జపాన్ లో చూడదగ్గ ప్రదేశాలు - 1  

Posted by ప్రపుల్ల చంద్ర in ,

నేనిక్కడ చూసిన చాలా ప్రదేశాల గూర్చి రాద్దామనుకున్నాను. కాని అవి రాయడానికి తక్కువలో తక్కువ 12,15 టపాలైనా పట్టేట్టున్నాయి. కాని అంత ఓపిక లేదు, అంతేకాక ఇంకో మూడు వారాల్లో నా తిరుగు ప్రయాణం. కాబట్టి ఒక 2,3 టపాల్లో "కట్టె, కొట్టే, తెచ్చే" అన్నట్లుగా వాటి గురించి రాద్దామనుకుంటున్నాను. జపాన్ కి కొత్తగా వచ్చే వారికి, పర్యటించాలనుకున్న వారికి ఉపయోగ పడుతుందనుకుంటుంన్నాను. (నేను కూడా మరిచిపోకుండా ఉండవచ్చనుకోండి, అది వేరే విషయం).

1.టోక్యో టవర్ : world's tallest self-supporting steel tower



ఈఫిల్ టవర్ ని అనుకరిస్తూ, దాని కన్నా ఒక 13 మీటర్లు ఎక్కువ పొడవు గా ఉండేట్టుగా కట్టిన కట్టడం. 50 సంవత్సరాల క్రితమే దీన్ని కట్టడం జరిగింది. ఈఫిల్ టవర్ అంత అందంగా ఇది కనపడదు కాబట్టి అంతగా పేరు రాలేదనుకుంటాను. 150మీటర్ల ఎత్తులో ఒక observatory, 250 మీటర్ల ఎత్తులో ఇంకో observatory ఉన్నాయి. ఈ observatory లే కాక టోక్యో టవర్ లో చూడటానికి చాలా ఉన్నాయి. గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ మ్యూజియం, మైనపు బొమ్మల మ్యూజియం, ట్రిక్ ఆర్ట్ గ్యాలరీ (images which creates illusion), ఆప్టికల్ ఇల్యూజన్ గ్యాలరీ (ఇప్పుడు లేదనుకుంటాను), అక్వేరియం ఉన్నాయి. ఇవే కాక చిన్న రెస్టారెంట్లు, చిన్న పిల్లలు ఆడుకోడానికి చిన్న పార్క్ లాంటివి కూడా ఉన్నాయి. మొత్తం మీద టోక్యో టవర్ చాలా బాగుంటుంది, ఒక్క రంగు తప్ప (ఇక్కడి నియమాల ప్రకారం టవర్లకు ఆ రంగు వెయ్యాలట). ఒక రోజు మొత్తం అందులో గడపవచ్చు. ఇప్పుడున్న ఈ టవర్ TV channels కి సరిప్పోవడం లేదని దాదాపు దీనికి రెండింతల ఎత్తులో ఇంకో టవర్ (610m, Tokyo Sky Tree) కడుతున్నారు. అది ఇంకో మూడు సంవత్సరాలకు పూర్తవుతుందట.

2.నిక్కో:



టోక్యో కి 140 కి.మీల దూరంలో ఉన్న పర్యాటక ప్రదేశం. ఇది ముఖ్యంగా షింటో, బౌద్ధ దేవాలయాలకి ప్రసిద్ది చెందింది. నిక్కో కూడా నేషనల్ పార్క్ గా గుర్తించబడింది. చుట్టూ కొండలతో, పచ్చని చెట్లతో ఉంటుంది ( జపాన్ లో 70% పర్వత ప్రాంతం కాబట్టి వాటి దగ్గరే అందాలన్నీ ). ఇక్కడి గుడులు చాలా పురాతనమైనవి. రకరకాల రంగులతో మలచబడ్డ శిల్పాలు, బంగారు రంగులో చేయబడ్డ పూల, లతల ఆకృతులతో చూడడానికి చాలా బావుంటాయి. ఇవి జపాన్ లో అన్నింటికన్నా అందమైన దేవాలయాలు. ఇక ఇక్కడి తోటలు చాలా బాగుంటాయి. ప్రకృతే దైవం అని అనిపించకమానదు. చుట్టూ కొండలు ఉన్నాయి కాబట్టి, ఎన్నో హైకింగ్ కోర్సులు ఉన్నాయి.


పై రెండు ఫోటోలు గూగిలించినవి, నేను తీసినవి కాదు



నవంబర్ లో నిక్కో కి వెళ్తే చాలా బాగుంటుంది. It will be full of autumn leaves. కొగెన్ జలపాతం( హైడ్రల్ విద్యుత్తును ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు), ర్యూజూ జలపాతం, చుజెంజి సరస్సు తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు. చలికాలంలో మంచు చాలా పడుతుంది. అప్పుడు ఇక్కడ స్కీయింగ్ కూడా చేస్తారట.

3.Sea paradise
:





అక్వేరియం, థీం పార్క్ రెండూ ఒక్కచోటే ఉండటం దీని ప్రత్యేకత. ’యొకొహమ’ కి దగ్గర్లో ’హకెజిమ’లో ఇది ఉంది. దాదాపు లక్ష రకాల సముద్రపు జీవులతో మూడంతస్తుల అక్వేరియం ఉంది. రక రకాల చేపలు, హైడ్రా, షార్క్, డాల్ఫిన్, తాబేళ్ళు, సముద్రపు గుర్రం, సీల్, పెంగ్విన్ ఇలా చాలా రకాల జీవులు ఉన్నాయి. అంతే కాక డాల్ఫిన్, సీ లయన్, సీల్ లతో ఒక ప్రత్యేకమైన షో కూడా ఉంది. ఒపెన్ అక్వేరియంలో మనం డాల్ఫిన్, సీల్ లను తాకవచ్చు కూడా. థీం పార్క్ లో సగం నీటిలో సగం నేలపైన ఉండే రోలర్ కోస్టర్, 100మీ ఎత్తులో ఉండే vertical fall, ఆక్వా రైడ్ ఇలా కొన్ని రైడ్స్ ఉన్నాయి. ప్రక్కనే టోక్యో సముద్రం బీచ్ ఉంది.

4.Gala Yuzawa snow resort
:



జపాన్ రైల్వే తో అనుసంధానించబడ్డ స్నో రిసార్ట్. టోక్యో నుండి ’షిన్ కన్ సెన్’ (బుల్లెట్ ట్రైన్) లో దాదాపు రెండు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. స్టేషన్ లోనే స్కీ పరికరాలు అద్దెకు తీసుకొని గొండొల(రోప్ వే) లో రిసార్ట్ కి వెళ్ళవచ్చు. రైలు టికెట్ చూపెడితే స్కీ పరికరాల అద్దె కొద్దిగా తగ్గిస్తారు. కొత్తగా వెళ్ళే వారికి ఈ రిసార్ట్ చాలా బాగుంటుంది. చిన్న కోర్సులు కొద్దిపాటి వాలు తో ఉంటాయి. 'గాలా' కి దగ్గర్లో ఉన్న నయెబా లో కూడా చాలా పెద్ద skii resort ఉంది. కాకపోతే అక్కడికి సొంత వాహనాల్లో వెళ్ళే వాళ్ళు వెళ్తారు. రైలు సౌకర్యం అంతగా లేదు.

హకొనె, జపాన్ - ట్రావెలాగ్  

Posted by ప్రపుల్ల చంద్ర in ,



టోక్యోకి దగ్గరలో ఉండే 'హకొనె నేషనల్ పార్క్' ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రదేశం. చుట్టూ పర్వతాలతో అందంగా కనపడే 'అషినొకొ సరస్సు', చాలా పురాతనమైన 'షింటో దేవాలయం', పొగలు కక్కుతూ ఆహ్వానం అందించే 'హకొనె అగ్నిపర్వతం', కళాఖండాలతో నిండి ఉన్న 'ఒపెన్ ఏయిర్ మ్యూజియం', ఈ ప్రదేశాలన్నింటిని కలుపుతూ ఉన్న రోప్ వే, కేబుల్ కార్, పడవలు, పర్వతాల మీద నడిచే రైళ్ళు, బస్సులలో ప్రయాణం, అన్నీ చాలా బాగుంటాయి. చుట్టూ పర్వతాలు ఉండటం వల్ల అక్కడి 'ఒన్ సెన్' (Hotspring) (సహజ సిద్దంగా వేడి అయిన నీటి లో స్నానం చేసే ప్రదేశాలు) లు చాలా ఉన్నాయి. చాలా ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి ప్రతిచోట టికెట్లు తీసుకోనవసరం లేకుండా మొత్తం అన్నింటికి కలిపి ఒక పాస్ తీసుకోవచ్చు, కాని రెండు లేక మూడు రోజులు తిరగగలిగే పాస్ లు దొరుకుతాయి. మేము అక్కడ ఉండేది ఒక్క రోజైనా రెండు రోజుల పాస్ తీసుకోవలసి వచ్చింది.



’హకొనె-యుమొతొ’ స్టేషన్ చేరుకొని అక్కడి నుండి మా యాత్ర మొదలుపెట్టాము. మొదట అషి సరస్సు కు బస్సులో బయలుదేరాము. ఈ ప్రయాణం అంతా ఘాట్ రోడ్డుపైనే. చల్లని వాతావరణం, మెలికల రోడ్లు, దట్టంగా ఉన్న చెట్లతో కొండల మధ్య ప్రయాణం చాలా బాగుంది. కొడైకెనాల్, శబరిమలై లా అనిపించింది.



'అషి సరస్సు'కు దగ్గర్లో 'షింటో దేవాలయం' ఉంది. ఆ ప్రదేశం ఒక చిట్టడివి లా ఉంటుంది. అక్కడి నుండి 'తొగెందయి' కి పడవలో (అషి సరస్సు పై) బయలుదేరాము. అవి చూడటానికి 'pirate ships' లా ఉన్నాయి. ఆ ప్రదేశం అంతా పర్వతాలే కాబట్టి వాటి మధ్య ప్రయాణం చాలా బాగుంది. 'ఫుజి పర్వతం' కూడా అక్కడి నుండి బాగా కనపడుతుంది.



'తొగెందయి' నుండి 'హకొనె పర్వతం' పైకి రోప్ వే ఉంది. ఇందులో క్యాబిన్ లు కొద్దిగా పెద్దగా ఉన్నాయి. దాదాపు పది మంది దాకా ఒకేసారి ప్రయాణం చేయవచ్చు. అలా హకొనె పర్వత శిఖరాన్ని చేరుకున్నాము. 3000 సంవత్సరాల క్రితం ఈ పర్వతం బద్దలయ్యింది. ఆ crator చుట్టూ అగ్నిపర్వతం ఇంకా క్రియాశీలకంగానే ఉంది. చాలా చోట్ల నుండి పొగలు రావడం చూడవచ్చు. crator దగ్గర సల్ఫ్యూరిక్ ఆవిరుల వాసన ఎక్కువగా ఉంటుంది. దగ్గరలో వేడి నీటి ప్రవాహాలను, 'ఒన్ సెన్' (Hotspring) లను చూడవచ్చు. అక్కడి సహజ సిద్ధమైన వేడి నీటిలో కోడిగ్రుడ్లను ఉడికించి అమ్ముతారు. సల్ఫ్యూరిక్ ప్రభావం వల్ల వాటి రంగు నల్లగా మారుతాయి. కాని లోపల మాములుగా తెల్లగానే ఉంటాయి. ఈ గ్రుడ్డు ఒక్కటి తింటే 7 సంవత్సరాలు ఎక్కువ బ్రతక వచ్చు అని ఇక్కడి వారి నమ్మకం. నేను రెండు తిన్నాను, అయితే 14 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతానేమో చూడాలి !!



ఆ తరువాత రోప్ వే లోనే 'సౌంజన్' కి చేరుకున్నాము. అక్కడి నుండి 'గొర పార్క్' కి కేబుల్ కార్ లో ప్రయాణం. ఈ కేబుల్ కార్ ఇంచుమించు రైలు లాగే ఉంది, కాకపోతే చాలా చిన్నది. గొర పార్క్ రంగురంగుల చెట్ల తో అందంగా ఉంది. గొరపార్క్ తరువాత స్టాప్ లో 'హకొనె ఒపెన్ ఏయిర్ మ్యూజియం' ఉంది. ఈ మ్యూజియం అంతా గడ్డి మైదానాలు, మధ్యమధ్యలో కళాఖండాలతో ఉంటుంది. చుట్టూ లోయలు, పర్వతాలవల్ల ఇంకా అందంగా కనపడతాయి. అంతేకాక paintings, sculptures మ్యూజియం కూడా ఉంది.

ఆ తరువాత ’హకొనె-తొజన’ రైలులో ప్రయాణం. ఈ రైలు, పర్వతం పై నుండి క్రిందికి దిగడానికి. దీంట్లో ప్రయాణం మాత్రం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఆ లోయల మధ్య ఎన్నో వంతెనలు, సొరంగ మార్గాలు కట్టారు. జపనీయుల సాంకేతికతను మెచ్చుకోకుండా ఉండలేము. ఆ రైలు మొదట ఒక దిశలో క్రిందికి(కొద్దిగా వాలుగా) వెళ్ళి కొంత దూరం తరువాత లైన్ మారి వ్యతిరేక దిశ లో క్రిందికి వెళ్తుంది. అలా మూడు, నాలుగు సార్లు మారుతుంది. అంటే మనం మెట్లు దిగినట్లుగా అన్నమాట. జూన్, జూలైలలో అక్కడ పూచే ఒక ప్రత్యేకమైన పూలతో ఆ ప్రాంతం చాలా అందంగా ఉంటుందట.

ఇవే కాక ’హకొనె’ లో చూడటానికి చిన్న చిన్న మ్యూజియం లు, పార్క్ లు చాలా ఉన్నాయి. ఇక ఇక్కడ ప్రఖ్యాతి చెందినవి ’ఒన్ సెన్’ లు (hotspring).’హకొనె’లో ఇవి చాలా ఉన్నాయి. ప్రొద్దున అంతా తిరిగిన తరువాత సాయంత్రం ఉపశమనం కోసం 'ఒన్ సెన్' లకు వెళ్తారు. సాధారణంగా మగవాళ్ళకి, ఆడవాళ్ళకి వేరు వేరు గా ఉంటాయి. ఈ 'ఒన్ సెన్' లు చూడటానికి చాలా చిన్న స్విమ్మింగ్ పూల్ లా ఉండి, పర్వతాల నుండి వచ్చే సహజమైన వేడి నీటి తో నింపుతారు. ఈ నీళ్ళు చాలా వేడి గా ఉంటాయి (40-45 డిగ్రీలు). మొదట మంచిగా స్నానం చేసి, తరువాత ఆ వేడి నీటిలో కూర్చుంటారు. జపనీయులకి ఇది చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళే ముందు అక్కడి పద్దతులు ముందే తెలుసుకొని వెళ్ళడం మంచిది, లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది. నేను అక్కడి 'ఒన్ సెన్' కి వెళ్ళలేదు. కాని ఒకసారి ఒక 'skii resort' కి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళాను. అది మంచుపర్వతాన్ని అనుకొని ఉన్న 'open air hotspring'. బయట -10 డిగ్రీలు నీళ్ళు 45 డిగ్రీలు. కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా చాలా బాగుంటుంది. indoor కూడా ఉంది. ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారన్న ప్రయత్నించాలి.