాలట! తర్వాత ఉన్‌సౌ అన్నా తప్పే, నవానవ్ అన్నా తప్పేనట. నిన్యానవే అనాలట. ఏంటో! :(

July 16, 2008 at 6:00 AM

:) chaalaa baagundi...

July 18, 2008 at 5:38 AM

@త్రివిక్రమ్ Trivikram,
ఓహ్ అయితే మొదలు పెట్టేసారా నేర్చుకోవడం??
మీరేంటండి, త్రివిక్రం శ్రీనివాస్ లా జోక్ లేస్తున్నారు, వారే మీరు కాదు కదా!!!

@ravindra,
నెనర్లు

July 18, 2008 at 7:26 AM

Post a Comment